ఓ నా దేశ పాలకుడా! నేనొక రైతు బిడ్డను. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం, ఇందర్చేడ్ గ్రామ వాస్తవ్యుడిని. మీరు ‘మన్ కీ బాత్’లో చెప్తుంటరు కదా, ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్ నుంచి ఫలానా పౌరురాలు చెప్పిందని రేడియో సాక్షిగా, చిలవలు పలవలుగా. నేనూ చెప్తున్న వినండి మా రైతు బిడ్డల గోస. ‘మీ వడ్లు కొనము’ అని కరాఖండిగా మీరు చెప్తూంటే, ఎందుకు కొనరనే మా నిరసనను దేశద్రోహం అని మీరు ఫత్వాలు జారీ చేస్తుంటే అట్టడుగు పొరల్లోంచి నిస్సహాయ శోకం దాటి తన్నుకొస్తున్న మా ధర్మాగ్రహ మన్ కీ బాత్… విని తీరాలిపుడు మీరు!
‘పహలే పొఠోబా, నంతర్ విఠోబా’ అంటరు భక్త తుకారాం. పండరీపుర విఠలుడిని తన సర్వస్వంగా భావించి ఉన్నత మానవ జీవన విలువలు, జీవన్ముక్తి సోపానాల గురించి తత్వాలు పాడిన తుకారాం కూడా కడుపు నింపుకోవడాన్ని మించిన, పదిమంది కడుపు నింపడాన్ని మించిన దైవత్వం ఏదీ లేదంటరు. దేహమే దేవాలయం, జీవుడే సనాతన దైవం అన్న ఆదిశంకరుల బోధ కూడా ఉన్నది కదా. మరి నిత్యమూ శ్రీరాముడి పేరు స్మరిస్తూ, మన 80 శాతం మాకే ఓటు వేయండి లేకపోతే బుల్డోజర్లతో తొక్కిస్తం అనే బీజేపీవారు (తన కారు కింద రైతును తొక్కించి చంపిన కేంద్రమంత్రి కుమారుడి స్ఫూర్తితో, ఆ మంత్రిని ఇంకా కొనసాగిస్తున్న మోదీ క్రూర పరిహాసం దన్నుతో) తమ వివక్షాపూరిత విధానాల ద్వారా హిందువుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్నరు. ఇది శ్రీరాముడు సహించే పనేనా? శ్రీకృష్ణుడు క్షమించే పనితనమేనా?
వనపర్తి జిల్లాకు చెందిన, ప్రజలతో సంబంధాలున్న బీజేపీ నేతలు ఎవరన్న ఉంటే గింటే మీకు చెప్పిన్రో లేదో గాని నేనొక సంఘటన గుర్తు చేస్త మీకు. పెద్దమందడి మండలం జంగమయ్యపల్లిలో రాధిక అనే విద్యార్థిని ఆ మధ్య వార్తల్లో నిలిచింది. తెలంగాణ రాకముం దు, వచ్చిన తర్వాత రైతుల జీవితాలు ఎట్ల ఉన్నయో ఒక్క చిత్రంలో సాక్షాత్కరింపజేసింది. ‘నాడు ఉరితాళ్లకు వేలాడుతున్న రైతులు.. నేడు పంటచేలల్లో పసిడి సిరులు పండిస్తున్న రైతులు’ అనే అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించింది. ఏమన్న అర్థమైతున్నదా మీకు?
మా రాష్ట్ర సాధకుడు కేసీఆర్, తను సాధించిన భౌగోళిక రాష్ట్రంతో ఆగక తెలంగాణ మొత్తం బంగారు మాగాణం చేస్తున్నడు. తనే ఇంజినీర్ అయ్యి తెలంగాణలో ఇంచీ వదలకుండా నీళ్లు పారిస్తున్నడు. తనే అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అయ్యి యే పంట ఎపుడు వేస్తే మంచిదో చెప్తున్నడు. కల్లాలలో హరిత విప్లవం ఉరకలేస్తే ఆనందాశ్రువులతో మురుస్తున్నడు. ‘మీ వడ్లు కొనము, దిక్కున్న చోట చెప్పుకోండి’ అని మీరు అహంకరిస్తుంటే చంద్రశేఖరుడు మూడవ కన్ను తెరుస్తున్నడు.
మా ఈ ఆగ్రహానికి సహేతుకత ఉంది మోదీజీ! పంజాబ్‌లో వంద శాతం ధాన్యం కొంటూ, తెలంగాణ ధాన్యం కొనమని తెగేసి చెప్పడం ఏం నీతి? మా తెలంగాణ భారతదేశంలో భాగం కాదా? మీరు మా ప్రధాని కాదా? అది మా పార్లమెంట్ కాదా? రాజ్యాంగం మాకు ఇచ్చిన జీవించేహక్కును మీరు తుడిపేసిన్రా? దేశ నిర్మాణంలో అత్యంత కీలకపాత్ర పోషించే మా పాలనకు ప్రతి దినమూ కితాబులిచ్చే మీ కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి గణాంకాలు తెప్పించుకోండి మోదీజీ.. మీరు నిజమో, మీ మంత్రిత్వ శాఖలు నిజమో తెలుసుకోండి!
మా వాతావరణానికి, భూసార పరిస్థితికి, ఆహారపుటలవాట్ల స్థితికి అనుగుణంగా అనాదిగా మా రైతులు రెండు పంటల వడ్లు పండిస్తున్నరు. అది పట్టించుకోకుండా ‘సాలుకు ఒకటే కొంటం’ అని దబాయించుడు సరికాదు. ఉత్తరభారత ప్రజల అలవాట్ల ప్రకారం గోధుమలు ఒక పంట, వరి ఒక పంట వేస్తరు. మేమూ అట్లే వేయాలంటే ఎట్ల? డొక్లా మానేసి ఇడ్లీ తినమంటే, డొక్లాం అబద్ధాలు మానేసి దేశం గురించి ఆలోచించమంటే, లిట్టీ చోకా ఆపేసి పెసరట్టు తినమంటే తలూపుతరా మీరు నరేంద్ర మోదీ?!
దేశమంతా ఒకే పంట, దేశమంతా ఒకే మతం, దేశమంతా ఒకే పార్టీ, దేశమంతా ఒకే భాష- ఇదెక్కడి దారుణం? భిన్నత్వంలో ఏకత్వం మన సూత్రం. మన ఋషులు, మన యోగులు, మన వైతాళికులు, మన సంస్కర్తలు చెప్పిన మూలాలు మరిచి, ఆధారాలు విడిచి చేసే ఈ వికృత సాము యే ప్రస్థానాల కోసం మోదీజీ?! హిందూమత సారం మీకు ఏమి అర్థమయినట్టు?!
ధర్మం సర్వకాలసర్వావస్థలయందు ఒక్కటే. మీరు ఇప్పటికైనా అధర్మ మార్గం వీడండి మోదీజీ. అపుడెపుడో వాజపేయి మీకు చెప్పిన రాజధర్మం మరోసారి నెమరేసుకోండి. తెలంగాణను భారతదేశంలో భాగంగా గుర్తించండి. తెలంగాణ బిడ్డలను సహ పౌరులుగా స్వీకరించండి. కష్టజీవులైన తన ప్రజలకు ఆ కష్టానికి ఫలం దక్కాలనే తపనతో, ‘మా వడ్లు కొనండి’ అంటూ గత పార్లమెంటు సమావేశాల సందర్భంగా తన మంత్రివర్గ సహచరులతో ఢిల్లీలో ఎక్కే మెట్టు, దిగే మెట్టు రీతి అందరినీ కలిసి తెలంగాణ గోస వినిపించిన మా ముఖ్యమంత్రి వెనుక మొత్తం తెలంగాణ రైతాంగం ఉన్నది. రైతుబంధు అందుకుంటున్న సామాన్య బీజేపీ కార్యకర్తలైన రైతులకు కూడా ఈ కేంద్రం అన్యాయం పట్ల నిరసన ఉన్నది. కేసీఆర్ ధర్మాగ్రహం పట్ల రహస్యామోదం ఉన్నది. మతం తిండిపెట్టదని గ్రహించినపుడు, తుకారాం బోధ స్మరణకు వచ్చినపుడు, మీరు చెప్పే 80 శాతం హిందువులు కూడా తిరగబడినపుడు అపుడు వస్తుందా మీకు బుద్ధి నరేంద్ర మోదీ?! ఢిల్లీలోనే కాదు తెలంగాణ గల్లీగల్లీలలో కూడా ధర్నాలు, ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతం. లోక్‌సభ,
రాజ్యసభలలో రైతు పక్షపాత రాజకీయపార్టీల మద్దతు కూడగడతం. ఉధృత పోరాటం చేసి మీ మెడలు వంచుతం, మేడలలోంచి దించుతం. మతం పేరుతో భ్రష్ట రాజకీయం చేసే మీకు ఉద్యమాలు, తిరుగుబాట్లు, హక్కుల సాధనలు కొత్తకానీ, మాకు కాదు. మా స్వేదమూ, రుధిరమూ తయారుకాబడ్డదే వీటితో. తస్మాత్ జాగ్రత్త!
మోదీజీ, మీరు తలచుకుంటే వడ్లు కొనడం పెద్ద సమస్య కాదు. స్వాతి చతుర్వేది బయటపెట్టిన I Am A Troll లో చెప్పినట్టు మీరు, మీ దుష్ట మంత్రాంగం చేసే విద్వేష వ్యవసాయం, భావజాల గంజాయి సాగు కోసం పెట్టే సమయంలో, ఖర్చులో అతికొద్ది శాతం కేటాయించినా రైతులు చల్లగుంటరు. ద్వేష రుషి నుంచి మీరు కనీసం మనిషిగా మిగలగలుగుతరు. బీజేపీ కానీ, దాని సైద్దాంతిక మూలమైన ఆర్ఎస్ఎస్ భావజాలం కాని, ఈ దేశ ప్రజల గురించి ఆలోచిస్తే భారతదేశం ప్రపంచానికే తలమానికమవుతుంది. సుగుణాల పుట్ట, సకల సంపదల గర్భ అయిన మన దేశం మరలా తలెత్తుకు నిలబడగలుగుతుంది. స్కాండినేవియన్ దేశమైన ఫిన్లాండ్ ప్రపంచంలోకెల్లా ఆనందకరమైన దే శం అని నిన్ననే కదా చదివినం. ఒకటి నుంచి ఏడు ర్యాంకులు వారివే క దా? మనది అందులో 136వ ర్యాం కు కదా? అట్లనే ఉందామా? ఆనందకరమైన దేశంలా మారే ప్రయత్నం చేద్దామా? ఇది మీరు ఆలోచించుకోవాలి నరేంద్రా! బేఖాతరు చేస్తే మీ గురించి హిందువులు పునరాలోచిస్తరు. అది తెలంగాణ నుంచే మొదలైతది. ఇంక, మీ ఖర్మ!
తెలంగాణ బిడ్డలారా..! వల్గర్ రాజకీయం చేసే బీజేపీ కాలనాగుల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఎనిమిదేండ్లలో అన్నిరంగాల్లో తెలంగాణ అద్భుత ప్రగతికి కేంద్ర మంత్రిత్వ శాఖల, అంతర్జాతీయ సంస్థల, రాజ్యాంగబద్ధ వ్యవస్థల ప్రశంసలందుకుంటున్న మన సర్వతోముఖాభివృద్ధికి మతం పేరుతో అడ్డుకట్ట వేసే దుర్మార్గాలను నిలదీద్దాం. ‘మా యాసంగి వడ్లు కొనండి’ అని పార్లమెంట్లో మనకోసం కొట్లాడే ఎంపీలకు మరింత బలం ఇద్దాం. గల్లీ గల్లీలో కేంద్ర ప్రభుత్వ వివక్షపై యుద్ధభేరీ మోగిద్దాం. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, రైతుసమితి/ డీసీసీబీ/ ఏఎంసీ బాధ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, మంత్రులు ప్రతి ఒక్కరూ కేసీఆర్ సైన్యమై కదను తొక్కాలి ఈ ఆపత్సమయంలో పార్టీలకతీతంగా ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, కులసంఘాలు, ఉద్యమ సంస్థలు కదలిరావాలి. తెలంగాణ రైతును కాపాడుకునే మార్గం ఇదే. ఆ సమయమూ ఇదే! కదలండి, ఇది మన బతుకుపోరాటం!
జై తెలంగాణ!
– శ్రీశైల్‌రెడ్డి పంజుగుల , 90309 97371