రేపు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం..
అద్భుతమైన తెలివితేటలతో రాణించాలంటే అమెరికా వెళ్లి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకోనక్కరలేదని రుజువు చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ స్కూల్లో చదువుకుంటే కూడా లభించని వ్యవహారదక్షత ఆయనలో పుష్కలం.
బిజినెస్ స్కూల్లో నేర్పే మోటివేషన్, డెలిగేషన్ మొదలైన విషయాలు కేసీఆర్‌కు పుట్టుకతోనే అబ్బాయనుకోవాలి. రాజకీయాల్లో చేరి మంత్రిగా పనిచేసినప్పుడు, ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఇప్పుడు పని చేస్తున్నప్పుడు ఈ లక్షణాలు ఎంతగానో ఆయనకు ఉపయోగపడ్డాయి, పడుతున్నాయి. కేసీఆర్ నవజాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తిచేసుకున్నప్పుడు ఊహించని వ్యక్తినుంచి ఆయనకు దక్కిన ఒక చక్కటి కితాబును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషి కాదు. దేశ ప్రధానిగా మన్మోహన్సింగ్ ఉన్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్థికవ్యవహారాల పాత్రికేయుడు సంజయ్‌బారు. నిజానికి ఈ బారు ప్రత్యేక తెలంగాణకు బద్ధ వ్యతిరేకి. కరడుగట్టిన సమైక్యవాది. తన మనస్సులోని ఈమాటను ఆయన ఏనాడూ దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు, తెలంగాణ కల సాకారమైన ఏడాది తర్వాత అన్నమాటలివి. నిజానికి అక్షరాలా సత్యమైన మాటలు.
‘డెక్కన్ హైదరాబాద్ గురించి నేను భయపడ్డదేమీ జరగలేదు. ఇక్కడివారికి అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం తెలంగాణ సొంతం. అన్నింటికీ మించి హైదరాబాద్ ఉన్న ప్రత్యేక ఆకర్షణ, శోభ ఇవేవీ (రాష్ట్రం ఏర్పడిన తర్వాత) చెరిగిపోలేదు. ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమోనని నేను భయపడ్డాను. కానీ, నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి’ అని ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో సంజయ్ బారు పేర్కొన్నారు.
ఈ ఘనతను కేసీఆర్ ఏనాడూ తన సొంత ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయలేదు. సరికదా, సమయం దొరికినప్పుడల్లా సంబంధిత మంత్రి, జెన్కో చైర్మన్, అధికారులు, సిబ్బంది సమష్టి కృషివల్లనే ఈ ‘అద్భుతం’ సాధ్యమైందని బహిరంగంగా చెప్పుకొచ్చారు కూడా.
అనర్గలంగా ప్రసంగించేవారు రాజకీయాల్లో చాలామంది కనబడతారు. కానీ ఆకట్టుకునేలా ఉపన్యసించడం కేసీఆర్‌కు వెన్నతో పెట్టిన విద్య. తన ఎదురుగా ఉన్న శ్రోతలను బట్టి ఆయన ప్రసంగశైలిని మార్చుకుంటారు. మహిళలు, ఉపాధ్యాయులు, మేధావులు, విలేకరులు ఇలా ఎవరికి తగ్గట్టు అప్పటికప్పుడు ఆయన ప్రసంగ ధోరణి మారిపోతుంది. వేదిక ఎక్కి ఆశువుగా మాట్లాడితే ఇక దానికి అడ్డే ఉండదు.
రాజనేవాడికి స్పందించే గుణం ఉండాలని కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్తాడు. సీఎం కేసీఆర్‌కు ఈ లక్షణం అతికినట్టు సరిపోతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా అన్ని దినపత్రికలు చదువడం ఏండ్లుగా ఆయనకున్న అలవాటు. పత్రికల్లో వచ్చే ముఖ్యమైన వార్తలను క్రోడీకరించి అనుదినం అందించే యంత్రాంగం ప్రతి ముఖ్యమంత్రికి ఉన్నట్టే కేసీఆర్‌కూ ఉంది. అయినా ఆయన స్వయంగా ప్రతి పత్రికను ఆమూలాగ్రం చదువుతారు. ఆ తర్వాత ఆయా విషయాలపై ఆయన తక్షణం స్పందించే తీరు అద్భుతం అనే చెప్పా లి. ఒక్కోసారి ఆయన వ్యవహారశైలిని గమనిస్తుంటే అమెరికన్ రచయిత డేల్ కార్నెగి రాసిన పుస్తకాన్ని కేసీఆర్ ఆమూలాగ్రం చదివి ఒంట బట్టించుకున్నారా అనిపిస్తుంది.
స్టేట్‌బ్యాంక్‌లో చీఫ్ జనరల్ మేనేజర్‌గా పనిచేసిన మా రెండో అన్నయ్య రామచంద్రరావు నాకు ఈ పుస్తకం గురిం చి చెప్పారు. కేసీఆర్ తరహా చూస్తుంటే ఆయన డేల్ కార్నెగి రాసిన ‘స్నేహితులను, ప్రజలను ప్రభావితం చేయ డం ఎలా?’ అనే పుస్తకాన్ని ఆమూలాగ్రం చదువడమే కాకుండా దాని నుంచి స్ఫూర్తి పొంది ఉంటారనే అభిప్రాయాన్ని ఆయ న నాతో పంచుకున్నారు. ఈ పుస్తకం వచ్చి ఏండ్ల్లు గడిచిపోయాయి. కొన్ని కోట్ల ప్రతులు అమ్ముడుపోయాయి.
ఆ పుస్తకంలో డేల్ కార్నెగి ఇలా పేర్కొంటారు. ‘పని చేసేవారినుంచి మంచి ఫలితాలు రాబట్టాలంటే వారిని మెచ్చుకుంటూ ఉండాలి. ప్రతి మనిషికీ అంతర్లీనంగా తన పేరుపై తగని మమకారం ఉంటుంది. అతడు, ఆమె అని ఏదో పొడిపొడిగా కాకుండా, ‘పలానా వారు’ అని పేరుతో పిలిస్తే, పేరుపెట్టి ప్రశంసిస్తే అందులోని ఉల్లాసమే వేరు. అదీ తనపైవారు పేరుపెట్టి నలుగురిలో పొగిడితే ఇకవారి ఆనందానికి అంతే ఉండదు’.
ఆయన తన పుస్తకంలో గీత బోధ చేశారిలా. ‘మీ సహచరులు, సాటి ఉద్యోగులు చేసిన మంచి పనిని ప్రశంసించేటప్పుడు ఆ పనిని ఏదో మాటవరసకు చేసినట్టుగా కాకుండా మనఃస్ఫూర్తిగా చేయండి. బాగా పని చేసేవారిని బాగా ప్రశంసించండి. ఆ పొగడ్తలు పెదవి నుంచి కాకుండా గుండెల్లోంచి రావాలి. అప్పుడే వాటికి నిబద్ధత ఉంటుంది. విలువ పెరుగుతుంది.’ కేసీఆర్ ఈ సూత్రాన్ని చాలా లాఘవంగా ఒడిసిపట్టుకున్నారనే చెప్పాలి. అందుకే ఆయన తన ఆలోచనలకు తగ్గట్టుగా అధికారులతో, మంత్రులతో చక్కగా పని చేయించుకోగలుగుతున్నారు.
చివరిగా ఓ ఆప్త వాక్యం. అధికారం అనేది సమాజానికి మంచి చేయడానికి లభించే ఒక మంచి అరుదైన అవకాశం. అలా దొరికిన అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగడమే ఏ రాజకీయ నాయకుడికైనా అవశ్యకర్తవ్యం. 69వ ఏట అడుగుపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పుట్టినరోజు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకొంటూ తన పదవీ కాలాన్ని ఈ దిశగానే కొనసాగించాలని కోరుకుంటున్నాను.
భోజనం వేళకు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందిని భోజనాలకు లేపడం ఆయనకు అలవాటని ఆయన సన్నిహితులు చెప్తుంటారు. స్వతహాగా భోజనప్రియుడు కాకపోయినా ఇతరుల ఇష్టాయిష్టాలను గమనిస్తూ ఒక గృహస్తుగా భోజనాదికాలు కనుక్కుంటూ ఉండటం ఆయనకు అలవాటని కూడా చెప్తుంటారు. నాతో సహా హైదరాబాద్‌లోని చాలామంది విలేకరులకు ఇది అనుభవైకవేద్యమే.
పరిపాలనలో ‘నేను’ అని కాకుండా ‘మేము’ అనే పదాన్ని మించిన మోటివేషన్ ఏముంటుంది? అందుకే ఈ విషయంలో ఇక ఆయన కొత్తగా నేర్చుకోవాల్సిన పాఠాలు లేకుండాపోయాయి. అలాగే,బిజినెస్ గురువులు చెప్పే మరో అంశం డెలిగేషన్. అంటే అధికారాలు, బాధ్యతల బదిలీ. ముఖ్యమంత్రిగా ఎన్నో అధికారాలు తనవద్దనే కేంద్రీకృతమై ఉన్నా వాటిని సంబంధిత మంత్రులకు, అధికారులకు కేసీఆర్ అప్పజెప్పేశారు. లక్ష్యాలు నిర్ణయించి, ఫలితాలు రాబట్టాలని నిర్దేశించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలే ఇందుకు చక్కటి ఉదాహరణలు.
-భండారు శ్రీనివాసరావు , 98491 30595