కేంద్ర ప్రభుత్వం కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నది. ఈ సందర్భంగా దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి
కార్మికునిపై, ప్రతి పౌరునిపై ఉన్నది. సంపద సృష్టికర్తలైన కార్మికులు, కర్షకులు గత ఏడాదిన్నర కాలంగా కేంద్ర ప్రభుత్వ విధానాలపై
సమైక్యంగా పోరాడుతున్నారు.
కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాల కోసం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను, నాలుగు లేబర్ కోడ్లను రద్దుచేయాలని నినదించారు. ఈ క్రమంలోనే కేంద్రం వెనుకడుగు వేసి వ్యవసాయ చట్టాలను రద్దుచేసింది. కరోనా యావత్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. ఈ సంక్షోభ సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సామాన్యుల బతుకులను మరింత దుర్భరం చేసే అమానుష చర్యలకు పాల్పడింది. ఉపాధి తీవ్రంగా దెబ్బతిని, ఆదాయాలు కోల్పోయిన ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ.7,500 ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను కేంద్రం పట్టించుకున్న పాపానపోలేదు. మరోవైపు ప్రభుత్వరంగాన్ని, దేశ సంప దను, సహజ వనరులను స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు కారుచౌకగా కట్టబెట్టే విధానాలు చేపట్టింది. బీఈఎంఎల్, బెంగళూరులో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థను, రూ.50 వేల కోట్ల ఆస్థులతో ఉన్న ప్రభుత్వరంగ సంస్థలను కేవలం రూ.2 వేల కోట్లకు అదానీ, అంబానీ కార్పొరేట్లకు అమ్మేసి, కార్మికుల జీవితాలను రోడ్డుపైకి ఈడ్చింది.
స్వాతంత్య్రానంతరం దేశ ప్రజానీకం ఎంతో శ్రమించి అభివృద్ధి చేసుకున్న ప్రభుత్వరంగ సంస్థల మౌలిక సదుపాయాలు, సహజ వనరులను కార్పొరేట్ కంపెనీలు లూఠీ చేసే విధానపర నిర్ణయాలను కేంద్రంలోని మోదీ నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం అమలుచేస్తున్నది. ఎన్నో త్యాగాలు, రక్తతర్పణలతో పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరపకుండా, ఏకపక్షంగా 4 లేబర్ కోడ్లుగా చట్టాలు చేసింది. తిరిగి 12 గంటల పని విధానాన్ని అమల్లోకి తెస్తున్నది. దీంతో యూనియన్ పెట్టుకునే హక్కు, సమ్మె హక్కులు ప్రమాదంలో పడ్డాయి. నూతన లేబర్ కోడ్లతో కార్మికవర్గాన్ని తిరిగి బానిసత్వంలోకి నెట్టివేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థల వాటాల అమ్మకం వరకే పరిమితం కాకుండా, వ్యూహాత్మక అమ్మకం పేరుతో వంద శాతం వాటాలు అమ్మేస్తున్నది. నేషనల్ మానిటైజేషన్, పైప్‌లైన్ పేరుతో జాతీయ రహదారులు, రైళ్లు, విద్యుత్ స్టేషన్లు, ట్రాన్స్మిషన్, చమురు-సహజ వాయువు పైప్లైన్లు, బొగ్గుబావులు, విమానాలు, టెలికాం టవర్లు, ఓడరేవులు, ఎఫ్‌సీఐ గోడౌన్లు, క్రీడా మైదానాలతో సహా ప్రభుత్వ మౌలిక బీమా, మ్యూచ్‌వల్ ఫండ్స్‌కు అప్పజెప్తున్నది. ఇలాంటి ప్రజా వ్యతిరేక విధానాలు దేశ ఆర్థిక స్వావలంబనకు ముప్పు తెస్తాయని కార్మిక సంఘాలు విశ్వసిస్తున్నాయి.
తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేట్ శక్తులకు మాత్రమే అనుకూలంగా ఉంది. ఈ బడ్జెట్ సామాన్య ప్రజలకు ఏ మాత్రం ఉపయోగకరంగా లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ (ఎల్ఐసీ) రూ.31 లక్షల కోట్లకుపైగా ఆస్తులు కలిగి ఉన్న సంస్థ. దీనికి వేల కోట్ల పాలసీలు కలిగి ఉన్నాయి. దేశంలో వివిధ రంగాలలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రపంచ ఇన్సూరెన్స్ చరిత్రలోనే అత్యంత సమర్థవంతమైన సంస్థగా పేరొందింది. ఇంతటి ప్రఖ్యాత సంస్థలో 1956లో కేంద్రం పెట్టిన మూలధనం రూ.5 కోట్లు మాత్రమే. ఇప్పుడు అదే కేంద్ర ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలకు ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రయత్నం చేయటం ఎవరి లాభం కోసం..? కార్పొరేట్ కంపెనీల యజమానులు అదానీ, అంబానీల కోసం కాదా..?
(వ్యాసకర్త: కన్వీనర్, వి.దానకర్ణా చారి ,98668 97464 కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల ఉద్యోగుల జేఏసీ, తెలంగాణ)