గుక్కపట్టి ఏడ్చే బిడ్డ దుఃఖంలో పాలివ్వమని తల్లిని అర్థించే వేదన ఉంది. ఆ బాధను అర్థం చేసుకున్న మహిళే తల్లి అవుతుంది. సమస్యల్లో అల్లాడిపోయే జనం చేసే ఆర్తనాదాల్లో మమ్మల్ని ఆదుకోండన్న అభ్యర్థన ఉంది. దానిని గుర్తించి జనాల్ని గుండెకు హత్తుకొని, సాంత్వన చేకూర్చేవాడిని నిజమైన పాలకుడంటాం. కానీ, దేశంలోని 140 కోట్ల మందిని పాలించే కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి తల్లికి ఉండే మనసుగానీ, పాలకుడికి ఉండే సామర్థ్యంగానీ లేవు. కరోనా కాలంలో యావత్‌దేశం కష్టాల కడలిలో తలమునకలై, కనీసావసరాలు తీరక అరిగోస పడుతుంటే ఉపశమనం కలిగించాల్సిన బాధ్యత కేంద్రానిది. దానిని విస్మరించి, ఊకదంపుడు ఉపన్యాసంతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిది ఆత్మవంచనే అని అనకతప్పదు. గుండుసున్నా బడ్జెట్‌ను తెచ్చి పైగా రాజధర్మం గురించి మహాభారత శ్లోకాలను వల్లించటం చూస్తే ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురునా అన్నట్లుంది.
ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా కరోనా అనే మహమ్మారి యావత్‌దేశాన్ని వరుసగా రెండేండ్లుగా స్తంభింపజేసింది. దినసరి కూలీలు, శ్రామికులు, కార్మికులు, ఉద్యోగులు అనేకానేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆర్థికవ్యవస్థ అడుగంటింది. మెజారిటీ ప్రజలకు ఉపాధి కలిగించే వ్యవసాయ రంగం సవాలక్ష సమస్యలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. మహా సంక్షోభాలే మహత్తర అవకాశాల్ని సృష్టిస్తాయంటారు. ప్రస్తుతం దేశంలో ఒక మహా సంక్షోభం నెలకొని ఉన్నది. దీనిని ఒక మహత్తర అవకాశంగా తీసుకొని, 140 కోట్ల మందికి నమ్మకం కలిగించే బడ్జెట్‌ను తీసుకురావటం అసాధ్యమేమీ కాదు. కానీ, మోదీ సర్కార్ ఎప్పటిలాగే అంకెల గారడీకి పరిమితమైంది తప్ప వాస్తవ కార్యాచరణను ప్రకటించలేదు. రెండేండ్ల క్రితం రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ పథకానికి అతీగతీ లేనట్లుగానే, ఈ బడ్జెట్ కూడా అతుకులబొంతగానే ఉంది తప్ప ఆశాజనకంగా లేదు.
ఏడాదిపాటు దేశ రైతాంగం ఉద్యమిస్తే ఎట్టకేలకు సాగుచట్టాలను ఉపసంహరించి, క్షమాపణ చెప్పిన కేంద్రం.. ఆ స్ఫూర్తిని బడ్జెట్లో ఎక్కడా చాటలేదు. కనీస మద్దతుధర కావాలని రైతులు అడుగుతుంటే.. కిసాన్డ్రోన్ల గురించి, హైటెక్ వ్యవసాయం గురించి మాట్లాడటం ఏమిటి? దేశ వ్యవసాయరంగాన్ని బహుళజాతి కంపెనీలకు అప్పగిస్తారా అంటూ బడ్జెట్‌పై రైతుసంఘాలు వేస్తున్న ప్రశ్నలకు మోదీ, నిర్మల సీతారామన్ జవాబు చెప్పగలరా. వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పిస్తున్నది చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం. కరోనాతో మూతబడిన ఆ రంగాన్ని తెరిపించే చర్యలే బడ్జెట్లో లేవు. బీమారంగంలో కోట్లాదిమందికి సేవలందిస్తూ, లక్షలాదిమందికి జీవనాధారంగా ఉన్న ఎల్ఐసీని అమ్మేస్తామని ప్రకటించటం జాతిద్రోహానికి నిదర్శనం. కరోనా కారణంగా ప్రపంచదేశాలు ఆరోగ్యరంగాన్ని పటిష్ఠపరుచుకుంటున్నాయి. కానీ, మోదీ సర్కార్‌కు ఆ సోయే లేదు. మోదీ మాటల్లాగే మోదీ బడ్జెట్ కూడా ఒట్టి డొల్లేనని మరోమారు రుజువైంది.