రైతన్నల జీవితాల్లా…
యువకుల జీవితాలు నెర్రెలు బాస్తున్నయి
ఏ దుర్మార్గాన్ని చూడకూడదనుకున్నమో
ఏది జరుగకూడదనుకున్నమో
అదే బ్రాండ్‌తో భారత్ వెలిగిపోతున్నది!
ఏ దేశభక్త పుట్టలోని నాగాస్త్రమో
ఏ జాతీయవాదపు సిగలో పూసిన పూవో
గన్నేరు చెట్లకు గన్నేరుకాయలే కాస్తవి
ఇంతకన్న వేరేమి ఆలోచిస్తరు!
రాతికొండలు నుజ్జయ్యే చలిలో
దేశ భద్రతలే తప్ప
ఏమెరుగని వెన్నెల లాంటి వాళ్లు
రక్షణనే కర్తవ్యమై సాగిపోయేవాళ్లు
దేశమే కుటుంబంగా నిలుపుకొన్నవాళ్లు
శత్రువు జాడల్ని నీడల్ని
కంటిచూపులతో ఏరిపారేసే సైనికులు
వామనుడిలా
దేశమంతా పెట్టుబడిదారుడి అడుగులు
జవానుల శ్రమ దోచుకోవటానికి
దూసుకొస్తున్న బుల్డోజర్లు
ఉద్యోగాల భరోసా గాలిలో దీపాలే!
ఉద్యోగ వయస్సును కత్తిరించి
సిపాయిలను
కాంట్రాక్టరించడానికి సిగ్గుండాలి..
నవ్వే పాలకంకుల మెడలిరిసి
పరిమలించే పూవులను
ఇనుపకాళ్లతో నలిపేయండి
యువకుల శ్రమను దోచే అగ్నిపథ్
సరికొత్త నాటకాన్ని
స్వామి వివేకానందునికీ అంకితమివ్వండి!
దేశ భక్తులారా!
దేశమిప్పుడు
రాష్ట్రపతి ప్రధానమంత్రి చేతుల్లో లేదు
ధనవంతుల చేతుల్లో దర్జాగా…
కాంట్రాక్టు భారత విజయ పతాకాన్ని
దీపావళి టపాసులుగా పేల్చండి
– వనపట్ల సుబ్బయ్య , 9492765358