ఉత్తరాది రాష్ర్టాల్లో వరుసగా అధికారాన్ని కోల్పోతూ అవసాన దశకు చేరి ఒక్క హిమాచల్ ప్రదేశ్‌కే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల్లో ముక్కుతూ మూల్గుతూ తన ఉనికిని కాపాడుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నది. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారానికి దూరమై 35 ఏండ్లు దాటింది. సొంతంగా లేదా సంకీర్ణ సారథిగా ఇప్పుడప్పుడే అధికారంలోకి వస్తుందన్న ఆశ
ఆ పార్టీకే లేదు. పదీపరకా సీట్ల కోసం ప్రాంతీయ పార్టీలను దేబిరించే స్థాయికి హస్తం పార్టీ జారిపోయింది. పూలమ్మిన చోట కట్టెలమ్మడం అంటే ఇదేనేమో. రోజురోజుకీ నీరసించిపోతున్న కాంగ్రెస్‌కు రాహుల్ ఓట్ చోర్ కాయకల్ప చికిత్స పనిచేయడం లేదు సరికదా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీహార్ డీఎన్ఏను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఇరవై ఏండ్ల పాటు ఉమ్మడి బీహార్‌లో కాంగ్రెస్‌దే రాజ్యం. 1967 అసెంబ్లీ ఎన్నికల్లో జాతకం తిరగబడి తొలిసారి అధికారం కోల్పోయింది. తదాదిగా అడపాదడపా అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ ప్రయాణం సాఫీగా సాగలేదు. 1977 లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి బీహార్‌లోని మొత్తం 54 నియోజకవర్గాల్లో ఉనికి లేకుండా ఓడిపోయింది. ఆ వెంటనే జరిగిన అసెంబ్లీ మధ్యంతర ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ 286 సీట్లకు పోటీ చేసి 57 మాత్రమే గెలుపొందింది. 110 సిట్టింగ్ సీట్లను కోల్పోయింది. మళ్లీ పుంజుకొని 1980, 1985 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ 1990లో 196 సీట్లకు పోటీ చేసి 71 మాత్రమే గెలుచుకుంది. అంతే, నాటి నుంచి నేటి వరకు ఇక కోలుకోలేదు. 1995 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 320 నియోజకవర్గాల్లో పోటీ చేసి 29 మాత్రమే గెలుచుకుంది. ఉమ్మడి బీహార్‌లో ఆఖరుగా జరిగిన 2000 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో సైతం అన్నింటా ఒంటరిగా పోటీ చేసి 23 సీట్లకే పరిమితమైంది.
ఒంటరి పోరులో విజయావకాశాలు సన్నగిల్లిపోవడంతో 2005 నుంచి పూర్తిగా సంకీర్ణ రాజకీయాలకు శ్రీకారం చుట్టింది. ప్రాంతీయ పార్టీలకు కాంగ్రెస్ సాగిలపడటం అప్పటినుంచే మొదలైంది. ఆ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీకి 178 సీట్లు అప్పగించి కాంగ్రెస్ 84 సీట్లలో పోటీ చేసి పది మాత్రమే గెలిచింది. ఆ ఎన్నికల్లో ఏ సంకీర్ణానికి మెజారిటీ రాలేదు. ఎవరు ఎవరికీ మద్దతు ఇవ్వడానికి ముందుకురాలేదు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పడకుండానే అసెంబ్లీ రద్దయింది. ఆ వెంటనే అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ మిత్రపక్షమైన ఆర్జేడీకి 175 సీట్లు అప్పగించి, తాను 51 సీట్లతోనే సంతృప్తి పడింది. తొమ్మిది మాత్రమే గెలుచుకోగలిగింది. 2010 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరైపోయింది. పూర్వాశ్రమ మిత్రులు దూరమైపోయారు. సొంతంగా అన్ని స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ నాలుగు మాత్రమే గెలిచి కనీవినీ ఎరుగని ఘోర పరాభవాన్ని చవిచూసింది. దాంతో బీహార్‌లో కాంగ్రెస్ మూలాలు తుడిచిపెట్టుకుపోయాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ బీహార్‌లో కాంగ్రెస్ ఇంత దీనావస్థకు చేరుకోవడం ఆశ్చర్యమే. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ సంకీర్ణంలో చేరి 41 స్థానాల్లో పోటీ చేసినా, ఆ పార్టీకి దక్కింది 27 సీట్లు మాత్రమే. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షం ఆర్జేడీ 144 సీట్లను జబర్దస్త్‌గా లాగేసుకోగా, 70 స్థానాల్లోనే పోటీ చేసిన కాంగ్రెస్ 19 మాత్రమే గెలుచుకోగలిగింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లపరంగా మహా ఘట్ బంధన్ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు గట్టి పోటీ ఇచ్చింది. ఈ రెండు కూటముల మధ్య ఓట్ల తేడా 0.03 శాతమే. అంతటి అనుకూల పరిస్థితుల్లో సైతం కాంగ్రెస్ పోటీ చేసిన స్థానాల్లో మూడింట ఒకటో వంతు కూడా గెల్చుకోలేకపోయింది. ఇప్పుడు కూడా రెండు సంకీర్ణాల మధ్య గట్టి పోటీ ఉంటుందని సర్వేలు చెబుతున్నాయి. ఎన్డీయే సంకీర్ణంలో జేడీయూతో సమానంగా బీజేపీ 101 సీట్లను పంచుకుంది. కానీ, కాంగ్రెస్‌కు అంత సీన్ లేదు. అధికారం అందుకునే అవకాశం కనుచూపు మేరలో లేదు. ప్రస్తుత వాతావరణంలో విజయావకాశాలు అంతంతమాత్రంగా ఉన్న కాంగ్రెస్‌కు కనీసం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన స్థానాలను కూడా కేటాయించడానికి ఆర్జేడీ సిద్ధంగా లేదు.
గతంలో కూడా ఆర్జేడీతో జతకట్టిన కాంగ్రెస్‌కు అడిగినన్ని సీట్లు లభించలేదు. సిట్టింగ్ స్థానాలను మాత్రమే కేటాయిస్తానని 2010 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ తెగేసి చెప్పడంతో కాంగ్రెస్ బిస్తరు సర్దుకొని ఒంటరిగా అన్ని సీట్లకు పోటీ చేసి నాలుగు చోట్ల మాత్రమే గెలిచి దారుణంగా భంగపడింది. నాటి నుంచి ఒంటరి పోరాటానికి కాంగ్రెస్ సాహసించడం లేదు. అలాగని ఆర్జేడీ విదిల్చే స్థానాలతో తృప్తి చెందడం లేదు. మరోవైపు ఆర్జేడీ సారథి తేజస్వి యాదవ్ ప్రభ వెలిగిపోతున్నది. ఇటీవల ఒక సర్వేలో బీహార్ ప్రజలు ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌కే అగ్ర తాంబూలం ఇచ్చారు.
ఆ తర్వాత స్థానాల్లో వరుసగా పాలక జేడీయూ అధినేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్; ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మూడవ స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్ర నేతల ఊసే లేదు. ఈ నేపథ్యంలో కేటాయించిన సీట్లు తీసుకొని ఆర్జేడీతో సర్దుకుపోవడం తప్ప, భీష్మించుకొని కూర్చోవడానికి, బేరసారాలాడటానికి, బెదిరించడానికి కాంగ్రెస్ ఒంట్లో ఆపాటి సత్తువ, చేవ లేవు. 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో ఏ రకంగా చూసినా కాంగ్రెస్ మూడంకెల స్కోరును ముద్దాడి పాతికేండ్లయింది.
కాకలుతీరిన వృద్ధ నేతలు లాలూప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్ ద్వయం మూడు దశాబ్దాలకు పైగా బీహార్ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. అదే స్థాయిలో నిలబడి, వారితో కలబడగలిగే రాజకీయ వస్తాదు ఒక్కరూ కాంగ్రెస్‌కు లేరు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో బాబూ రాజేంద్రప్రసాద్, బాబూ జగ్జీవన్‌రామ్, కాలక్రమంలో లలిత నారాయణ మిశ్రా, జగన్నాథమిశ్రా, అబ్దుల్ గఫూర్, మీరా కుమార్ బెన్ వంటి దిగ్గజ నేతలు బీహార్ కాంగ్రెస్‌ను కదం తొక్కించారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు. రాష్ట్రం మొత్తానికి పరిచయమున్న, ప్రభావితం చేయగలిగిన నాయకులు ఎవరూ లేరు.
చాలా రాష్ర్టాల్లోలాగే బీహార్‌లో కూడా కాంగ్రెస్ ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి పరిమితమైంది. మరో వంక కాంగ్రెస్ బద్ధ శత్రువైన బీజేపీ గత 20 ఏండ్లుగా నితీశ్ కుమార్‌తో అడుగులో అడుగువేసి నడుస్తూనే పట్టువిడుపులు, సర్దుబాటు ధోరణులు ప్రదర్శిస్తూనే ఈ ఎన్నికల్లో పైకెగబాకి సీట్ల పంపకంలో జేడీయూతో సమానంగా నిలిచింది. గత లోక్‌సభ ఎన్నికల్లో సైతం మిత్రపక్షం జేడీయూ కంటే ఒక సీటు ఎక్కువగా వాటా తీసుకుంది. ఈ పరిణామం కాంగ్రెస్‌ను మరింత కుంగదీసింది. బీహార్‌లో ఏనాడూ అధికారంలో లేని బీజేపీ ఆ స్థాయికి ఎదిగిన తరుణంలో 30 ఏండ్లకుపైగా ఉమ్మడి బీహార్‌లో అధికారం చెలాయించిన కాంగ్రెస్ సీట్ల కేటాయింపు కోసం ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటి గుమ్మం ముందు పడిగాపులు కాసే దుస్థితిని జీర్ణించుకోలేకపోతున్నది.
జాతీయ పార్టీగా గౌరవప్రదమైన వాటా అటుంచితే, కనీసం గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన స్థానాలనైనా కేటాయించాలని అడుగుతున్న కాంగ్రెస్ వేదన అరణ్యరోదన అయింది. ఆర్జేడీ సహా ఇతర మిత్రపక్షాలు వినే స్థితిలో లేవు. కేవలం ఆరేండ్ల క్రితం పురుడుపోసుకున్న వికాశీల్ ఇన్సాన్ పార్టీ అసెంబ్లీలో ఏ ప్రాతినిధ్యం లేకున్నా పొత్తులో భాగంగా కోరుకున్న సీట్లు, ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిందేనని దబాయించి అడుగుతుంంటే.. కాంగ్రెస్ మాత్రం అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటూ లాలూ, తేజస్వి చుట్టూ పొర్లు దండాలు పెడుతున్నది. నానాటికీ చిక్కిశల్యమవుతూ మంచానికే పరిమితమైన బీహార్ కాంగ్రెస్ బీమారీకి తగిన చికిత్స చేసే వైద్యుల అవసరం ఎంతైనా ఉంది.
-డాక్టర్ అయాచితం శ్రీధర్ ,98498 93238