‘కేజీఎఫ్’ ఫ్రాంఛైజీతో యువతరాన్ని ఆకట్టుకుంది కన్నడ సుందరి శ్రీనిధి శెట్టి. ‘హిట్-3’ ‘తెలుసుకదా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. తాజాగా ఈ భామ తెలుగులో బంపరాఫర్‌ను దక్కించుకుంది. వివరాల్లోకి వెళితే..వెంకటేష్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మించనున్నారు. వెంకీ-త్రివిక్రమ్‌లది సూపర్‌హిట్ కాంబో. వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేశారు.
దీంతో వీరిద్దరి తాజా సినిమాపై ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ అవుతున్నది. ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి నాయికగా నటించనుందని గతంలోనే వార్తలొచ్చాయి. తాజాగా వాటిని చిత్రబృందం ధృవీకరించింది. మంగళవారం శ్రీనిధి పుట్టినరోజుని పురస్కరించుకొని మేకర్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ స్పెషల్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీంతో ఆమె వెంకటేష్ సరసన కథానాయికగా నటిస్తున్నట్లు అధికారికంగా ఖరారైంది. త్రివిక్రమ్ చిత్రాల్లో కథానాయికల పాత్రలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చక్కటి హాస్యంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో చిత్రాల్ని తీర్చిదిద్దుతారనే పేరుంది. ఈ నేపథ్యంలో శ్రీనిధి శెట్టి కెరీర్లో ఈ సినిమా చాలా ప్రత్యేకమని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి.