జనగామ దగ్గర ఒకప్పుడు ‘అన్నలకు’ బలమైన కేంద్రంగా ఉండిన గ్రామం ఒకటుంది. అక్కడ దాదాపు 90 ఏండ్లకు చేరిన వృద్ధుడు ఒకాయన ఉన్నాడు. నక్సలైట్లకు సంబంధించిన పరిణామాలను చూస్తూ ఆయన, ‘అన్నల అవతారం’ ఇక ముగిసిపోయిందన్నాడు. అన్నలు, అవతారం అనే పదాలలో వారి పట్ల ప్రేమ భావన ఉన్నది. వారి అవతారం ముగిసిందనటంలో తనదైన అవగాహనతో కూడిన అంచనాలున్నాయి. తన చిన్నప్పుడు పేద రైతుల కోసం కమ్యూనిస్టులు చేసిన సాయుధ పోరాటం ఒక అవతారం కాగా, అది ముగిసిన వెనుక ఇప్పుడు చేసిన పోరాటం మరో అవతారమని కూడా అన్నాడు.
ఇందులో రెండు పదాలు గమనించదగ్గవి. ఒకటి అవతారం కాగా, రెండవది అది ముగియటమన్నది. గ్రామీణుల జీవితంలో పురాణాలు, అవతారాలు, అవి సాధించిన మహత్కార్యాలకు పెద్ద స్థానం ఉంటుంది. ఆ వృద్ధుడు తను జీవిస్తున్న తెలంగాణలో, తన జీవిత కాలంలోని రెండు అవతారాల గురించి ప్రస్తావించాడు. పురాణ అవతారాలు తమ లక్ష్యాలను సాధించిన తర్వాత తమ అవతారాలను తామే చాలిస్తాయని గ్రామీణులకు తెలిసిన విషయం. మరి తన జీవితకాలంలో తాను అంటున్న రెండు అవతారాలు ఏవి? అందుకు సమాధానాన్ని ప్రత్యేకంగా అడగనక్కరలేదు. కానీ, రైతాంగ పోరాట అవతారాన్ని పక్కకు ఉంచి వర్తమానానికి వస్తే, ప్రస్తుత అవతారం తన లక్ష్యాన్ని సాధించలేదన్న భావన ఆయన అంతరార్థంగా కనిపిస్తున్నదే. అయినప్పటికీ, పాక్షికంగానైనా ఏమైనా సాధించిందా? అయితే, ఏమిటది? పూర్తిగా సాధించలేనిది ఎందువల్ల? మున్ముందు మరో అవతారం అవసరం కావచ్చునా? అయితే అది రావచ్చునా?
ఈ మాటలు తనేమీ చెప్పలేదు. నేను అడగలేదు. ఈసారి కలిసినప్పుడు అడగాలి. నేనే వాళ్ల ఊరికి పోయి అయినా. ఈ ప్రశ్నలన్నింటిపై చాలామంది చాలా చర్చలు చేస్తున్నారు. ఇటీవలి వారాలలోనే కాదు, కొద్ది సంవత్సరాలుగా. అవన్నీ ‘పైవారు’ తమ దృష్టితో, అనుభవాలతో, మేధో దార్శనికతలతో చేస్తున్న చర్చలు. ‘కింది వారి’ దృష్టి, అనుభవాలు, ఆలోచనలు ఎక్కడా కనిపించవు. సమస్త విషయాలలో జరుగుతున్నట్టే ఇందులోనూ జరుగుతున్నది. ఇది మనకు ఎప్పుడూ ఉన్న సమస్యే. చివరికి పరిణామ క్రమాలు ఏమి తేల్చిచెప్తాయన్నది వేచిచూడవలసిన విషయం.
ఇక్కడ గమనించవలసిన మాట ఒకటున్నది. స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత 90 ఏండ్ల పాటు జీవితాన్ని చూసిన ఆ వృద్ధుడు, అసలు అవతారాల అవసరం లేదని అనటం లేదు. అవి విఫలమయ్యాయని మాత్రమే అనుకుంటున్నాడు. దానినట్లుంచి రెండు ప్రశ్నలున్నాయి. ‘అన్నల అవతారం’ ఎందుకు విఫలమై ముగుస్తున్నది? ఇది తెలంగాణ, భారతదేశానికి సంబంధించినది కాగా, ప్రపంచమంతటా కమ్యూనిజం ఎందుకు విఫలమైందనేది రెండవది. వీటిలో మొదటిదానికి మాత్రం పరిమితమవుదాము. ఒక మాట ముందే చెప్పాలి.
‘అన్నల అవతారం’లో జరుగుతూ వచ్చిన మంచిచెడులు, తప్పొప్పుల గురించి మాట్లాడటం లేదిక్కడ. వాటి విషయమై మొదటినుంచి ఇప్పటివరకు ఒకవైపు అంతర్గతంగా, మరొకవైపు బయటినుంచి తలెత్తుతూ వచ్చిన ప్రశ్నలు, చర్చలు, సందేహాలు ఏమిటన్నది తెలియాలి. అవి అనేకానేకం. అన్నీ తెలియగల అవకాశం ఎవరికైనా ఉందో లేదో చెప్పలేము. తెలిసినంతవరకైనా కొన్నింటిని పేర్కొంటే, మొత్తం 55 సంవత్సరాల నక్సలైట్ ‘అవతార’ సమీక్షకు అవి కొంత ప్రాతిపదిక కాగలవు. తీర్పులు ఎవరికి వారు చెప్పవచ్చు. అయితే, ఒక మాట గుర్తించాలి. ప్రస్తుత పరిణామాలు రాత్రికి రాత్రి సంభవిస్తున్నవి కావు. బహుశా తొలి దశ నుంచే ఆరంభమైన ప్రశ్నలు, లోపాలు, వాటికి సమాధానాలను కనుగొనలేకపోవటం నుంచి పేరుకుపోయిన సమస్యలు కారణమనాలి.
హక్కులను, మార్పును ప్రజలు కోరితే వ్యవస్థ సాయుధంగా అణచివేయజూస్తుందని, అణచివేతను ఎదుర్కొనేందుకు, ఆ క్రమంలో ప్రస్తుత వ్యవస్థ్థను కూలదోసి పేదల వ్యవస్థను ఏర్పాటుచేసేందుకు ప్రజలు తప్పనిసరిగా సాయుధులు కావలసి ఉంటుందన్నది విప్లవకారులు తార్కికంగా చేసే మౌలిక సూత్రీకరణ. అయితే, భారతదేశం వంటి ప్రజాస్వామిక దేశంలో, పేదల అవసరాలు, హక్కులు, సంక్షేమాలు ఎంత పరిమితంగా అమలవుతున్నప్పటికీ, ప్రజలు ఆ ఆశలను వదిలి సాయుధ పోరాటం వైపు మళ్లగలరా అనే ప్రశ్న మొదటినుంచీ ఉంది.
కొందరు వ్యక్తులు, వర్గాలు ఆ విధంగా మళ్లినా, రాజ్యవ్యవస్థ వారిని అణచివేయటం, లేదా అదనపు సంక్షేమ చర్యలు తీసుకోవటం అనే ద్విముఖ వ్యూహాన్ని అనుసరించినట్టయితే ఏమిటనేది కూడా కొత్తలోనే ప్రస్తావనకు వచ్చిన చర్చ. వాస్తవానికి ఆచరణ రీత్యా కూడా ఈ రెండూ ఒక దశాబ్దం తిరగకుండానే మొదలయ్యాయి. వాటి ప్రభావాలూ కనిపించసాగాయి. వాటికి అదనంగా, ప్రజాస్వామిక వ్యవస్థ పట్ల, అది కల్పించగల అవకాశాల పట్ల కనీసం ఒక పరిమితి మేరకైనా ఉండే ఆశలూ ప్రజలపై ప్రభావాన్ని చూపసాగాయి.
పోతే, విప్లవ సిద్ధాంతకారులు వేర్వేరు గ్రూపులుగా విడిపోవటం ఇంచుమించు మొదటినుంచే ఉన్నది. సాయుధ పోరాటం సూత్ర రీత్యా ‘తప్పనిదే’ అయినా, అందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయా అన్నది ఒక ప్రశ్న. దానిపై ఏకాభిప్రాయం లేకపోయింది. ఏర్పడిందన్న వారిలో కొందరు సాయుధ పోరాటమే ‘ఏకైక’ మార్గమనగా, పలు మార్గాలలో అది కూడా ఒకటి కావాలన్నారు మరికొందరు. అజ్ఞాతంలో మాత్రమే పనిచేయాలని, ప్రజా సంఘాలు అక్కరలేదని, పేదల సమస్యలపై ఆర్థిక పోరాటాలు పక్కదారి పట్టిస్తాయని కొందరు వాదించగా, కొందరు విభేదించారు.
కమ్యూనిస్టులకు ప్రజల మధ్య ఉంటూ పనిచేయటం, వారిని సంఘటితపరచి వివిధ సమస్యలపై ప్రజా పోరాటాలు సాగిస్తూ వారిని తమ వెంట నిలబెట్టుకోవటం కూడా చాలా అవసరమన్నారు వారు. ఆ క్రమంలో ‘వర్గ శత్రువులు’ అనే వారిని వ్యక్తిగతంగా ‘నిర్మూలించట’మనేది సరైనదా, కాదా? అనే వివాదం తీవ్రంగా సాగింది. కొందరు ఆ పని పట్టుదలగా చేయగా, కొందరు గట్టిగా వ్యతిరేకించారు.
విప్లవకారులు ఎన్నికలలో పాల్గొనాలా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది. చట్టసభలు ‘పందుల దొడ్లు’ అని, కనుక ఆ జోలికి పోవటం ఎంతమాత్రం సరికాదన్నది కొందరి వైఖరి కాగా, చట్టసభలపై మౌలికంగా భ్రమలు అక్కరలేదుగాని, అదే సమయంలో ప్రజలకు ఆ సభలపై ‘భ్రమలు’ ఉన్నందున ప్రజలను సమస్యలపై సంఘటితపరిచి చట్టసభలలో ఆ సమస్యలపై ప్రభుత్వాలను ఒత్తిడి చేసేందుకు ఒక ఎత్తుగడగా ఎన్నికలను ఉపయోగించుకోవాలని కొందరు వాదించారు. ఎవరి పద్ధతిలో వారు ముందుకువెళ్లారు.
విశేషం ఏమంటే, ఎన్నికలు ససేమిరా అన్నవారు కూడా, తాము పోటీ చేయకపోయినా, ‘ఎత్తుగడల’ పేరిట ఏదో ఒక పార్టీని పరోక్షంగా బలపరచటమూ జరిగింది. మరికొన్ని సందర్భాలలో ప్రజల ను ఒప్పించటానికి బదులు ఎన్నికల అభ్యర్థులపై దాడులు చేయడం, ఓట్లు వేయరాదంటూ ప్రజలను బెదిరించటం కూడా కనిపించాయి. ఇంతకూ ఓట్ల విషయమై పేదల ఆలోచనలు ఏమిటో ఏ నక్సలైట్ గ్రూపు అయినా ఎప్పుడైనా వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేసిందో లేదో తెలియదు.
ఈ క్రమంలో కొంతకాలం గడిచేసరికి, నక్సలైట్ గ్రూపులు ఒకరినొకరు దుందుడుకువాదులు, రివిజనిస్టులు, నయా రివిజనిస్టులు, సాయుధ రివిజనిస్టుల వంటి పేర్లతో నిందించుకోవటం మొదలుపెట్టారు. కొన్ని గ్రూపులు చీలిపోసాగాయి. అంతటితో ఆగక సిద్ధాంతాల పేరిట అయితేనేమి, ఒకరి ప్రభావం కింద ఉన్న ప్రాంతాలను తమ ప్రభావం కిందకు తెచ్చుకోవటం కోసమైతేనేమి పరస్పరం సాయుధ దాడులకు, హత్యలకు పాల్పడటం మొదలైంది. ఈ చర్యలకు మద్దతుగా సిద్ధాంతాల నుంచి ఇతరదేశాల విప్లవ చరిత్రల నుంచి ఎవరికి అనుకూలమైన దృష్టాంతాలను వారు ఉదహరిస్తూపోయారు.
ఈ బలాలు, బలహీనతల మధ్య, మరోవైపు నుంచి రాజ్యవ్యవస్థ ఒత్తిడులు, అణచివేతలు పెరిగిపోతుండగా, తమ ప్రభావంలోని ప్రాంతాలు తగ్గుతుండగా, ఉద్యమంలో చేరే పట్టణ, గ్రామీణ యువకుల సంఖ్య పడిపోతుండగా, క్రమంగా ఉద్యమ ప్రాంతాలు విస్తరించటం మాట అట్లుంచి వేగంగా కుంచించుకుపోవటం మొదలైంది. మైదాన ప్రాంతాలలో ప్రజాదరణ వేగంగా తగ్గటంతో మహాపీడనకు గురయ్యే అమాయక గిరిజనులు నివసించే దట్టమైన అడవులు తమకు శరణ్యంగా మిగిలాయి.
తీవ్రవాద గ్రూపులకు, వాటి అనుబంధ సంస్థలకు దాదాపు మొదటినుంచీ మూడు విషయాలు మరో విధమైన సమస్యగా మారి వేధించాయి. ఒకటి, కుల సమస్యను పట్టించుకోకపోవటం అట్లుంచి స్వయంగా తమకు గల కులతత్వం. రెండు, ఆర్థికపరమైన అవినీతి. మూడు, లైంగికపరమైన అనైతికతలు. ఇవి ఎంత విస్తారంగా ఉండేవన్నది చెప్పలేము. కానీ ఉండటమే గాక ఉద్యమాన్ని, అనుబంధ సంస్థలను ఏదో ఒక మేర అప్రతిష్ట పాలు చేయటం నిజం. ఇటువంటి ధోరణులు కిందిస్థాయిలో ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ, పైస్థాయిలలోనూ చోటుచేసుకున్నాయి. అంతేకాదు, అవాంఛనీయ ధోరణులు కాలం గడిచిన కొద్దీ తగ్గిపోవాలి. కానీ, యాభై ఏండ్లు దాటినా అది జరగలేదు. మరొక అపసవ్యపు ధోరణి ప్రజాస్వామిక విలువలు, ధోరణులు ఎంతమాత్రం లేకపోవటం.
చివరికి వచ్చేసరికి, సిద్ధాంతపరమైన, వ్యూహాలూ-ఎత్తుగడల పరమైన ప్రశ్నలు తేలలేదు. వేర్వేరు విప్లవ సంస్థల మధ్య ఐక్యతలు అరుదుగా తప్ప జరగలేదు. చీలికలు మరింతగా చోటుచేసుకుంటూ పోయాయి. భౌగోళికంగా విస్తరణలు లేకపోగా కుంచించుకుపోవటాలు ఎక్కువయ్యాయి. ప్రజలలో నమ్మకం తగ్గటం పాతికేండ్లు గడిచేసరికే మొదలైంది. పరిస్థితులు, తరాలు, వారి ఆలోచనలు మారుతుండగా వాటిపై అవగాహన లేకపోయింది.
సైద్ధాంతిక అన్వయాలు లేకపోయాయి. మొదటినుంచీ గల వివిధ ప్రశ్నలకు సమాధానాలు రాజకీయంగా లేకపోగా ఆయుధ బలం, హింస మాత్రమే శరణ్యమయే పరిస్థితి ఏర్పడింది. బయటినుంచి చేరేవారి సంఖ్య గణనీయంగా పడిపోయి, అమాయక ఆదివాసీలు తమ రక్షణ దుర్గంగా బందీలుగా మిగిలారు. వీటితో పాటు, ఇంకా ఇదేవిధమైన అంతర్గత బలహీనతలు ఒకవైపు, పరాకాష్ఠకు చేరిన రాజ్యవ్యవస్థ అణచివేత మరొకవైపు కలిసి ‘అన్నల అవతారాన్ని’ కనీసం ప్రస్తుతానికి ముగింపునకు తెస్తున్నాయి.
-టంకశాల అశోక్