సలికాలపు బోగిమంటల ఎచ్చదనపు
కాంతులతో వచ్చేనమ్మ సంక్రాంతి!
గౌరమ్మను పెట్టి సకినాలు సుట్టే
పనివడే తెలంగాణ ఆడబిడ్డలకు
మనువలుమనువరాళ్ళకు అరిసెలు చేసి
అల్మారలో ఓరగ పెట్టే అమ్మమ్మ
సీకట్ల్ల లేసి ఆకిలూడ్చి అలుకుసల్లి
పుడమిని నిదుర లేపే ఊరంతా
కొంగుసెక్కి గిర్కవట్టి బియ్యప్ పిండితో
సందువోకుండ ముగ్గేసుకొచ్చే ముసలమ్మ
సుక్కలతో సిలకల ముగ్గేసి
రంగులు నింపి ముర్సిపోయే పడుసక్కలు
పెరట్లో దడిపొంట దండిగ పూసిన
బంతిపూలు తెంపుకొచ్చే తాతయ్య
ఆవు పేడతో గొబ్బెమ్మలు చేసి
పసుపు కుంకుమపెట్టి గరుకపోసలతో కుదించగా
రేగుపండ్లు, జొన్నిత్తులు, వడ్ల్ల గింజలు..
మక్కిత్తులు.. నవధాన్యాలు కాంతులీన
గలుమ , గలుమకి గొబ్బెమ్మలు
కొలువుతీరగా సంక్రాంతి కల అచ్చేనమ్మ
సన్నాయి రాగాలతో.. గజ్జెలు కట్టిన
గంగిరెద్దులు దర్వాజ ముందు ఆటలాడగ
దండమెట్టిన బసవన్నలకి
కొత్త బట్టలు అప్పజెప్పిరి పల్లెజనులు
ఇంటింటా పచ్చని ‘రైతు బంధు’ తోరణాలు
పులగన్నం, పచ్చి పులుసు పరమాన్నం…
తుమ్మల కల్పన రెడ్డి
96404 62142