భువిన నాటుకున్న విత్తులన్నీ
దేహం నుంచి రాలిపడుతున్న
స్వేదపు చుక్కల సాక్షిగా.. కర్షకుడు!
పండించిన ధాన్యపు రాసులన్నీ
కల్లాల్లో కన్నీరును కారుస్తున్నాయి
కొత్త చట్టాలన్నీ ఇపుడు
హాలికుడి కంఠాన బిగుసుకుంటున్నాయి!
రైతు నెత్తుటి కన్నీరుతో నేలంతా తడుస్తున్నది
ఆశలన్నీ కన్నీటి ధారలై పారుతున్నాయి
మూడు చట్టాల రద్దు ముచ్చట..
ముచ్చటగానే మిగిలిపోతుందా?
సేద్యకాడి పంటకు గిట్టుబాటు హామీలు
ఎగిరే పక్షుల్లా అలా గాల్లో..
కాలమెంత పరీక్ష పెట్టినా.. కాయాన్ని నమ్ముకుని
పంటచేలలో పనిపురుగై పరుగులు తీస్తాడు
బిడ్డకు పురుడొస్తున్నట్లు..
మొక్కను ఎదలో దాచుకొని సాగు చేస్తాడు!
అన్నం పెట్టిన కర్షకున్ని కన్నీరు పెట్టిస్తే..
మోదీ పీఠం బీటలు బారక మానదు..!
–అశోక్ గోనె ,94413 17361