వరంగల్లో అధునాతన సౌకర్యాలతో, మహిళలకు, పిల్లలకు పూర్తి వసతులు కల్పిస్తూ నిర్మించిన పోక్సో కోర్టు, ఇతర కోర్టు భవన సముదాయం భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ చేతుల మీదుగా ప్రారంభం కావడం హర్షణీయం. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత కైలాష్ సత్యార్థి ఈ ప్రత్యేక కోర్టుల ఏర్పాటు గురించి పలుమార్లు ప్రస్తావించడం విశేషం.
2019 జూలై 1న ‘బచ్పన్ బచావో ఆందోళన్’ సీఈవో సమీర్ మాథుర్, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ బి.వినోద్ కుమార్ సమావేశమై పోక్సో ప్రత్యేక కోర్టు నిర్మాణం అవసరంపై సమాలోచనలు జరిపారు. పోక్సో చట్టం కింద కేసులను త్వరతగతిన పరిష్కరించే ‘చైల్డ్ ఫ్రెండ్లీ కోర్ట్స్’ తెలంగాణలో ఏర్పాటుచేయాలని నిశ్చ యించారు. ఈ క్రమంలోనే లైంగికనేరాల చట్టం-2012 (పోక్సో) అమలుతో బాధితులైన పిల్లలకు భరోసా ఇచ్చేవిధంగా వరంగల్లో ప్రత్యేక కోర్టును ఏర్పాటుచేయడం అభినందనీయం.
అత్యంత హేయమైన నేరాల్లో ఒకటి పిల్లలపై లైంగిక వేధింపులు. ఈ నేరాలు సమాజంపై ఒక మాయని మచ్చ. రాష్ర్టాల వారీగా ‘పోక్సో చట్టం-2018’ కింద నమోదవుతున్న నేరారోపణల రేటు చూస్తే 100 శాతంతో ఛండీగఢ్, మణిపూర్లు అగ్రస్థానంలో ఉంటే తెలంగాణ 12.5 శాతంతో చివరి మూడోస్థానంలో ఉన్నది. జాతీయ నేర రికార్డుల బ్యూరో వారి 2020 సమాచారం ప్రకారం పోక్సో చట్టం కింద తెలంగాణలో రిజిష్టర్ అయిన కేసుల సంఖ్య 2,074. రాష్ట్రంలో పిల్లలపై జరిగిన లైంగికదాడుల సంఖ్య 1,415. ఈ డేటా గత కొన్నేండ్లుగా దేశంలో లైంగికనేరాలు పెరుగుతున్నాయని ధృవీకరిస్తున్నాయి.
స్త్రీ,శిశు సంక్షేమ శాఖ కమిషనర్ సహకారంతో ఈ కోర్టులో బాలల కోసం ఏర్పాటుచేసిన వసతుల్లో క్రెష్ (చిన్నారుల సంరక్షణ కేంద్రం), పాలిచ్చే తల్లుల కోసం, చిన్నారుల డైపర్లు మార్చుకునేందుకు విడిగా క్యాబిన్లు ఉంటాయి. దివ్యాంగుల కోసం చక్రాల కుర్చీ, ప్రథమ చికిత్సా కేంద్రం లాంటివి అందుబాటులో ఉంటాయి. పిల్లల రక్షణకు, వారు ముద్దాయిలకు కనబడకుండా ఒకవైపే కనిపించే అద్దాలు, నేరస్థులు కోర్టు లోపలికి రావడానికి ప్రత్యేక మార్గం లాంటివి ఉన్నాయి. వీటితో పాటు పిల్లల మనసులకు సాంత్వన కలిగించేవిధంగా ఫ్యామిలీ కోర్ట్ సముదాయానికి, వేచి ఉండే హాలుకు ఆహ్లాదకరమైన రంగులు వేశారు. ఇంకా పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం, పచ్చిక మైదానం లాంటివి కూడా ఏర్పాటుచేశారు.
బాధితులకు న్యాయం జరిగే విధంగా కోర్టుల్లో పెండింగు కేసుల సంఖ్యను తగ్గించాలి. గట్టి పరిశోధన ద్వారా నేర నిరూపణ చేస్తూ పేద, అణగారినవర్గాల బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలి. త్వరతగతిన ప్రతి కేసు పరిష్కరించేందుకు కావలసిన అన్ని సదుపాయాలు ఈ వరంగల్ పోక్సో కోర్టు సముదాయం కలిగి ఉన్నది. ఈ కోర్టు దేశంలోనే మోడల్ కోర్టుగా నిలుస్తుందనడంలో సందే హం లేదు.
ఈ కోర్టు విభాగంలో నియమించిన సిబ్బంది విధానపరమైన నైపుణ్యం కలిగి ఉంటారు. బాధిత స్త్రీల, బాలల స్థితిని, బాధను అర్థం చేసుకునేవిధంగా శిక్షణ తో బాధితులకు సేవలందిస్తూ ఉన్నత ఆశయాలను, కలలను సాకారం చేసే దిశలో నడుస్తుందని ఆశిద్దాం.
(వ్యాసకర్త: మరిపల్లి చందన, 92055 85962, స్టేట్ కో ఆర్డినేటర్, ‘బచ్పన్ బచావో ఆందోళన్’)