న్యాయం వేరు. ధర్మం వేరు. న్యాయం కొన్ని పరిమితులకు లోబడి నిర్వచితమవుతుంది. ధర్మం అందుకు అతీతమైనది. అంతిమ ఫలితం, పర్యవసానం మాత్రమే ధర్మానికి ప్రధానం. న్యాయానికి కాలదోషం ఉంటుంది. ధర్మం కాలాతీతమైనది. న్యాయం తర్కానికి లోబడుతుంది. కానీ ధర్మం తర్కాన్ని ధిక్కరిస్తుంది. అందుకే న్యాయానికి, ధర్మానికి మధ్య మీమాంస వచ్చినప్పుడు అంతిమంగాధర్మమే ఆచరణీయమవుతుంది.
పాలకులకు న్యాయం కన్నా ధర్మమే అనుసరణీయమైనది. అందుకే రాజధర్మం అన్నారు! ఢిల్లీ రాజుగారి న్యాయమెప్పుడూ నిందార్థమే!
లెక్కలకు చిక్కనివి కొన్నుంటాయి. అమ్మ ప్రేమ, రైతు కష్టం, దేశ భక్తి, సైనికుడి త్యాగం ఇలాంటివి. వీటి లోతును లెక్కించలేం. గాఢతను గణించలేం. ఫీలయ్యే మనసుంటే అనుభవించి, స్పందించాల్సిందే తప్ప కాసులతోనో, రాసులతోనో కొలవడం సాధ్యం కాదు.
ప్రభుత్వాలు, పరిధులు, చట్టాలు, న్యాయాలు, లెక్కలు, లేఖల్లో ఇవి ఇమడవు. ఇమడ్చలేము. కొన్నింటికి మనసే అసలైన కొలమానం!
రైతుకు ఒక లెక్కుంటుంది. కార్తెప్పుడు వస్తుందో, మబ్బెప్పుడు పడుతుందో! గాలి దిశను, వేగాన్ని బట్టి వానెప్పుడు వస్తుందో వాసన చూడగలడతడు. ఆ ప్రకారమే దుక్కి దున్నడం, ఇరువాలు చేయడం, వడ్లు నాన బోయడం, నారు పోయడం, నాట్లు వేయడం, కలుపు తీయడం, కోత కోయడం, కట్ట కట్టడం, మెద పెట్టడం, బంతి కట్టడం, కల్లం తొక్కడం, రాశి పోయడం ఇవన్నీ పద్ధతి ప్రకారం జరుగుతుంటాయి. లాభం, బర్కత్ అంటూ ఎన్ని గింజలు పండుతాయనే లెక్క వేసుకుని విత్తులు వేయడతడు. భూమి తల్లి ‘అన్న-పూర్ణ’ను కనేందుకు మంత్రసానితనం మాత్రం చేస్తాడు!
రైతుకే ఇంతుంటే, మంత్ర ఫలాన్ని కాపాడుకోవాల్సిన వారికి ఎంతటి ప్రణాళిక ఉండాలి? అదేదీ లేకుండా ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తుందన్నట్టు ఏట్లోకి వదిలేస్తే ఎట్లా? చమురో, బొగ్గో, మరొకటో మన దగ్గర లేనిది, చాలనిది, మరో దేశం నుంచో, కంపెనీ నుంచో కొని తెచ్చుకోవాలనుకోండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంతమంది దాన్ని వాడుతున్నారు? ఇంకెంతమంది కొత్తగా వాడే అవకాశముంది? సమీప భవిష్యత్తులో దాని అవసరం ఎంత పెరుగుతుంది? అని డిమాండ్‌ను ముందే ఒక అంచనా వేసి, లెక్కకు వచ్చి, కాంట్రాక్టులు పిలుస్తుందా? లేక సరుకు రేవులోకైతే రానీండి. కొంటమో లేదో అప్పుడు చెప్తాం.. అంటుందా? మరి ఇదే సూత్రం రైతుకెందుకు వర్తించదు? ధాన్యం ఎంత కొంటమో ఏడాది ముందే ఎందుకు చెప్పం? యాసంగి ధాన్యాన్ని ఎంత కొంటమో మార్చిలో, అంటే ధాన్యం రావడానికి ఒకటి రెండు నెలల ముందు చెప్తామంటే, మన మేధావిత్వం ఏమైపోయినట్టు? చెట్టెక్కించి నిచ్చెన తీసేసినట్టు, ఐట్లెతే అప్పటికే పంట వేసుకున్న రైతు ఏమైపోవాలి? పండిన ధాన్యాన్ని ఏం చేసుకోవాలి?
కరువొస్తే కష్టం. దేశానికి ఆహారం కొరత ఉంది. మరింత, మరింత పండించండి అని రైతును తరిమింది మనమే! మన ఉరుకులాట చూసి, నిజమే కాబోలనుకుని, అతడు హరిత విప్లవం సృష్టించాడు. హలధారి హాలాహలధారి అయి, వీపు వెనక విషాన్ని కట్టుకుని, పురుగు మందుకు తన ప్రాణం ఎరగా వేసి, దేశం కోసం అన్నం పండిస్తే.. అది దొడ్డు బియ్యం, మేం కొనబోమంటే మనకేం దొడ్డ మనసు ఉన్నట్టు? గోదాములు పొర్లి పోతున్నాయా? పండించాలన్నది మనమే కదా. మరిన్ని గోదాములు కట్టండి. విదేశాల నుంచి చమురు తెచ్చి బంకర్లలో దాచుకోవడం లేదా? అలాగే ధాన్యాన్ని కూడా దాయండి! ఏమో.. రేపూ పంటలిలాగే పండుతాయనే గ్యారెంటీ ఏముంది? మన తీరుతో విసిగి వేసారిపోయి రైతన్న ‘వ్యవసాయం బంద్’ అనడని ఏముంది? మనం క్రాప్ హాలీడే ఇవ్వడానికి ముందే అతడు రైస్ హాలీడే ఇస్తే! ధాన్యానికి గిరాకీ లేదంటారా? గిరాకీ సృష్టించేందుకు సుపరిపాలకులు మరింత సృజనాత్మంగా ఆలోచించండి! కాదూ కూడదంటారా… ఆకలి కేకలు పెడుతున్న అన్నార్తులకు అయాచితంగా పంచండి. కూడబెట్టుకోవాలంటే కష్టంగానీ, పంచడం ఎంతసేపు! పద్ధతీ పాడూ లేకుండా, ముందస్తు అంచనా, ఆలోచనా లేకుండా, వెయ్యమన్నప్పుడు వేసి, తియ్యమన్నప్పుడు తియ్యడానికి వ్యవసాయం, కంప్యూటర్లో చిప్ కాదు. కావాలనుకుప్పుడు డిలీట్ చేసే సాఫ్ట్వేర్ అంతకంటే కాదు. అడవి నుంచి దూరం చేస్తే గిరిజనుడు బతకలేనట్టే, భూమి నుంచి దూరం చేస్తే రైతు కూడా బతకలేడు. వ్యవసాయం మనకు లాభనష్టాల వ్యాపారం కావచ్చు. కానీ రైతుకు అది బతుకు, సంస్కృతి. పెద్దగా చదువుకోని రైతన్నే అంత పద్ధతిగా వ్యవసాయం చేస్తున్నప్పుడు, ఇంత పెద్ద చదువులు చదివిన ఐఏఎస్‌లు, అధికారులు, నాయకులున్న ప్రభుత్వం పద్ధతిగా ఎందుకు ఆలోచించలేదు? దున్నాల్సిన నాడు దూర దేశం పోయి కోతల కాలానికి కొడవలి పట్టి వచ్చినాడన్నట్టుంది కేంద్రం తీరు. తెలంగాణ ధాన్యం మొత్తాన్నీ కేంద్రం కొనాల్సిందే అనడానికి వంద కారణాలు చూపించొచ్చు.
తెలంగాణలో నెర్రెలు బారిన నేల ఇప్పుడిప్పుడే నీలాల నీళ్లు పారి, పసిడి గింజై మెరుస్తున్నది.
దశాబ్దాలుగా పడావుబడి చచ్చుబడ్డ జీవితాలుఇపుడిప్పుడే పచ్చబడి వెచ్చటి నవ్వులై వెలుస్తున్నవి.
సాగు రాదని హేళనకు గురైన తెలంగాణ రైతన్న తన సామర్థ్యమేమిటో ఇప్పుడిప్పుడే చాటుతున్నడు.
చేను గట్టు మీది చెట్టుకొమ్మలకు వేలాడే దేహాల బదులు ఇప్పుడిప్పుడే సద్ది గిన్నెల ఉట్లు ఊగుతున్నవి.
ఎవుసం చేసే రైతుకెవరూ పిల్లనివ్వని పిచ్చితనం పోయి, ఇప్పుడిప్పుడే కల్యాణ తోరణాలు కడుతున్నరు.
అడ్డికి పావుసేరుగా అమ్ముడుబోయిన భూమి, ఇప్పుడిప్పుడే బంగారమై గారాలుపోతున్నది.
నీ పిల్లనిస్తవా. కట్నమేమీ వద్దు. కుంట కింద ఎకరం భూమిస్తే చాలని ఇప్పుడిప్పుడే పిలుపొస్తున్నది.
…ఇంకా ఇలాంటివే సవాలక్ష కారణాలున్నాయి తెలంగాణ ధాన్యం కొనడానికి! కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం. తనను తాను నిరూపించుకునేందుకు తాపత్రయ పడుతున్న రాష్ట్రం, తన కాళ్ల మీద తను నిలబడేందుకు తపిస్తున్న రాష్ట్రం. తెలంగాణకు ఇప్పటిదాకా ఏమీ ఇవ్వలేదు కదా కేంద్రం! ఇస్తామన్నవి కూడా ఇవ్వలేదు కదా! కనీసం ఇలాగైనా రైతుకు సాయపడండి. అందుకు పదివేల కోట్లో.. ఇరవై వేల కోట్లో ఖర్చయితే పెట్టండి. అదే ఈ రాష్ర్టానికిచ్చిన జాతీయ ప్రాజెక్టు అనుకోండి. ఇప్పటికున్న చట్టాల ప్రకారం ధాన్యం కొనాల్సింది కేంద్రమే! ఇక నియమ నిబంధనలంటారా? అవి మనం పెట్టుకున్నవే. మార్చండి. మనిషి కోసం రూల్స్గానీ, రూల్స్ కోసం మనిషి కాదు. తెలంగాణలో ప్రజల కోసం ఎన్ని రూల్స్ మార్చడం లేదు! కేంద్రంలో మీరూ మార్చుకోండి. కత్తిగట్టి, మెడమీద కత్తిబెట్టి రాయించుకున్న లేఖలు, శాటి‘లైట్ వెయిట్’ లెక్కలు, దస్తావేజులు చెత్తబుట్టలో పారేయండి. గాలొచ్చినప్పుడే తూర్పార బట్టాలె! ఇంత పండాలని మనం ఆదేశించినప్పుడు రైతు పండించలేకపోవచ్చు. భూమి పంటనివ్వకపోనూ వచ్చు. ఇక్కడో, మరెక్కడో కరువో, వరదో రావచ్చు. అందువల్ల మూడేండ్లకు కాదు, 30 ఏండ్లకు ధాన్యం నిల్వలున్నా తప్పులేదు. రైతు ఉత్పత్తిని ఎవరు కొనాలనే ప్రశ్నే అర్థరహితమైనది. ఎంత కొనాలనే ప్రశ్నే నిరర్థకమైనది. ఎంత పండితే అంత కొనాల్సిందే! అన్ని శాఖలూ తమ అధీనంలోనే ఉండాలనీ, అధికారమంతా తమకే కావాలని, వేరెవరి చేతిలోనూ ఏమీ ఉండకూడదని ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారే కొనాలి. కొనుగోలు వ్యవస్థ మొత్తాన్నీ ఇన్నాళ్లూ ఎవరు గుప్పిట్లో పెట్టుకున్నారో వారే కొనాలి. ఒకవేళ వడ్లు కొనడం రాష్ట్రం బాధ్యతే అంటే దిగుబడి నుంచి ఎగుమతి దాకా సమస్త వ్యవస్థనూ రాష్ర్టాలకే అప్పగించండి. ఎడ్లను బండెనకగట్టి ముందుకు పొమ్మంటే ఎట్లా?
కేంద్రంలో ఉన్న పెద్ద మనుషులు తివిరి ఇసుమున ‘తైలంబు’ తీయగల సమర్థులే కావచ్చు. కానీ కేవలం లాభనష్టాల లెక్క చూడటానికి మనం వ్యాపారులమూ కాదు, వ్యవసాయం వ్యాపారమూ కాదు. తెలంగాణలో తెరిపిన పడుతున్న రైతుల్ని మళ్లీ నిస్పృహలోకి నూకి, అవాంఛనీయ సన్నివేశాలకు అవకాశమిచ్చి, తర్వాత వారిని ఆదుకుని, ఆదాయాన్ని రెట్టింపు చేస్తామనడం… ఆవును చంపి దాని చర్మంతో చెప్పులు కుట్టించి దానం చేస్తామన్నంత పుణ్యకార్యం!
కేంద్రంలో అధికారంలో ఉన్నవాళ్లే మేమూ రాజకీయం చేస్తామనడం అనౌచిత్యం. అధికారం కోసం రాజకీయమే గానీ రాజకీయం కోసం అధికారం కాదు. కుతర్కాలు, వితర్కాలతో లాభం లేదు. మనసుంటే మార్గముంటది. రాజకీయం కోసం మనసు పరితపించినపుడు మార్గం కనిపించదు. తమ వైఫల్యాన్ని రాష్ట్రం మెడకు చుట్టాలనే అతితెలివి ప్రయత్నం చేసినప్పుడే కేంద్రం సంగతి తేటతెల్లమైంది.
మన చట్టాలు, చట్ట సభలు, పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులు, పాలకులు వీరందరికన్నా రైతే ముందు, ఆ తర్వాతే అన్నీ!
అందువల్ల అలనాడు వాజపేయి చెప్పినట్టు కొంత రాజధర్మం ప్రదర్శించడం ఇప్పుడు అవసరం. కాదంటే ఏం జరుగుతుందో ఉత్తరాది రైతులు ఎలాగూ చూపించారు. పొడిచే ఎద్దు, తన్నే బర్రె దొడ్డిలో ఉండొద్దని రైతుకు మనం చెప్పాలా? నడవని ఎడ్లను నాగలి కట్టొద్దని మనం నేర్పాలా?
-తిగుళ్ల కృష్ణమూర్తి , kruthi1972@gmail.com