ఢిల్లీ మద్యం పాలసీ కేసు విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ప్రమేయం ఉందనే ఆరోపణలకు సంబంధించి మొదటినుంచీ అర్థం కాని విషయాలు కొన్నున్నాయి. ఆమె ఒక సాధారణ మహిళ అయినట్టయితే ఇదంతా ఎవరి దృష్టినీ ఆకర్షించేది కాదు. కానీ, తను ప్రముఖురాలు గనుక తొలిరోజు నుంచే ఈ కేసు రెండు తెలుగు రాష్ర్టాలలో విపరీతమైన ప్రచారం పొందింది. ప్రతి చిన్న అంశం గురించి ప్రజలు చాలా చర్చించుకున్నారు. ఆ తొలి దశలోనే ప్రజలకు కొట్టవచ్చినట్లు కనిపించి, ఆశ్చర్యకరంగా తోచిన విషయాలు కొన్నున్నాయి. కవిత పేరును అభియోగ పత్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మొదటిసారి పేర్కొన్నది 2022 నవంబర్ 26వ తేదీన. కానీ అంతకు సుమారు నాలుగు నెలల ముందునుంచే కొన్ని పరిణామాలు కనిపించసాగాయి. కేసులో కవిత ప్రమేయం ఉందని బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆగస్టు నుంచే ఆరోపించటం మొదలుపెట్టారు. కొన్ని ఆందోళనలు కూడా చేశారు. తెలంగాణపైన, కేసీఆర్ కుటుంబంపైన మొదటినుంచి కక్షగట్టిన ఒక కోస్తా పత్రిక, అదే ధోరణిలో పదే పదే చెప్పుడు వార్తలు రాస్తూ పోయింది. వాటిని ఇంగ్లీషులో ప్లాంటెడ్ స్టోరీస్ అంటారు. కవిత అరెస్టు, తనకు జైలు శిక్ష తప్పవని కూడా ఆ పార్టీలతో పాటు ఆ పత్రిక ప్రకటించింది.
Supreme Court | ఇందులో ముఖ్యంగా గమనించవలసిందేమంటే, కవిత అరెస్టు మాట అట్లుంచి ఆమె పేరును కనీసం అభియోగ పత్రంలో ప్రస్తావించటమైనా తర్వాత నాలుగు మాసాలకు గాని జరగలేదు. ఆ తర్వాత ప్రాథమిక విచారణ అయినా మరొక నెల గడిచిన తర్వాత జరిగింది. అటువంటప్పుడు నాలుగు నెలల ముందే బీజేపీ, కాంగ్రెస్‌లకు, సదరు కోస్తా పత్రికకు ఈ విషయాలు ఏ విధంగా తెలిశాయన్నది రెండు రాష్ర్టాల ప్రజలు అనేకులు అంతుబట్టక ఆశ్చర్యపోయారు. ఒకవైపు ఇదంతా అంతకాలం పాటు జరుగుతుండగా కేంద్ర ఏజెన్సీ అయిన ఈడీ అధికారులు అవునని గాని, కాదని గాని ఏమీ మాట్లాడకపోవటాన్ని కూడా పలువురు గమనించారు. దీనంతటిని బట్టి కొన్ని అనుమానాలు ఆ తొలి దశలోనే బలంగా కలిగాయి. బీజేపీ, కాంగ్రెస్‌లు తెలంగాణలో తమకు సవాలుగా నిలిచిన టీఆర్ఎస్ను దెబ్బకొట్టదలిచాయి. సదరు కోస్తా పత్రిక లక్ష్యం కూడా అదే అయింది. అప్పటినుంచి అసెంబ్లీ ఎన్నికలకు తగిన సమయం ఉన్నందున బీఆర్ఎస్పై దాడికి ఇదొక మంచి ఆయుధం అవుతుంది. ఆ విధంగా ఆ పథకం అమలు మొదలైంది.
కవిత బెయిల్ దరఖాస్తు ఆగస్టు 27న సుప్రీంకోర్టు ఎదుట విచారణకు వచ్చినప్పుడు, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ఇరువురూ వేసిన అనేక సూటి ప్రశ్నలకు ఈడీ, సీబీఐ న్యాయవాదులు జవాబులు చెప్పలేకపోయారు. కొన్నింటికి డొంక తిరుగుడు సమాధానాలిచ్చారు. తరచూ తడబడ్డారు. ఒక్కోసారి తాము చేసిన వాదనలను ఇంకొకసారి తామే ఖండించుకున్నారు. ఈ విధమైన ధోరణికి న్యాయమూర్తుల చేత చీవాట్లు కూడా తిన్నారు. ఇదంతా జాతీయ మీడియా గమనించింది. వ్యాఖ్యానించింది. ఇంతకూ అనవచ్చేదేమంటే, కవిత పేరును ఈడీ వారు 2022 నవంబర్ 26న పేర్కొనటానికి నాలుగు నెలల ముందు నుంచే బీజేపీ, కాంగ్రెస్ వారు, సదరు కోస్తా పత్రిక ఆ విషయం మాట్లాడటానికి ‘సమాచారం’ ఎక్కడినుంచి వచ్చిందనే ప్రశ్నపై ఆ ముగ్గురిని కోర్టులో నిలదీయగలిగి ఉంటే కొన్ని రహస్యాలు బయటికి వచ్చి ఉండేవన్నది ఆసక్తికరమైన మాట.
అధికార యంత్రాంగంలో ఏమి జరుగుతున్నదో ఒక్కోసారి కొంతమేరకు మీడియాకు, అధికార పక్ష సన్నిహితులకు లీక్ అవుతుండటం సహజం. కానీ, ఈడీ, సీబీఐ, ఇంటెలిజెన్స్ వంటి సంస్థల నుంచి సర్వసాధారణంగా జరగదు. ఎప్పుడైనా కొద్దిగా లీక్ అయి వార్తలకు, రాజకీయ ప్రచారాలకు ఎక్కితే ఆ సంస్థ అధికారులు వెంటనే జాగ్రత్త పడతారు. అందుకు ఖండన ప్రకటనలు కూడా ఇస్తారు. ఒక జర్నలిస్టుగా స్వయంగా ఢిల్లీలో దీర్ఘకాలం పాటు పనిచేసిన నేను గమనించిన విషయాలివి. కవిత గురించిన వార్తల విషయమై ఇటువంటి బందోబస్తులేవీ ఏజెన్సీల వైపు నుంచి జరగకపోగా, ఆ వార్తలు ఏదో కొద్ది సార్లుగాక నెలల తరబడి సాగుతుండినా ఎటువంటి ఖండనలు గానీ, వివరణలు గాని, బందోబస్తు జాగ్రత్తలు గాని కన్పించలేదు. అది చాలదన్నట్టు మరింత వింతైన వార్తలు ఉరఫ్ లీకులు వస్తూపోయాయి. ఆ తీరునంతా గమనించినప్పుడు అనుమానాలు సహజంగానే బలపడుతూపోయాయి. ఢిల్లీ, పంజాబ్ ఆప్‌తో పాటు తెలంగాణలో బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీకి, మరొకవైపు కాంగ్రెస్‌కు కొరకరాని కొయ్యలుగా మారాయి. ఆ ప్రచారానికి సాధనంగా ఉత్తరాదిన ‘గోదీ మీడియా’ (మోదీ పేరును మార్చి, ఆయన గోద్లో అనగా, ఒడిలో కూర్చున్న అని అర్థం) ఉండగా, తెలంగాణలో ఒక కోస్తా యాజమాన్య పత్రిక ఆ పాత్రను బాగానే పోషించింది. అందుకే అంటున్నది, ఈ 27న సుప్రీం కోర్టులో దర్యాప్తు ఏజెన్సీల న్యాయవాదుల తడబాట్లు వెల్లడించిన కథ సగం కాగా, ఈ ముగ్గురిని కూడా విచారించగలిగి ఉంటే కథ పూర్తయ్యేది.
మద్యం కేసులోని నిజానిజాలను అంతిమంగా సుప్రీంకోర్టు తేల్చుతుంది. 493 మంది సాక్షులు, 57 మంది నిందితులు, 50 వేల పేజీల డాక్యుమెంట్లు, ఈడీ, సీబీఐ అనే రెండు ఏజెన్సీలు, రెండు చార్జిషీట్లు ఉండే ఈ కేసు ఇప్పట్లో తేలేది కాదని స్వయంగా న్యాయమూర్తులన్నారు. అయితే, ఇదంతా ఒక విధమైన నేరారోపణలకు సంబంధించినది. ఈ మొత్తం వ్యవహారంలో దీనితో నిమిత్తం కలిగిన రాజకీయ కోణం ఒకటున్నది. ఉన్నట్లు పైన చెప్పుకున్న విషయాలను గమనించినవారికి తేలికగా అర్థమవుతుంది. అందువల్ల, ఈ రెండు కోణాలకు సంబంధించిన వాస్తవాలు కూడా ప్రజల ముందుకు రావాలి. ఇంకా చెప్పాలంటే ఇందులో రాజకీయ కోణమన్నది మన ప్రజాస్వామ్యానికి, జాతీయ పార్టీలనే వాటి ధాష్ఠీకానికి, ఫెడరలిస్టు ప్రాంతీయ పార్టీల మనుగడకు సంబంధించినది అయినందున ఆ ప్రశ్న మౌలికమైనది. కేసులో నిజాలు ఉండి సంబంధిత వ్యక్తులకు శిక్షలు పడితే అది ఆ వ్యక్తులతో ముగిసిపోతుంది. కానీ, ఆప్, బీఆర్ఎస్ వంటి ప్రాంతీయ పార్టీలను, జేఎంఎం, డీఎంకే, తృణమూల్ వంటి ప్రాంతీయ శక్తులను బీజేపీ, కాంగ్రెస్ వంటి సెంట్రలిస్టు, యూనిటరిస్టు పార్టీలు తమ గోదీ మీడియా తోడ్పాటుతో ధ్వంసం చేయబూనితే అది ప్రజాస్వామ్యానికి, ఫెడరలిజానికి ప్రమాదకరంగా మారుతుంది. ప్రాంతీయ ప్రజలు, దేశ ప్రజలు గ్రహించవలసిన విషయమిది. కవిత కేసుకు సంబంధించి ఈ విధమైన పన్నుగడలు లేనిపక్షంలో, నేరారోపణ పత్రాలలో కనీసం తన పేరు అయినా ప్రస్తావనకు రాని, అసలెవరూ వినని, నాలుగు నెలల ముందు నుంచే గాని, చివరికి ఈ ఆగస్టు 27న 165 రోజులు గడిచి ఆమె బెయిల్‌పై బయటకు వచ్చిన వరకు గాని ఈ శక్తుల తీరు ఈ విధంగా ఉండేది కాదు. అంతేకాదు, విడుదల ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి 24 గంటల తర్వాత సైతం వారి మాటలు, వ్యాఖ్యలు ఎంత వికృతంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాము. దీనంతటిని బట్టి కూడా స్పష్టంగా అర్థమవుతున్నది ఇందులోని రాజకీయ కోణం ఏమిటో. అందువల్ల ఈ రెండు కోణాలను కలిపి చూసినట్లయితే తప్ప అసలు విషయం బోధపడదు. పైగా, నేర కోణపు ఆరోపణలను ప్రేరేపించిందే రాజకీయ కోణం అనే భావన విస్తృతంగా ఉన్నప్పుడు.
చివరగా, బెయిల్ విచారణ సందర్భంగా ఇరువురు న్యాయమూర్తులు లేవనెత్తిన సూటి ప్రశ్నలను ఇప్పుడొక్కసారి ప్రస్తావించుకున్నట్లయితే, దర్యాప్తు సంస్థల విషయం మనకు బాగా బోధపడుతుంది. వారి ప్రశ్నలపై ఎటువంటి వ్యాఖ్యానాలు వేరుగా అవసరం లేదు కూడా. అవన్నీ అరచేతి ఉసిరిక వలె సూటిగా, క్లుప్తంగా, స్పష్టంగా ఉన్నాయి. వాటికి జవాబుగా ఆ సంస్థల లాయర్లు తడబడటం లేదా నిరుత్తరులు కావటం మినహా, తగిన వివరణలేమీ ఇవ్వలేకపోవటమన్నది ఇందులోని అంతిమ విశేషం.
ఆ ప్రశ్నలేమిటో ఇప్పుడు చూద్దాము. కేసులో కవిత పాత్ర ఉన్నట్లయితే అందుకు సాక్ష్యాధారాలేమిటి? ఎక్కడ ఉన్నాయవి? ఇంతకాలం ఇన్నిన్ని విచారణలు చేసి ఎందుకు చూపలేకపోతున్నారు? మరెవరో తనపై ఆరోపణలు చేసినట్లయితే కేవలం అటువంటి ఆరోపణల వల్లనే ఆమె నిందితురాలవుతారా? పైగా ఆరోపణలు చేసినవారు స్వయంగా నిందితులైనప్పుడు? నిందితులలో మీరు ఎంపిక చేసిన కొద్దిమందిని అప్రూవర్లుగా మార్చుకొని కేవలం వారి వాంగ్మూలాలపై ఆధారపడి, ఇతర సాక్ష్యాధారాలు ఏవీలేకుండా ఒక వ్యక్తిని ముద్దాయిగా నిలబెడతారా? ఇన్నిన్ని విచారణలు, దర్యాప్తులలో కనీసం ఒక్క రూపాయి అయినా దొరకబట్టలేదేమి? సెల్‌ఫోన్ ఛాటింగ్‌లు, డేటాలను అవసరం లేనప్పుడు అందరూ తొలగిస్తారు. మేము (న్యాయమూర్తులం) కూడా ఆ పనిచేస్తాం. అది నేరమవుతుందా? ఫోన్‌ను ఫార్మాట్ చేయటం వేరు, ట్యాంపరింగ్ చేయటం వేరు. కవిత ఫార్మాట్ చేశారంటున్నారు గాని ట్యాంపరింగ్ చేశారనలేదు. అటువంటప్పుడు ఫార్మాటింగ్ తప్పెట్లా అవుతుంది? అసలు ఢిల్లీ ప్రభుత్వం మద్యం విధానాన్ని రూపొందించటంలోనే కుంభకోణం ఉందని ఆరోపిస్తున్నారు మీరు, ఇన్నాళ్లు గడిచినా ఆ కుంభకోణమేమిటో చెప్పలేకపోయారు. రుజువులు చూపలేకపోయారు. ఎందువల్ల? మీరనే కుంభకోణంలో కవిత పాత్ర ఎక్కడుందో కూడా చూపించలేకపోయారు. ఎందువల్ల? కనీసం ఒక్కటైనా చూపాలి గదా? విచారణలు ముగిశాయని మీరే అంటున్నారు. చార్జిషీట్లు దాఖలు చేశామని కూడా అంటున్నారు. అటువంటప్పుడు కవితను ఇంకా జైలులో ఉంచవలసిన అవసరం ఏమిటసలు? అంతా చూడగా మీ దర్యాప్తులు సక్రమంగా సాగుతున్నాయా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
న్యాయమూర్తులు ప్రస్తావించిన ప్రశ్నలు నిజానికి ఇంకా ఉన్నాయి. ఉదాహరణకు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బుచ్చిబాబు అనే వ్యక్తులకు డబ్బు చెల్లింపులలో ప్రమేయం ఉందని చెప్పిన ఏజెన్సీలు వారిని నిందితులుగా చేర్చకపోవటానికి కారణాలు ఏమిటని నిలదీశారు. అయితే, కేసు విచారణ వివరాలన్నీ ఇక్కడ అవసరం లేదు. దీనంతటిలోని ప్రధాన విషయాలు, విశేషాలన్నీ పైన పేర్కొన్న విధంగా ఇప్పటికే అర్థమవుతున్నందున అవేమిటో ప్రజలు బాగానే గ్రహించగలరు.