తెలంగాణ రాష్ట్రంలోని పల్లెలు పాలవెల్లులై నవ్వులు చిందిస్తున్నాయి. ఏండ్లకు ఏండ్లు బతుకు దెరువు కోసం వలస వెళ్లిన ప్రజలు ఇప్పుడు ఊర్లల్లోనే ఏదో ఒక పని చేసుకుంటూ సంతోషంగా జీవించడం మనం చూడవచ్చు. ఒకప్పడు పని కోసం పట్టణాలను ఆశ్రయించిన ప్రజలు ఇప్పుడు పల్లెలనే అంటిపెట్టుకుని ఉండడానికి కారణం గ్రామాల్లో ఆర్థిక వనరులు మెరుగుపడటమే. అంతేకాకుండా పట్టణాల్లో ఉండే ప్రతి సౌకర్యం ఇప్పుడు పల్లెలకు కూడా వ్యాపించింది. ఆన్లైన్లో బుక్ చేసిన వస్తువులు గ్రామాల్లోనూ ఇంటింటికి చేరుతున్నాయి.
గ్రామాల్లో ఆర్థికంగా స్థిరపడేందుకు ప్రజలు వనరులను సమకూర్చుకుంటూ ఉండడం తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టిగా మెరుగుపడింది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ చేతి, కులవృత్తులతో అల్లుకుపోయిన జీవన విధానం. కానీ, తెలంగాణ ఏర్పాటు తర్వాత అవసరాలకు, కాలానికి తగ్గట్లుగా మార్పుకు నోచుకున్నది. విస్తరిస్తున్న వివిధరకాల వ్యాపారాలు, సేవలు ఆర్థికంగా బలోపేతం చేస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామీణ జీవనం, ఆర్థిక వ్యవస్థను సమగ్ర ప్రణాళికతో, ముంద స్తు వ్యూహంతో పటిష్టపరిచారు. ఇంటికి దీపం ఇల్లాలు అన్న నమ్మికతో మహిళల అభ్యున్నతికి బాటలు పరి చారు. గ్రామాల్లోని మహిళలను ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు స్వయం సహాయక సంఘాల ద్వారా రుణా లు మంజూరు చేయించారు. పాడి పశువుల పెంపకం, కిరాణా దుకాణాలు, తదితర వ్యాపారాల్లో రాణించేందుకు ప్రోత్సహించారు.
గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఆర్థికంగా బలోపేతం కావడానికి ఉపాధి హామీ పథకం కూడా ఒకటి. ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడంలో సీఎం కేసీఆర్ అద్వితీయ విజయాలు సాధించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిర్వహణ, కూలీలకు పని కల్పించడంలో తెలంగాణను ముందంజలో ఉంచారు. కేటాయించిన పనిరోజులను ముందుగానే పూర్తిచేసి అదనపు పని రోజులకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకున్నారు. దీంతో అదనంగా పని కల్పించిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. ఇందులో భాగంగా నీటి సంరక్షణ, మరుగుదొడ్ల నిర్మాణం, హరితహారం, అంగన్వాడీ, పంచాయతీ కార్యాలయాల నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణంతో ఉపాధి కూలీలకు పని లభించింది. ఉపాధి పని సద్వినియోగం, కూలీలకు పని కల్పించడంలో పలు జిల్లాలు అవార్డులు సైతం సొంతం చేసుకున్నాయి. వేసవి కాలంలో ఉపాధి హామీ పనులు చేసే కూలీలకు ప్రత్యేక వేసవి భత్యాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించి, పనిదినాలను, వేతనాలను కూడా పెంచారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పల్లెలను ఆర్థికంగా పటిష్టం చేయడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా చేతి, కుల వృత్తులకు జీవం పోశారు. ఉమ్మడి పాలనలో గ్రామీణ జీవన విధానం విధ్వంసానికి గురైంది. వృత్తులనే నమ్ముకొని జీవించిన వారు వలసజీవులుగా మారి పోయారు. కానీ, తెలంగాణ ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలతో వృత్తులు మళ్లీ జీవం పోసుకున్నాయి. గొర్రెలు, చేపల పెంపకం, నాయీ బ్రాహ్మణ, రజక, చేనేత వృత్తుల వారికి సాయమందించి ప్రోత్సహిస్తున్నారు. ఆయా వృత్తులను ఆధునీకరించడం, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడంలాంటి చర్యల ద్వారా దానిపై ఆధారపడిన వారి జీవితాల్లో మార్పు తీసుకువచ్చారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి పోసేందుకు సీఎం కేసీఆర్ కులవృత్తులను ప్రోత్సహిస్తూ గొల్లకుర్మలకు 75 శాతం సబ్సిడీతో గొర్రెల పంపిణీ చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న గొల్లకుర్మలకు ఈ పథకం ద్వారా ప్రభుత్వం ఊపిరి పోసిందనే చెప్పవచ్చు.
ఒక్కో యూనిట్ కింద 20 గొర్రెలు, ఒక పొట్టేలును అందజేసి, బీమా సౌకర్యాన్ని కూడా కల్పించారు. ఈ గొర్రెల పంపిణీ పథకంలో భాగంగానే పశుగ్రాసం కొరత ఏర్పడకుండా దాణా పంపిణీ చేస్తున్నారు. దీంతో మాంసం ఉత్పత్తి, వినియోగంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచింది. మాంసం విక్రయాలతో వ్యాపారం చేసుకునే వారికి ఆర్థిక భరోసా కూడా ఏర్పడింది. గొర్రెల పంపిణీ తర్వాత రాష్ట్రంలో గొర్రెల సంతలు, మాంసం విక్రయాల మార్కెట్లు పెరిగాయి. గొర్రెల పెంపకం, మాంసం వ్యాపారంతో ఎంతో మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. కులవృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న మరో అద్భుతమైన పథకమే ఉచిత చేపపిల్లల పంపిణీ. ఈ పథకం ద్వారా ఆయన నీలి విప్లవాన్ని తీసుకు వచ్చారు. చెరువులను విస్తరించడమే కాకుండా, ఆ చెరువులపై ఆధారపడి జీవించే కులవృత్తులవారిని ఆర్థికంగా నిలదొక్కుకునేలా తోడ్పాటు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మత్స్యకారులకు ఉపాధి లభించే ఏర్పాట్లు చేశారు. తెలంగాణ బీఆర్ఎస్ ప్రభు త్వం చెరువుల్లో చేపలను పెంచే గంగపుత్రులు, ముదిరాజులు, చేపల పెంపకందారులకు ఉచితంగా 100 శాతం సబ్సిడీతో చేప, రొయ్య పిల్లలను అందిస్తున్నది. కేజ్ కల్చర్, చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాల ఆధునీకరణ, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి వీటిని వినియోగిస్తుంది. ఇప్పుడు గ్రామాల్లో చేపల విక్రయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మత్స్య సంపదతో ఎంతోమంది ఉపాధి పొందుతూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు.
తెలంగాణలో కులవృత్తిపైనే ఆధారపడి జీవించే గీత కార్మికులకు నీరా పాలసీ, వైన్స్‌ల టెండర్లలో రిజర్వేషన్ వంటి పథకాలతో వారికి కూడా ఆర్థిక భరోసా ఏర్పడింది. రజకులు తమ వృత్తులను సాఫీగా కొనసాగించేందుకు ఆధునిక ధోబీఘాట్ల నిర్మా ణం, ఆధునిక యంత్రాలతో లాం డ్రీల ఏర్పాటు, వ్యక్తిగత ఆర్థిక సహా యం అందించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నది. నా యీ బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా ప్రభుత్వం రూ.లక్ష ఆర్ధిక సాయం అందిస్తున్నది. కొత్తగా క్షౌర శాలలు ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక సా యం, సెలూన్లకు విద్యుత్తు చార్జీల్లో మినహాయింపు వంటి వాటితో ఆయాకుల వృత్తుల వారు సంతోషంగా ఉన్నారు. ఇతర బీసీ కులాల్లోని చేతి వృత్తుల వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం రూ.లక్షను అందజేసి, భరోసా కల్పిస్తున్నది.
చేనేతలకు సీఎం కేసీఆర్ చేయూతనందించారు. ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు పట్టించుకోక పోవడంతో రాష్ట్రంలో చేనేతలు ఆకలి చావులు, ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉన్నది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన పథకాలతో వారు సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్, మంత్రి కేసీఆర్ బ్రాండ్ అంబాసిడర్ ప్రమోషన్‌తో ఈ రంగానికి ఆదరణ లభించింది.
ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు చేనేత వస్ర్తాలను ధరించే విధంగా పిలుపునివ్వడం, ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్ర్తాల ఆర్డర్లు చేనేతలకే ఇస్తున్నారు. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంలో అందించే చీరలు, దుస్తుల ఆర్డర్లను కూడా వారికే ఇస్తున్నారు. బహిరంగ మార్కెట్లో పోటీని తట్టుకోవడానికి తెలంగాణ స్టేట్ హ్యాండ్లూం వీవర్స్ కోపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసి, విని యోగదారుల అభిరుచి, అంచనాలు, అవసరాలకు అనుగుణంగా దుస్తులను సిద్ధం చేసుకుని మార్కెట్లో దూసుకుపోతున్నది. ఇలా ఎంతో మందికి కులాల వారీగా, చేతి వృత్తిదారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.
సీఎం కేసీఆర్ తీసుకువస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాల తో గ్రామాల్లోని ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. ఇప్పుడు పట్టణాల్లోకి వలసలు వెళ్లి స్థిరపడిన వారు కూడా గ్రామాల్లో పెరుగుతు న్న ఆర్థికవ్యవస్థ గ్రాఫ్‌ను చూసి అందుకు గల కారణాలను వెతుకాల్సిన పనిలో పడ్డారంటేనే అర్థం చే సుకోవచ్చు పల్లె ప్రజల జీవన విధా నం ఏ విధంగా మెరుగుపడిందో.
-రాపల్లి శోభన్ కుమార్
97055 54437