చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం అనే నినాదానికి కాలం చెల్లిపోయినట్టు కనిపిస్తున్నది. గంపెడు పిల్లల్ని కనడమే ఆదర్శం అవుతున్నది. ఒక్కో జంట పదహారు మంది పిల్లల్ని కనాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇచ్చిన పిలుపు దీనినే సూచిస్తున్నది. ఆ పిలుపు మరోసారి ఉత్తర, దక్షిణ తారతమ్యాల చర్చకు తెరలేపింది. నియోజకవర్గాల పునర్విభజనలో తమిళనాడుకు జరగబోయే నష్టాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన వ్యంగ్యంగా ఆ మాట అన్నప్పటికీ మొత్తంగా ఐదు దక్షిణ రాష్ర్టాలకు అది వర్తిస్తుంది. మేమిద్దరం మాకిద్దరు అనే సూత్రం చాలావరకు పాటించి దేశ జనాభా నియంత్రణకు దన్నుగా నిలిచిన దక్షిణాదికి ఒరిగిందేమిటి? జనాభా ప్రాతిపదికన పునర్విభజన జరుగుతుండటంతో ఉత్తరాదిలో లోక్సభ స్థానాల సంఖ్య భారీగా పెరుగుతుంది. అదే సమయంలో దక్షిణాదికి అరకొరగా మాత్రమే సీట్లు పెరుగుతాయి. దీని ఫలితంగా పార్లమెంటులో నిర్ణాయక పాత్ర పోషించే అవకాశాన్ని దక్షిణాది కోల్పోతుండటం అసలు కీలకం. 2026లో జరుగనున్న పునర్విభజన కసరత్తులో మొత్తం స్థానాల సంఖ్య 543 నుంచి 753కు పెరుగుతుందని తెలియవస్తున్నది. అప్పటికి భారత్ జనాభా 142 కోట్లు అవుతుందని ఒక అంచనా. జన సంఖ్యను బట్టే పునర్విభజన ద్వారా నియోజకవర్గాలను పెంచుతారు. అయితే, ఈ పెరుగుదల అంతటా ఒకే తీరుగా ఉండదు. గరిష్ఠంగా లబ్ధి పొందనున్న యూపీలో ప్రస్తుతం 80 స్థానాలుంటే అవి 126కు పెరుగుతాయి. 50 శాతం పైగా స్థానాలు వచ్చిచేరుతాయి. బీహార్లో 30, మహారాష్ట్రలో 20, రాజస్థాన్లో 19, మధ్యప్రదేశ్లో 18 స్థానాలు పెరుగుతాయి. అదే తమిళనాడులో 39 కాస్తా రెండు పెరిగి 41 అవుతాయి. ఇక తెలంగాణ, ఏపీలకు చెరో మూడు లభిస్తాయి. దక్షిణాదిలో ఎక్కువగా పెరిగే కర్ణాటకలో 28 నుంచి 36 అవుతుంది. కేరళలో 20 నుంచి 19కి తగ్గడం మరీ దారుణం.
కేంద్ర ప్రభుత్వం డెబ్బయ్యో దశకంలో కుటుంబ నియంత్రణను విరివిగా ప్రచారం చేసింది. అధిక జనాభాతో సంక్రమించే సమస్యలను దూరం పెట్టేందుకు దానిని చేపట్టారనేది తెలిసిందే. విద్యా విషయకంగా ముందంజ సాధించి పరిమిత కుటుంబ లక్ష్యాలను సాధించిన దక్షిణాది ఆర్థికంగానూ దేశానికి అండగా నిలుస్తున్నది. ఇప్పటికీ వెనుకబాటుతనంలో మగ్గుతున్న ఉత్తరాది చదువుల్లో వెనుకబడిపోయింది. కుటుంబంపై పరిమితి లేకపోవడం వల్ల జనాభా నియంత్రణలో వెనుకబడి పోయింది. అంటే అక్కడ జనాభా ఎడాపెడా పెరిగిపోయిందన్న మాట. దీనివల్ల ఉత్తరాదికి జరిగే నష్టం ఏమీ లేదు. పైగా లాభపడుతున్నది కూడా. ఉత్తర, దక్షిణ వ్యత్యాసాల్లో ఆర్థిక కోణాలూ ఉన్నాయనేది దృష్టిలో ఉంచుకోవాలి. ఆర్థికంగా సత్వర అభివృద్ధి సాధిస్తున్న దక్షిణాది ఎక్కువ పన్నులు చెల్లిస్తుంది. కానీ, ఆ సొమ్ము అధికంగా ఖర్చయ్యేది ఉత్తరాదిలోనే. ఆదాయాన్ని బట్టి పన్నులు వేసి, జనాభాను బట్టి నిధులు ఖర్చుచేసే సంప్రదాయం అందుకు కారణం.
పైన తెలిపిన కారణాల వల్ల దక్షిణాది రాష్ర్టాలు పునర్విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జనాభా నియంత్రణను పటిష్ఠంగా అమలుచేసినందుకు మా రాష్ర్టాన్ని శిక్షిస్తారా? అని తమిళనాడుతో పాటుగా దక్షిణాది రాష్ర్టాలన్నీ మొదటినుంచీ ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటిదాకా నాలుగు సార్లు పునర్విభజన కమిషన్లు ఏర్పాటైనా ఏమీ జరుగలేదు. అయితే ఈసారి ఎలాగైనా సాధించి తీరాలనే పట్టుదలతో కేంద్ర పాలకపక్షమైన బీజేపీ దూకుడుగా పోతున్నది. ఉత్తరాదిలో బాగా విస్తరించి దక్షిణాదిలో పట్టు సాధించేందుకు తంటాలు పడుతున్న ఆ పార్టీకి పునర్విభజన లెక్కలు సానుకూలంగా ఉన్నాయనేది గమనార్హం. అయితే, దక్షిణాది ప్రాతినిధ్యం తరుగుదల సమస్యను పరిష్కరిస్తామని కేంద్రం చెప్తున్నది. అది ఎలా అనేది మాత్రం ఇప్పటిదాకా స్పష్టత రాలేదు.