సాహిత్య ప్రక్రియల్లో నాటకానికి విశిష్ఠ స్థానం ఉన్నది. అందుకే మహాకవి కాళిదాసు ‘నాటకాంతం హి సాహిత్యం’ అని అన్నారు. అనగా అన్ని సాహిత్య ప్రక్రియల్లోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం అని అర్థం. బాణ, ప్రకరణ, ప్రహసన, డిమ, వ్యాయోగ, సమవాకార, వీథి, అంక, ఈహామృగ వంటి దశ రూపకాల్లో నాటకం ఉత్తమమైనది. శ్రవణ సహిత దృశ్యరూపకం నాటకం.
కాకతీయుల కాలంలో ప్రదర్శించిన క్రీడాభిరామం కూడా ఒక నాటకమే అని చెప్పవచ్చు ను. అయితే, కొందరు క్రీడాభిరామంలో నాటక లక్షణాల్లేవు అంటారు. మహా పండితులు చెప్పిన నాటక లక్షణాలు సమస్తం అనుసరిస్తూ నాటకం రాయడం, ప్రదర్శించడంలో తప్పులేదు కానీ, భాస మహాకవి వంటి వా రు రాసిన ‘ఊరు భంగం, దూత వాక్యం, కర్ణ భారం, దూతఘటోత్కచం, పాంచరాత్రం, అవిమారకం, స్వప్న వాసవదత్తము వంటి రచనల్లో నాటక లక్షణాలు సమ స్తం ఉండవు’ అని కొందరు పండితులు అంటారు. నాటకంలో పది మందిని ఆకర్షించే సన్నివేశాలు, చక్కని సంభాషణలు, ఆకర్షణీయమైన సంగీతంతో కూడుకున్న పద్యాలు, పాటలు రంగస్థలంపై ఉన్న నటుల నటన పదిమందిని ఆకర్షిస్తే అలాంటి నాటకాలన్నీ ప్రజాదరణ పొందుతూనే ఉంటాయి. అప్పుడు పండితులు చెప్పిన నాటక లక్షణాలు లెక్కలోకి రావు. నిజం చెప్పాలంటే పండితుల నాటక లక్షణాలకు ప్రజాదరణ పొందిన నాటక లక్షణాలకు సంబంధం ఉండదు.
నాటక లక్షణాల్లో నాయకుడు ఉత్తముడై ఉండాలంటారు. దుష్యంతుడు, హరిశ్చంద్రుడు వంటి నాయకు లు ఉత్తములా? అంటే ఎవరి అభిప్రాయం వారిది. ఎవ రు ఉత్తములు? ఎవరు మధ్యములు? ఎవరు అధము లు? అనే చర్చోపచర్చలు మహా పండితుల నడుమ సాగుతుంటాయి. ఎక్కువ శాతం, నాటక ప్రజాదరణ, పండితుల చర్చోపచర్చలకు భిన్నంగా ఉంటుంది. ఏదేమైనా ఒకప్పుడు తెలుగు నాటకాలు ప్రజలను విపరీతంగా ఆకర్షించాయి. తెలుగు తొలి నాటకం 1860 ప్రాంతాన కోరాడ రామచంద్రశాస్త్రి రాసిన మంజరీ మధుకరీయం అని నాటక చరిత్రకారులు చెప్తున్నారు. తెలుగులో అభిజ్ఞాన శాకుంతలం, నరకాసుర విజయం, వేణీ సంహారము, గయోపాఖ్యానం, ప్రతాపరుద్రీయం, కన్యాశుల్కం, పాదుకా పట్టాభిషేకం, హరిశ్చంద్ర, పాండవ ఉద్యోగ విజయాలు, బొబ్బిలి యుద్ధం, పల్నాటి యుద్ధం, శ్రీకృష్ణ తులాభారం, ప్రమీలార్జునీయం, శ్రీకృష్ణాంజనేయ యుద్ధం, శ్రీరామాంజనేయ యుద్ధం, లవకుశ, భక్త రామదాసు, భక్త ప్రహ్లాద, సతీ అనసూయ, సతీ సావిత్రి, చింతామణి, వరవిక్రయం, నర్తనశాల, శ్రీమత్ పోతులూరి వీర బ్రహ్మేంద్రస్వామి చరిత్ర, అల్లూరి సీతారామరాజు, ఛత్రపతి శివాజీ, కురుక్షేత్రం, మాభూమి, కీర్తిశేషులు, రంగూన్ రౌడీ, వసంత సేన వంటి తెలుగు నాటకాలు ఒకప్పుడు దేశ విదేశాల్లోని అనేక రంగస్థలాలకు వన్నె తెచ్చాయి. ఒక లెక్క ప్రకారం తెలుగులో పౌరాణిక, చారిత్రక, సాంఘిక, జానపదాది నాటకాలు రమారమి నాలుగు వేలపైనే అన్న మాటల్లో ఆవంత కూడా అతిశయోక్తి లేదు.
ఏదేమైనా ఒకనాటి తెలుగువారి మనసుల్లో కొన్ని పౌరాణిక పాత్రలు మరికొన్ని చారిత్రక సంఘటనలు శాశ్వతంగా నిలిచిపోవడానికి ప్రధాన కారణం తెలుగు నాటకాలు అని చెప్పవచ్చు. రామాయణ భారత భాగవతాదులలో కూడా లేని సంఘటనలు మన తెలుగు పౌరాణిక నాటకాల్లో ఉన్నాయి. ఆ కల్పిత సంఘటనలే నిజమన్న సామర్థ్యాన్ని సంతరించుకున్నాయి. ఒకప్పుడు తెలుగు నాటకాలకు అంత శక్తి ఉంది. శ్రీరామాంజనేయ యుద్ధం, శశిరేఖా పరిణయం, సీత అగ్ని ప్రవేశం, వాల్మీకి ఆశ్రమంలో లవకుశులు, శ్రీరామ శంబూకుల యుద్ధం, కర్ణుని నాయకతేజం వంటి అనేకానేక అంశాలు రామాయణ భారత భాగవతాదులలో వేరే రకంగా ఉంటాయి. భాగవత పురాణంలో హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు అన్నట్టు ఉండదు. కానీ, మన తెలుగు నాటకాలు అనేకానేక పురాణ పాత్రలను మహోన్నత నాయకులుగా తీర్చిదిద్దాయి. ఈ పౌరాణిక చారిత్రక, సాంఘిక నాటకాలే తర్వాత, తర్వాత సినిమాలుగా వచ్చాయి. ఆ సినిమాలు కూడా అధికశాతం విజయవంతం అయ్యాయి. తెలుగునాట ఒకప్పుడు పౌరాణిక నాటకాల కథాంశాలే అసలు రామాయణ భారత భాగవతాదులలోని కథాంశాలు అనుకుంటే, ఆ తర్వాత పౌరాణిక సినిమాలే అసలు రామాయణ భారత భాగవతాదులలో కథాంశాలు అని అధిక శాతం తెలుగువారు అనుకునేవారు. నేడు పౌరాణిక సినిమాల ప్రభావం తగ్గిపోయింది. ఏదేమైనా పౌరాణిక సినిమా నాలెడ్జే పురాణ నాలెడ్జ్ అని పొంగి పోవడం అశాస్త్రీయమవుతుంది.
కొన్ని కొన్ని తెలుగు సాంఘిక సినిమాలలో పౌరాణిక, జానపద, చారిత్రక ఛాయలుంటాయి. ఉదాహరణకు బాసు ని స్వప్న వాసవదత్త నాటకంలో వాసవదత్త అవంతిక పేరుతో పద్మావతి దగ్గర ఉంటుంది. ఆమెను పద్మావతీ దేవి దగ్గరికి మంత్రి యౌగం ధరాయణుడు తీసుకువస్తాడు. ఆ సంఘటన ఛాయయే సంప్రదాయం అనే తెలుగు సినిమా మూలకథ అనిపిస్తుంది. ఇలాంటి ఛాయలు మన తెలుగు సినిమాలలో చాలా కనపడతాయి. అలాగే, శ్రీకృష్ణ తులాభారం కథా ఛాయ శుభలగ్నం అనే సాంఘిక సినిమాలో కనపడుతుంది. శమంతకమణి పౌరాణిక వృత్తాంతానికి ఛాయారూపంగా ఎన్టీఆర్ వేటగాడు సినిమా ఉంటుంది. ఇలా పౌరాణికాది కథల ఛాయతో సాంఘిక సినిమాలు రావడం తప్పు కాదు. అయితే, పౌరాణిక పాత్రల ఔచిత్యం దెబ్బతినేటట్టు పౌరాణిక సినిమాలు రావడం మాత్రం మంచిది కాదు. నేడు తెలుగునాట దుష్ట చతుష్టయంలోని ఒకడైన కర్ణుడు కొందరికి నాయకుడిగా కనపడతాడు. నిజానికి వ్యాసభారతం చదివితే ఆ భావన రాదు. పౌరాణిక పాత్రల గుణగణాలను లెక్క గట్టేటప్పుడు యుగధర్మాదులన్నీ గమనించాలి. వ్యాస భగవానుడు ఆ పని చేశాడు. కలియుగ నాటక రచయితలు, సినిమా రచయితలు ఆ పని చేయలేదు.
శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరిజ్ఞానం, పౌరాణిక కథా పరిధులు పెరిగిన ఆధునిక కాలంలో, స్వయంప్రభ, ప్రమద్వర, ఉలూక రాయబారం వంటి పౌరాణిక నాటికలు, బాసర సరస్వతి చరిత్ర, శ్రీ కాళేశ్వర క్షేత్ర మహిమ, ఆర్యభట్ట, వరాహ మిహిర, భాస్కరాచార్య, శ్రీనివాస రామానుజన్, మహా వీరాచార్య, బ్రహ్మగుప్త వంటి నాటికలు అక్కడక్కడ ప్రభుత్వేతర పాఠశాలల్లో విద్యార్థుల చేత ప్రదర్శితమవుతూనే ఉన్నాయి. అయితే, ఒకప్పటి తెలుగు నాటకాల ప్రదర్శనలా ఇప్పుడు తెలుగు నాటక ప్రదర్శనలుండటం లేదన్నది నిజం.
అక్కడక్కడ కొన్ని నాటక పరిషత్తులవారు నాటక పోటీలను ప్రదర్శిస్తూ, వర్తమాన సాంఘిక నాటకాలకే ప్రాధాన్యాన్నిస్తున్నారు. కొత్తగా ఆలోచించలేక పోతున్నారు. నేడు నాటకాలకు ఆదరణ కరువైంది. అయితే, విద్యా ప్రపంచాన ఒకప్పటి కంటే ఇప్పుడు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ఎక్కువగానే కనపడుతుంది. అయితే ఆయా సాంస్కృతిక ప్రదర్శనలు అధిక శాతం సినిమా పాటలకు, షోకేస్ బొమ్మల్లా విద్యార్థులను తయారు చేయడానికి పరిమితమవ్వడం విచారించవలసిన విషయం. విద్యార్థులతో శాస్త్ర సాంకేతిక, పౌరాణిక విజ్ఞాన తెలుగు నాటికలను ప్రదర్శింపజేయడం వల్ల విద్యార్థులలో తెలుగు భాషా ఉచ్చారణ సామర్థ్యం పెరుగుతుంది. భాషపై పట్టు వస్తుంది. విషయ అవగాహన మీద పట్టు పెరుగుతుంది. బట్టీతత్వం తగ్గి పరిశోధనాతత్వం పెరుగుతుంది. మన భారతీయ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన పరిధులను తెలుగు నాటికల ద్వారా పెంచవచ్చును. అలా జరిగిననాడు భారతీయ శాస్త్రసాంకేతిక విజ్ఞానం ప్రయోగశాలల వైపు పయనమవుతుంది. మన తెలుగు నాటక తేజం శాస్త్రీయపథాన వికసిస్తుంది.