మాయమాటలు, గారడీ విద్యలకు కాంగ్రెస్ పార్టీ పెట్టింది పేరు. విజ్ఞులను కూడా అజ్ఞానులుగా మార్చడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. సామాన్యులనే కాదు, పీజీలు, పీహెచ్‌డీలు చేసినవారిని కూడా ఆ పార్టీ మాయచేయగలదు. మార్పు మార్పు.. అంటూ గత అసెంబ్లీ ఎన్నికల్లో విజ్ఞులైన యువతను కూడా ఏమార్చి ఆ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నది. రాష్ట్రంలో తొలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంలో యువత పాత్ర ఎనలేనిది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లలో 1,65,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేసినప్పటికీ నియామకాల్లో జరిగిన జాప్యం వల్ల నిరుత్సాహంలో ఉన్న నిరుద్యోగుల బ్రెయిన్‌ను కాంగ్రెస్ పార్టీ వాష్ చేసింది. అలవికాని హామీలు ఇచ్చి వారిని ఆశల పల్లకిలో ఊరేగించింది. జాబ్ క్యాలెండర్, ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగులకు నెలకు రూ.4000 చొప్పున నిరుద్యోగ భృతి, అమరుల కుటుంబాలకు నెలకు రూ. 25 వేల పింఛన్, యువతకు 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు వంటి అనేక హామీలు ఇచ్చింది.
అంతేకాదు, విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు ఉచితంగా స్కూటీ, పీజీ పూర్తిచేస్తే లక్ష, డిగ్రీ పూర్తిచేస్తే 25,000, ఇంటర్మీడియట్‌కు 15,000, పదో తరగతి పాసయితే 10,000 చొప్పున ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టింది. దీంతో నిరుద్యోగులు, యువత కాంగ్రెస్ కార్యకర్తల అవతారం ఎత్తి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ, రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ ఒక్క హామీ కూడా అమలు కాలే దు. ఉద్యోగాలు ఇవ్వలేదు. పైగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం భర్తీ చేసిన ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి, తామే 55,000 ఉద్యోగాలు ఇచ్చామని యువతను మోసం చేస్తున్నది. నాడు కేసీఆర్ సర్కారుపై యువతను రెచ్చగొట్టినవాళ్లు ఇప్పుడు ఒక్కరూ కనిపించడం లేదు. డిక్లరేషన్లు ప్రకటించిన ప్రియాంకగాంధీ, రాహుల్‌గాంధీ ముఖం చాటేశారు.
ఆరు నెలల క్రితం జరిగిన నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టిన యువతకు ఏం మేలు జరిగింది? ఈ ఆరు నెలల కాలంలో ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ఏ ఒక్క అంశం గురించి అయినా ప్రభుత్వాన్ని ప్రశ్నించారా? నిరుద్యోగుల ఒక్క సమస్యనైనా లేవనెత్తారా? నిరుద్యోగుల నిరసనకు అండగా నిలబడ్డారా? ఆయన భాష మారింది, బాడీ లాంగ్వేజ్ మారింది. స్వరం పూర్తిగా మారిపోయింది. ప్రశ్నిస్తానంటూ యువతకు మాయమాటలు చెప్పి ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన రేవంత్‌రెడ్డి పంచన చేరిపోయారు. మరోసారి యువతను వంచించేందుకు వస్తున్న కాంగ్రెస్‌కు ఆదమరిచి అవకాశమిస్తే మన బతుకులు ఆగమైనట్టే. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక రూపంలో మనకు ఒక చక్కని అవకాశం వచ్చింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఓడగొడదాం.. జాబ్ క్యాలెండర్, సర్కారు కొలువులను సాధించుకుందాం.