అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా చేసుకునే పండుగ దీపావళి. విజయోత్సవాన్ని దీప మాలికల ద్వారా వ్యక్తం చేయడం ఈ పండుగ ప్రత్యేకత. బలి చక్రవర్తిని శ్రీమహావిష్ణువు వామనుడై పాతాళానికి అణచివేసిన రోజు ఇదే. విక్రమార్క చక్రవర్తి పట్టాభిషిక్తుడు అయ్యింది కూడా ఈ పర్వదినం నాడే!
నరకాసురుడి సంహారాన్ని పురస్కరించుకుని ఈ పండుగ చేసుకుంటారు. భూదేవి, వరాహమూర్తి దంపతుల కుమారుడైన నరకాసురుడు అత్యంత శక్తిశాలి. ప్రాగ్జ్యోతిషపురం రాజధానిగా చేసుకొని రాజ్యపాలన చేసేవాడు. తపోశక్తితో దేవతలను హింసించాడు. ఇంద్రుడి సింహాసనాన్ని ఆక్రమించాడు. దేవమాత అయిన అదితి కర్ణ కుండలాలను లాక్కున్నాడు. వేలాది మంది స్త్రీలను చెరబట్టాడు. నరకుడి దురాగతాల గురించి ఇంద్రాది దేవతలు కృష్ణుడికి చెప్పి మొరపెట్టుకున్నారు. గోపాలుడు సత్యభామా సమేతుడై నరకాసురుణ్ని సంహరించాడు. నరకుడి పీడ వదిలినందుకు దేవతలు, మానవులు సంతోషించి దీప మాలికలు వెలిగించారు. అప్పటినుంచి దీపావళి పండుగ సంప్రదాయంగా వస్తున్నది. ఈ పండుగ సందర్భంలో కాల్చే పటాకులు నరకుడి మీద ప్రయోగించిన మారణాయుధాలకు చిహ్నాలుగా భావిస్తారు. అయితే, మనలోని అజ్ఞానాన్ని పారదోలి, జ్ఞాన సంపదను వృద్ధి చేసుకోవాలని దీపావళి సందేశమిస్తుంది. హృదయం అనే ప్రమిదలో విజ్ఞాన జ్యోతిని వెలిగించడమే దీపావళి అంతరార్థం.
దీపావళి కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పండుగ. మరికొన్ని చోట్ల ఐదు రోజుల పండుగగా చేసుకుంటారు. ఆశ్వయుజ బహుళ త్రయోదశి (ధన త్రయోదశి) మొదలు కార్తిక శుద్ధ విదియ (భ్రాత్రు విదియ) వరకు ఐదు రోజులు కొనసాగుతుంది. నరక చతుర్దశి నాడు ఆడపిల్లలు ఇంట్లో వారికి హారతులు ఇవ్వడం సంప్రదాయం. దీనివల్ల నరక బాధలు తప్పుతాయని విశ్వాసం. అమావాస్య నాడు లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. సాగర మథనంలో లక్ష్మీదేవి ఇదే రోజు ఉద్భవించిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని లక్ష్మీపూజ చేస్తారు. అమావాస్య మర్నాడు కొన్ని ప్రాంతాల్లో బలి పాడ్యమిగా చేసుకుంటారు. విదియ నాడు యమ ద్వితీయగా జరుపుకొంటాం. ఆనాడు అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్ల చేతి వంట తినాలనే నియమం ఉంది. ఏడాదికి ఒకసారైనా సోదరి ఇంటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు విచారించాలని ఈ పండుగ తెలియజేస్తుంది.
– వేదార్థం మధుసూదన శర్మ