కవి అయినవాడు గాయకుడు కాలేడు. గాయకుడు అయినవాడు కవి కాలేడు. కవీ, గాయకుడూ అయిన అదృష్టవంతుడు నూటికో.. కోటికో ఒక్కడుంటాడు. చక్కని కవిత్వం రాస్తూ, మధురమైన కంఠస్వరంతో అందరినీ పరవశింపజేస్తూ, ఆకర్షణీయమైన రీతిలో పిల్లలకు పాఠాలు బోధిస్తూ, అందరితో మన్ననలు అందుకున్న పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉన్న కవి డాక్టర్ డింగరి రామాచార్య.
డింగరి రామాచార్య 1948 జనవరి 14న కరీంనగర్ జిల్లా కోరపల్లిలో రంగాచార్యులు, గోపాల రత్నమ్మ దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచే కవిత్వం పట్ల అభిరుచి ఉన్న రామాచార్య తెలుగు, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో చక్కని పాండిత్యం సంపాదించారు. అనేక కావ్యాలు, వ్యాకరణం, అలంకారం, కావ్య శాస్ర్తాలను అధ్యయనం చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బీఓఎల్, ఎంఏ పట్టాలు పొంది, వానమామలై జగన్నాథాచార్యుల ‘రైతు రామాయణం-ఒక పరిశీలన’ అనే అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు.
బీఓఎల్ పూర్తయిన వెంటనే 1966లోనే తెలుగు భాషోపాధ్యాయునిగా ఉద్యోగం సంపాదించి, 18 ఏండ్ల వయస్సులోనే తాను చదువుకున్న వీణవంక పాఠశాలలోనే ప్రథమ నియామకం పొందారు. తనను ప్రేమతో అక్కున చేర్చుకుని, చదువు చెప్పిన గురువులే అక్కడ ఆయన సహ ఉపాధ్యాయులు కావడం విశేషం. వారి ప్రోత్సాహంతోనే ఉన్నత చదువులన్నీ చదివారు రామాచార్య.
‘మాతృమూర్తి’, ‘శ్రీమన్నాంపల్లి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతం’, ‘స్తుతిమాల’, ‘ఇల్లంతకుంట శ్రీ సీతారామ చంద్రమూర్తి మేలుకొలుపు’, ‘కొండగట్టు ఆంజనేయస్వామి సుప్రభాతం’, ‘విజయ నికేతనం’, ‘వ్యాసమంజరి’, ‘రుచిరార్ధ వ్యాకరణ దీపిక’, ‘మహామంత్రి యుగంధర’ వంటి 15 పుస్తకాలను ఆయన రచించారు.
‘ప్రజల బాగోగులం జూచు పార్థివుండు
ప్రజల బంధు దయాసింధు భాగ్యశాలి
కళల నాదరించు విభుడు కార్యశీలి
వీర రసము రూపెత్తిన విగ్రహుండు’
ప్రతాపరుద్ర చక్రవర్తి పరిపాలనా దక్షత గురించి, కార్యనిర్వహణా విజ్ఞత గురించి ఈ పద్యంలో అద్భుతంగా వర్ణించారు రామాచార్య. రామాచార్యది మధురమైన కంఠస్వరం. ఆయన సభా వేదికపై కావ్య గానం చేసినా, తరగతి గదిలో పాఠాలు చెప్పినా అందరూ మంత్రముగ్ధులై వినేవారు. ఆయన నిరంతర చైతన్య శీలి. ఎల్లప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ, అందరినీ ప్రేమగా పలకరిస్తూ కనిపించే వారాయన. తెలుగు భాషోపాధ్యాయునిగా ఉద్యోగంలో ప్రవేశించిన రామాచార్య ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకునిగా, డిగ్రీ కళాశాల అధ్యాపకునిగానే కాకుండా అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం కౌన్సిలర్ వంటి ఉన్నతమైన పదవులు నిర్వర్తించారు.
‘అదె యుగంధరుడన్న పేలదు తుపాకి
పోరునన్ పేరు విన నిద్రపోదు హాథి
ఉరిమి చూచిన మ్రోగదు మర ఫిరంగి
మంత్రి ఆజ్ఞ సుగ్రీవాజ్ఞ మహిత శక్తి’
‘మహామంత్రి యుగంధర’ కావ్యంలో యుగంధరుని శౌర్య, పరాక్రమాలను అత్యంత సుందరంగా నిర్వచించారు రామాచార్య. పద్యాలు, పాటలు, వచన కవితలు, ఆధ్యాత్మిక భజన కీర్తనలు, సుప్రభాతాలు ఒకటేమిటి ఏది రాసినా హృదయాన్ని తాకేవిధంగా రాయడం ఆయన ప్రత్యేకత. ఆయన ఎన్నో కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. వ్యాఖ్యానంలో ఆయనది ప్రత్యేకమైన శైలి. ఆయన వ్యాఖ్యానం చేస్తుంటే సభాసదులంతా పరవశించిపోయేవారు.
సారస్వత జ్యోతి మిత్రమండలి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అధికార భాషా సంఘం జిల్లా సభ్యునిగా, కరీంనగర్ సాహితీ గౌతమి కార్యదర్శిగా, కోరుట్ల భారతీ సాహిత్య సమితి కార్యవర్గ సభ్యునిగా ఎన్నో పదవులను అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించారు రామాచార్య. ఆచార్య డాక్టర్ సి.నారాయణరెడ్డి, బేతవోలు రామబ్రహ్మం, వానమామలై వరదాచార్యులు, వానమామలై జగన్నాథాచార్యులు, డాక్టర్ అందె వెంకటరాజం వంటి మహానుభావులతో కలిసి అనేక సాహిత్య కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఉద్యోగ రీత్యా అనేక ప్రాంతాల్లో పర్యటించి, చివరకు కోరుట్లలో స్థిరపడ్డారు.
హైదరాబాద్ విశ్వ సాహితీ సంగీత సాహిత్య సాంస్కృతిక పురస్కారం, సారస్వత జ్యోతి మిత్రమండలి పురస్కారం, పశ్చిమగోదావరి కళాలయ విశిష్ట పురస్కారం, తేజ ఆర్ట్స్ క్రియేషన్ సాహితీ విమర్శ విశిష్ట పురస్కారం, సమైక్య సాహితీ పురస్కారం, బూర్గుల రామకృష్ణారావు పురస్కారం, దేవులపల్లి కృష్ణశాస్త్రి స్మారక పురస్కారం, వేములవాడ దేవస్థానం వారి పురస్కారం, శాతవాహన కళోత్సవాల పురస్కారం వంటి అనేక గౌరవ పురస్కారాలు, సత్కారాలు పొందిన డాక్టర్ డింగరి రామాచార్య 2011 డిసెంబర్ 4న కీర్తిశేషులయ్యారు.