సైబర్ సాంకేతికత వచ్చిన కొత్తలో ముఖాలను మార్చడంతో మొదలైన మోసాల పరంపర సందేశాలను క్లిక్ చేస్తే ఖాతాలు ఖాళీ అవడం దాకా బహురూపుల విస్తరించింది. ఈ శాస్త్ర విజ్ఞాన వికృతి ఇప్పుడు జడలు విచ్చి అదుపు చేయలేని స్థాయికి చేరుకున్నది. ఈ తరహా సైబర్ నేరాల్లో తాజాగా డిజిటల్ అరెస్టు బెడద రోజురోజుకూ శృతి మించుతూ, ఇటు సామాన్య ప్రజలకు, అటు చట్టాన్ని అమలుచేసే యంత్రాంగానికి పెను సవాలు విసురుతున్నది. ఈ సవాలు ఊహించినదానికంటే మిన్నగా ఉన్నదని సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. హర్యానా లో సైబర్ మోసగాళ్ల వలలో వృద్ధ దంపతులు చిక్కి రూ.కోటికి పైగా నష్టపోవడంతో సుప్రీంకోర్టు ఈ బెడదను సుమోటో కేసుగా స్వీకరించిన సంగతి తెలిసిందే. డిజిటల్ అరెస్టుకు ఎక్కువగా వయోవృద్ధులు గురవుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత దాచుకున్న డబ్బులను సైబర్ జేబుదొంగలు బురిడీ కొట్టించి కాజేస్తున్నారు. తాజాగా హైదరాబాద్కు చెందిన 71 సంవత్సరాల వృద్ధుడు ఈ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.1.9 కోట్లు కోల్పోవడం సంచలనం కలిగించింది. నకిలీ కేసు, బూటకపు దర్యాప్తు పేరుతో బెదిరించి డబ్బులు కాజేయడంతో సదరు సీనియర్ సిటిజన్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సత్వరమే రంగంలోకి దిగి ముగ్గురిని అరెస్టు చేశారు కానీ, దర్యాప్తు ఎప్పుడు పూర్తవుతుందో, కోల్పోయిన సొమ్ము తిరిగివస్తుందో లేదో ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎక్కువగా విద్యాధికులే ఈ తరహా మోసాలకు గురవుతుండటం సర్కారు చేపట్టిన ప్రచారోద్యమం చేరాల్సినవారికి చేరలేదని తెలియజేస్తున్నది.
మన దేశంలో డిజిటల్ అరెస్టు బాధితులు సుమారు రూ.3,000 కోట్ల దాకా నష్టపోయారని అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి. 2022తో పోలిస్తే 2024లో ఈ మోసాల సంఖ్య మూడింతలు పెరిగింది. 2024లో ఒక్క ఏడాదిలోనే స్కామర్లు రూ.1,900 కోట్లు కాజేశారు. ఇక హైదరాబాద్లో 2024 ప్రథమార్థంలో 140 కేసులు నమోదైతే, ద్వితీయార్థంలో ఆ సంఖ్య 214కు చేరడం సమస్య తీవ్రతను తెలియజేస్తున్నది. చట్ట, న్యాయవ్యవస్థల కంటే వేగంగా కదులుతూ, తమ గుర్తింపును మరుగుపరుస్తూ, తమకు చెందిన ఖాతాల జాడను తుడిచేస్తూ సైబర్ కేటుగాళ్లు విజృంభిస్తుండటమే ప్రస్తుత పరిస్థితికి కారణం. ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థల పేరిట సైబర్ కేటుగాళ్లు అమాయకులను సైబర్ అరెస్టు భ్రమలకు గురిచేసి గందరగోళపర్చి డబ్బులు లాగేస్తున్నారు. ఇందుకు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) వంటి అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తుండటం తెలిసిందే. డిజిటల్ అరెస్టు కారణంగా పరువు మర్యాదలకు భంగం ఏర్పడుతుందనుకొని భయపడి సొమ్ములు జమచేసిన క్షణం నుంచి నేరగాళ్లు జాడలేకుండా పోతారు.
అనుభవం కలిగిన వయోవృద్ధులు, విద్యాధికులు ఈ స్కామర్ల మాయవేషాలకు బలవుతుండటానికి సైబర్ అప్రమత్తత లేకపోవడమే. హాస్యాస్పదమైన విషయం ఏమంటే అసలు దేశంలో డిజిటల్ అరెస్టు అనే చట్టపరమైన ప్రక్రియ ఏదీ లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలు పదే పదే మీడియా ముఖంగా వెల్లడిస్తున్నాయి. అయినప్పటికీ అదే సంస్థల పేరుతో డిజిటల్ అరెస్టుల తతంగం కొనసాగుతున్నది. గత ఏడాది ఈ డిజిటల్ అరెస్టులు ఎక్కువగా జరిగాయి. స్కామర్లు కాజేసిన సొమ్ములో ఎక్కువ భాగం విదేశాలకు చేరుతున్నప్పటికీ ముఠాసభ్యుల్లో భారతీయులు తప్పనిసరిగా ఉంటారు. ఈ కారణంగా సుప్రీంకోర్టు డిజిటల్ అరెస్టు స్కామర్లపై ఉక్కుపాదం మోపేందుకు సీబీఐకి పూర్తి అధికారాలను ఇవ్వడం విశేషం. ఇంటర్పోల్ ద్వారా విదేశాలకు చేరిన డబ్బును పట్టుకునేందుకు, అదే సమయంలో స్థానిక మిలాఖతుదారుల భరతం పట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అవసరమైతే మోసకారి ఖాతాలకు సంబంధించి బ్యాంకులపైనా దర్యాప్తు చేయొచ్చని తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఇలా ఆదేశించేంతవరకు ప్రభుత్వం దగ్గర గణాంకాలు తప్ప ఈ సమస్య గురించిన అవగాహన గానీ, కార్యాచరణ వ్యూహం గానీ లేకపోవడం విడ్డూరం.