సాంకేతికత, వినూత్న ఆవిష్కరణల ఊతంగా లింగ సమానత్వం సాధించాలనేది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమగ్ర లక్ష్యం. అందుకోసం Digit All-Innovation and Technology for gender equality అనే థీమ్‌ను ఐక్యరాజ్యసమితి ప్రేరణగా తీసుకుంటున్నది.
ప్రపంచం డిజిటల్‌గా విస్తరిస్తున్న కీలక దశలో ఈసారి ఎంచుకున్న థీమ్ మహిళలు సామాజికంగా ముందడుగు వేస్తూ సవాళ్లను అధిగమించేందుకు ఉపకరిస్తుందని ఒక అంచనా. Digital gender inequalitiesను పరిశీలించడంతో పాటు సాంకేతికంగా మహిళలు ధీటైన రీతిలో ఎదగడానికి ఉపయుక్తమవుతుందని అంతర్జాతీయంగా జరుగుతున్న పరిశోధనలు చెప్తున్నాయి. 2025 నాటికి డిజిటల్ సాంకేతికత విషయంలో మహిళలు, బాలికలు లింగ వివక్షను అధిగమిస్తూ ముందంజ వేస్తే అంతర్జాతీయంగా ప్రగతి ఊహించని స్థాయిలో సాధ్యమవుతుందని ఒక విశ్లేషణ. ప్రస్తుతం డిజిటల్ ప్రపంచానికి పలు కారణాల వల్ల మహిళలు, బాలికలు చేరువలో లేకపోవటంతో రానున్న మూడేండ్లలో స్థూల జాతీయోత్పత్తిలో 1.5 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని ఐరాస అంచనా.
ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమానత్వాన్ని అక్కున చేర్చుకోవాలనే థీమ్‌పై కూడా ఐరాస దృష్టిసారిస్తున్నది. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వెబ్సైట్ వెలువరించిన అభిప్రాయాల ప్రకారం లింగ అసమానతలను అధిగమిస్తూ మహిళలు ప్రామాణిక మార్పు సాధించేందుకు అనువైన పరిస్థితులు సృష్టించాలనే వాదన వెలుగుచూసింది.
ఈ భావనలు, విశ్లేషణలు ఆచరణాత్మక కార్యాచరణ అన్నీ కూడా విశ్వవ్యాప్తంగా అనేక దేశాల్లో పొడసూపిన విభిన్న ధోరణుల నేపథ్యంలో ఐరాస దృష్టికి, అలాగే ప్రపంచం దృష్టికి వచ్చాయి. ఏడాదిగా విశ్వవ్యాప్తంగా మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లు మహిళా లోకం హక్కుల కోసం ఉద్యమబాట పట్టాల్సిన పరిస్థితులను కల్పించాయి. ప్రపంచం డిజిటలైజేషన్ వైపు పురోగమిస్తున్న తరుణంలో మహిళలు లింగపరమైన అసమానతల వల్ల మగవాళ్లకు ధీటుగా సాంకేతిక అవగాహన పొందలేకపోతున్నారు. ఆర్థిక సమానత్వం సాధించేందుకు వాళ్లు ఉద్యోగరంగాల్లో అన్ని స్థాయిల్లోనూ ఆశించినస్థాయి కన్నా ఎక్కువనే విజయాలు నమోదు చేస్తున్నా సాంకేతికంగా వెనుకబడి ఉన్నారు. ఈ ఏడాది Digit All Theme ఈ దిశగా మహిళలు పురోగమించే అవకాశం ఇస్తుందని ఒక అంచనా.
యుద్ధం, హింస, విధానపరమైన మార్పుల పర్యవసానంగా తమ తమ ప్రాథమిక హక్కుల హరణ జరిగి ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్, ఉక్రెయిన్, యూఎస్ వంటి అనేక దేశాల్లో ఏడాది కాలంగా పోరాడుతున్నారు. వాళ్ల పోరాటాలు.. మహిళలు సవాళ్లను అధిగమించాల్సిన తరుణాల్లో సంఘటితమవుతారనే వాస్తవికతను ప్రపంచానికి చాటిచెప్పింది. తాలిబన్ల పునరాగమనం కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌లో బాలికలు, మహిళలు విద్యారంగంలో ఉన్నత స్థాయికి వెళ్లలేని దయనీయ స్థితి నెలకొన్నది. ప్రాథమిక హక్కుగా పరిగణించబడే ఉన్నతవిద్యకు మహిళలను, బాలికలను దూరం చేయటం వల్ల మానవ హక్కుల్లో పురోగతికి ఆటంకం కలిగింది. ఆ దేశంలో ఇంటి వెలుపల ఉద్యోగాలు చేయడం, రక్షణగా మగవాళ్లు లేకుండానే సుదూర ప్రయాణాలు చేయకుండా నిరోధించడం, మహిళలు బహిరంగంగా తమ ముఖాలను కప్పి ఉంచాలని పరిమితులు విధించడం ఇవన్నీ లింగ అసమానతలకు తార్కాణం.
ఇరాన్లో మహిళలు తమ జుట్టు ను స్కార్ఫ్‌తో కప్పుకోవాలనే కఠిన నిబంధనలను ఉల్లంఘించినందుకు 2022, సెప్టెంబర్ 13న టెహ్రాన్‌లో మోరాలిటీ పోలీసులు అరెస్టు చేసిన 22 ఏండ్ల మహిళ ‘మహసా అమిని’ మరణంతో నిరసనలు చెలరేగాయి. అప్పటినుంచి, దేశవ్యాప్తంగా అనేక మంది ఇరానీయన్లు-స్త్రీలు, పురుషులు మహిళా హక్కుల కోసం, ప్రస్తుత రాజకీయ నాయకత్వం నుంచి ఆ దిశగా మార్పును ఆకాంక్షిస్తూ భారీ నిరసన ప్రదర్శనలు నిరాటంకంగా కొనసాగిస్తున్నారు.
ఈ అవరోధాలు, సవాళ్లున్న దశలోనే మహిళలు భిన్న కోణాల్లో పురోగమిస్తున్నారు. ఏడాదిగా ఈ పురోగతి ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. 2022 నవంబర్‌లో, యూరోపియన్ పార్లమెంట్ ఆమోదించిన ఒక చట్టం 2026 జూలై నాటికి పబ్లిక్‌గా వ్యాపారం చేసే కంపెనీల బోర్డుల్లో ఎక్కువ మంది మహిళలు ప్రాతినిధ్యం వహించే హామీనిస్తున్నది. పదేండ్ల పోరాటం తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించింది. అత్యున్నత ఉద్యోగాలకు అర్హత పొందిన మహిళలు పుష్కలంగా ఉన్నారు. తమ కొత్త చట్టంతో, తాము వాటిని పొందడానికి మహిళల కు నిజమైన అవకాశం కల్పిస్తామని యూరోపియన్ యూనియన్ విస్పష్టంగా చెప్పింది.
అన్ని రంగాల్లోనూ సవాళ్లను అధిగమిస్తూ, హక్కుల సాధన కోసం ఉద్యమాలను అండగా తీసుకొని లింగవివక్షకు ధీటైన సమాధానాన్నిస్తున్న మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక ఆలంబన.
సమస్యలను అవలోకనం చేసుకొని పరిష్కారాలను అన్వేషించే ఒక మార్గదర్శి. అన్ని సమానతలకూ కేంద్ర బిందువుగా ఉండే ఆర్థిక స్వాతంత్య్రం మహిళా పురోగతికి ఒక చుక్కానిగా నిలవాలి. దేశంలోని ప్రతి మహిళ ఈ లక్ష్యసాధననే తన కర్తవ్యంగా భావించాలి.
-డాక్టర్ కడియం కావ్య
98858 56065