జనరేటివ్ ఏఐ సాధనాలు రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీడియో, ఆడియో, ఫొటోల డీప్‌ఫేక్‌లు తామరతంపరగా పుట్టుకు వస్తున్నాయి. అనేక అకృత్యాలకు టెక్నాలజీ అండగా నిలుస్తున్నది. ఈ సమస్యను నిలువరించేందుకు సాంప్రదాయిక కాపీరైట్, పరువునష్టం, వ్యక్తిత్వ-హక్కుల చట్టాలు సరిపోవడం లేదు. ఈ సమస్యను గుర్తించిన డెన్మార్క్ ప్రభుత్వం ఏఐ-ఆధారిత డీప్‌ఫేక్‌ల కట్టడికి ఓ ఏకీకృత చట్ట వ్యవస్థను రూపొందిస్తున్నది. ప్రతి పౌరుడికి తన ముఖం, శరీరం, స్వరంతో సహా వారి ఆకారంపై పూర్తి యాజమాన్యాన్ని కల్పిస్తూ కాపీరైట్ చట్టాన్ని సవరించబోతున్నది. ఒక వ్యక్తి శారీరక లక్షణాలను, అతని స్వర గుర్తింపును మేధో-ఆస్తి-శైలి హక్కులుగా పరిగణించడం, వాటికి రక్షణ కల్పించడం లక్ష్యంగా డెన్మార్క్ ప్రభుత్వం ఈ సవరణను చేపట్టింది. ‘ఏఐ ద్వారా ఎవరైనా వ్యక్తి లేదా ఏదైనా కంపెనీ అనుమతి లేకుండా ఏ వ్యక్తి పోలికను ప్రతిబింబించకూడదు లేదా లబ్ధి కోసం వాడుకోరాదు’ అని ఈ సవరణ స్పష్టం చేస్తున్నది. డిజిటల్ గుర్తింపును రక్షించి, ఏఐ రంగాన్ని నియంత్రించే విషయంలో డెన్మార్క్ చట్టం ఒక మూలమలుపుగా నిలుస్తుంది.
మన దేశంలో కొన్నాళ్ల క్రితం వెలుగుచూసిన రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోతో ఈ సమస్యపై అందరి దృష్టి మళ్లింది. దీంతో తమ రూపాన్ని గాని, స్వరాన్ని గాని తమకు తెలియకుండా ఎవరూ వినియోగించకుండా ఉండేందుకు సినీ ప్రముఖులు, తారలు, సంగీతకారులు కోర్టుల నుంచి రక్షణ పొందుతున్నారు. బాలీవుడ్ ప్రముఖుల వ్యక్తిత్వ హక్కులను అనధికారికంగా వాణిజ్య అవసరాలకు వాడుకోవడాన్ని నిరోధించేందుకు ఢిల్లీ హైకోర్టు ఇటీవల వరుస ఉత్తర్వులు జారీచేసింది. గత సెప్టెంబర్‌లో నటులు ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌లకు జస్టిస్ తేజస్ కరియా ఉపశమనం కల్పించారు. ఏఐ- జనరేటెడ్ కంటెంట్, వస్తువుల ద్వారా వారి చిత్రాలు, స్వరాలను దుర్వినియోగం చేయకూడదని నొక్కిచెప్పారు. నటులు అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ ఇప్పటికే అలాంటి రక్షణలను పొందారు. తాజా పిటిషన్ల పరంపర డిజిటల్ యుగంలో వ్యక్తిత్వ హక్కులకు న్యాయపరమైన గుర్తింపు కోసం పెరుగుతున్న ఒత్తిడిని సూచిస్తున్నది.
డీప్‌ఫేక్‌ల నుంచి రక్షణ అనే మాటవరకు వస్తే మన దేశంలో ఏకీకృత చట్టం అనేది లేదు. ఇందుకు సంబంధించిన నిబంధనలు ఒకే చట్టంలో క్రోడీకరించబడి లేవు. గోప్యత, పరువునష్టం, ప్రచార హక్కుల వంటి చట్టాల ఆధారంగా కోర్టులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వ్యక్తుల స్వరూపం, స్వరం లేదా శరీరం డిజిటల్ అనుకరణలను అనుమతి లేకుండా ఉపయోగిస్తే కఠినమైన చర్యలు తీసుకునే వ్యవస్థ అమల్లో ఉంటే వెబ్ కంపెనీలు ఒళ్లు దగ్గర పెట్టుకుంటాయి. డీప్‌ఫేక్‌కు గురైన వ్యక్తికి పరిహారం కల్పించే ఏర్పాటు కూడా ఉండాలి. అప్పుడే ఈ బెడదను అరికట్టవచ్చు. వ్యక్తిత్వ హక్కుల రక్షణకు విడివిడి చట్టాలను ఉపయోగించాల్సిన అగత్యం లేకుండా ఉండాలంటే డెన్మార్క్ తరహాలో ఒక సమగ్ర చట్టం రూపొందించడం ఎంతైనా అవసరం.