రెండున్నరేండ్ల రేవంత్‌రెడ్డి పాలనలో కూల్చివేతలే తెలంగాణ బ్రాండ్‌గా మారిపోయాయి. చివరకు ఈ కూల్చివేతలపై కేరళ సీఎం కూడా స్పందించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు నిర్మాణాలు తెలంగాణ బ్రాండ్‌గా మారితే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నరేండ్లుగా కూల్చివేతలు తప్ప ఘనంగా చెప్పుకోవడానికి ఏమీ లేవు. తెలంగాణలో కూల్చివేతల విధ్వంస పాలన జరుగుతుంటే ఇదంతా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టికి వెళ్లడంలేదా? కాంగ్రెస్ అధికారంలో ఉన్నదే మూడు రాష్ర్టాల్లో.
ఈ రాష్ర్టాల్లోనూ పాలన ఇంత అధ్వానంగా ఉంటే పట్టించుకొనే తీరికలేదా? సీఎం రేవంత్‌రెడ్డి నోరు తెరిస్తే బూతులు, కూల్చివేతలు. ఇంతకు మించి మరో పని లేదు. దేశంలో మొహబ్బత్ కీ దుకాన్లు తెరుస్తున్నామని ప్రచారం చేసుకున్న రాహుల్ తెలంగాణలో తెరువలేదా? తెరిస్తే మూసేశారా? కూల్చివేతల దుఖాన్లు తెరుచుకొనేందుకు రేవంత్‌రెడ్డికి అనుమతి ఇచ్చారా?
తెలంగాణలో పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూలుస్తుంటే కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు? ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌కు కనిపించడం లేదా? మీకు అండగా నేను ఉన్నాను, మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను అని ఎన్నికల సమయంలో ప్రకటించిన రాహుల్ మళ్లీ ఎన్నికల ప్రచారానికే తెలంగాణ ప్రజల ముందుకు వస్తారా? పచ్చని తెలంగాణలో కూల్చివేతలు, పేదల కన్నీళ్లు, ఇవే ప్రతి రోజు వార్తలు. దశాబ్దాల భూదాన్ భూముల్లో ఇండ్లు కట్టుకొని నివసిస్తున్న వందలాది మంది ఇండ్లను కూల్చివేశారు, రోడ్డు పాలు చేశారు.
ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇండ్లను కూల్చి పేద ప్రజలను ఇంట్లో నుంచి బయటకు లాగి పడేస్తుంటే వారి కన్నీళ్లు చూసి ఓ పోలీసు అధికారి గుండె కరిగి కన్నీళ్లు పెట్టాడు. ఇదంతా ప్రభుత్వం చూడకుండా వికటాట్టహాసం చేస్తున్నది. పేదలు హాహాకారాలు చేస్తుంటే తాను శాడిస్టులా.. ఇలాంటివి చూస్తుంటే తనకు శాడిస్టిక్ తృప్తి ఉంటుంది అని ముఖ్యమంత్రి ప్రకటించుకోవడం దురదృష్టకరం. రేవంత్‌రెడ్డి పనులకు తెలంగాణ కాంగ్రెస్ కన్నా ఆంధ్ర టీడీపీ నుంచి మద్దతు లభిస్తున్నది. చంద్రబాబు వర్గం రేవంత్‌రెడ్డిని మోస్తున్నది.
టీడీపీ నాయకులు ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జీర్ణం చేసుకోలేక పోతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, పదేండ్ల పాటు సాధించిన అభివృద్ధి వారికి కంటగింపుగా మారింది. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన రోజును తెలంగాణ ప్రజలు పండుగ రోజుగా భావిస్తుంటే టీడీపీ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఆ రోజును బ్లాక్ డే అని లోక్‌సభలో అక్కసు వెళ్లగక్కారు.
ఇంకా నయం ఆ రోజును బ్లాక్ డే పాటించాలి అని తెలంగాణ ప్రభుత్వాన్ని టీడీపీ నాయకత్వం ఆదేశించలేదు. ఆదేశించినా, ఆ ఆదేశాలను రేవంత్‌రెడ్డి శిరసా వహించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. యూపీఏ ప్రభుత్వం నిండు సభలో ఆంధ్రకు ప్రత్యేక హోదా ప్రకటించింది. పన్నెండేండ్లు అవుతున్నా ఆంధ్రా నేతలు ప్రత్యేక హోదా సాధించుకోలేక పోతున్నారు, కనీసం అడిగే ధైర్యం చేయలేక పోతున్నారు. కానీ తెలంగాణపై పడి ఏడుస్తున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేండ్ల నుంచి అన్నీ కూల్చివేతలే. నిర్మాణాలు ఏవీ లేవు? కానీ ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని నిర్మిస్తా, ఎవరు అడ్డు వస్తారో చూస్తా అని రేవంత్‌రెడ్డి అంటున్నారు. మూసీ సుందరీకరణ పేరుతో, మహాత్మా గాంధీ విగ్రహం ఏర్పాటు పేరుతో ఇండ్లను కూల్చివేయడమే మహత్కార్యంగా భావిస్తున్నారు. గాంధీ విగ్రహం కోసం అపార్ట్‌మెంట్‌ను కూల్చివేసి ఐదు వందల కుటుంబాలను రోడ్డు పాలు చేయడానికి పూనుకున్నారు.
అపార్ట్మెంట్ వాసుల నుంచి వ్యతిరేకత రావడంతో పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ను జీరో విలువగా సీఎం ప్రకటించారు. తాను శాడిస్ట్నని ఆయనే చెప్పుకున్నట్టుగా ఇలాంటి చర్యల ద్వారా శాడిస్టిక్ సంతోషాన్ని పొందుతున్నారు. ఇల్లు అంటే కేవలం నీడ మాత్రమే కాదు, మధ్యతరగతి వారికి పెద్ద అండ. పిల్లల చదువులకు బ్యాంకులో తనఖా పెట్టవచ్చు అనే భరోసా. పిల్లల పెండ్లిళ్లకు కావచ్చు, ఇతర అత్యవసరాలకు డబ్బులు సమకూర్చుకొనే ధైర్యం. అలాంటి భరోసా ఇచ్చే ఇంటి విలువను జీరోగా మార్చి తన మాట వినక పోతే ఇంతే అనే శాడిస్టిక్ తత్వం రేవంత్‌రెడ్డిలో కనిపిస్తున్నది. బతుకు పోరాటం చేసే సామాన్యులు, మధ్యతరగతి వాళ్లు ఏం చేయగలరు? ఇంత పెద్ద వ్యవస్థ తన చేతిలో ఉండే పాలకుడు సామాన్యుడిపై కక్ష తీర్చుకుంటున్నాడు అంటేనే అది పాలకుడి పరాజయం.
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌కు ఇంధనం సమకూర్చే రాష్ర్టాలు రెండే రెండు. తెలంగాణ, కర్నాటక. పార్టీని నడిపించే ఇంధనం కోసం తెలంగాణను కాంగ్రెస్ హైకమాండ్ తాకట్టు పెడుతుందేమో కానీ తెలంగాణకు చైతన్యం, పోరాటం కొత్తేమీ కాదు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. తెలంగాణలో అమానవీయ పాలనను హస్తినలో కూర్చుండి చోద్యం చూసినట్టు చూస్తున్న కాంగ్రెస్ పెద్దలు మొహబ్బత్ కీ దుకాన్ నీతులు చెప్తున్నారు. ఢిల్లీ బాద్షాలకు, తెలంగాణలోని వారి బానిసలకు చైతన్యశీలురైన ప్రజలు తగిన గుణపాఠం చెప్పి తీరుతారు.
-బుద్దా మురళి