ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును నిర్భయంగా వినియోగించుకొన్నప్పుడే ప్రజాస్వామ్యం బలోపేతమవుతుంది. ఓటు హక్కు పవిత్రమైనది, పరిపాలన విధానానికి ఆయుధం లాంటిది. అందుకే ఎలాంటి ప్రలోభాలకు తలవంచకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి దిక్సూచి అయిన ఓటును వినియోగించుకోవటం ప్రజల ప్రధాన కర్తవ్యం. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది.
నిజమైన ప్రజాస్వామ్యానికి పునాది ఓటు. అందుకే ఎవరూ ఓటు అనే విలువైన ఆయుధాన్ని నోటుకు అమ్ముకోవద్దు. మనం వేసే ఓటుతోనే నవసమాజ నిర్మాణం సాధ్యమవుతున్నది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువైన వజ్రాయుధం. ‘ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల కొరకు పనిచేస్తూ , ప్రజలే పాలకులుగా గల పాలన విధానమే ప్రజాస్వామ్యం’. మనది సర్వస్వతంత్ర భారతదేశం. ‘లౌకిక, సామ్యవాద, సర్వసత్తాక, ప్రజాస్వామిక’ దేశమని మన రాజ్యాంగంలో మనమే చెప్పుకున్నాం. స్వేచ్ఛా సమానత్వం మన దేశ ఆదర్శం. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ సమానమని, అందరికీ సమానమైన స్వేచ్ఛ, హక్కులు ఉండాలని రాజ్యాంగంలో రాసుకున్నాం. వ్యక్తులు లేనిదే సమాజం లేదు. సమాజంలో అంతర్భాగం కాకుండా ఏ వ్యక్తీ విడిగా మనుగడ సాగించనూలేడు. అందుకే ‘అందరి కోసం ఒక్కడు నిలిచి, ఒక్కని కోసం అందరు కలిసి, ప్రజాస్వామ్య మనుగడను కాపాడుకోవాలంటే ఓటు హక్కు ఒక్కటే మార్గం.
ఓటుహక్కు దేశ చరిత్రనే మార్చేయగల ప్రజాస్వామ్య ఆయుధం. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 ఏండ్లు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ప్రకారం ఓటు హక్కు కల్పిస్తున్నది. తద్వారా సమర్థులైన పాలకులను ఎన్నుకునే అవకాశాన్ని కల్పించింది. అందుకే ఓటును దుర్వినియోగం చేయకుండా దానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సరైన నాయకున్ని ఎన్నుకున్నప్పుడే దానికి సార్థకత.
సమాజంలో ప్రతి పౌరుడికి ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదే. ఎన్నికల్లో తమకు నచ్చిన అవినీతి రహిత పాలన అందించే సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే హక్కు ఈ ఓటు ద్వారానే సాధ్యపడుతుంది. ప్రజాస్వామ్య విలువలున్న సమాజమే ప్రజా సంక్షేమానికి నాంది పలుకగలదు. పౌరుడి అస్తిత్వానికి ప్రతీక. ప్రపంచ స్థితి, గతులను మార్చే శక్తి ఓటుకు ఉన్నది. ఒక వ్యవస్థకు ప్రజా ప్రతినిధి ఎంత అవసరమో, ఆ ప్రజా ప్రతినిధిని ఎన్నుకునేందుకు ఓటు అంతే అవసరం. కానీ చాలామంది ఓటును కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి. మనం బాగుపడాలి అనే తాపత్రయం ఉండడమే కాదు ఓటూ ముఖ్యమే. అందుకే భారత ప్రజాస్వామ్య పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యంగా ఓటు వేయాలి.
భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. 1907లో ఏర్పడిన రాయల్ కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుపై చేసిన సిఫారసుల ఆధారంగా 1909 కౌన్సిల్ చట్టం ప్రాతిపదికన భారతీయులకు ఓటు హక్కు కల్పించారు. 1919 కౌన్సిల్ చట్టం ఈ హక్కును కొంతమేర విస్తృత పరిచింది. 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా ఈ హక్కును 10.6 శాతం పౌరులకు కల్పించారు. రాజ్యాంగ పరిషత్, ఎన్నికల సందర్భంగా 28.5శాతం ప్రజలకు దీన్ని విస్తరింపచేశారు. ప్రజాస్వామ్య విధానానికి కట్టుబడి ఉండేలా రాజ్యాంగం భారత పౌరులకు సార్వత్రిక వయోజన ఓటు హక్కును కల్పించింది. ప్రజాస్వామ్యంలో సమానత్వ సూత్రాన్ని అనుసరించి 325 అధికరణం ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉంటుంది.
కుల, మత, వర్గ, వర్ణ, జాతి, ప్రాంతం, లింగ భేదాలు వంటి తేడాలతో ఏ ఒక్క వ్యక్తికి ఓటు హక్కు నిరాకరించకూడదంటూ నిబంధనలు జారీ చేసింది. 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి కేంద్ర ప్రభుత్వం ఓటు హక్కు వయో పరిమితిని 21ఏండ్ల నుంచి 18ఏండ్లకు తగ్గించి అత్యంత ప్రాధాన్యం కలిగిన హక్కుగా ప్రాముఖ్యతను చేకూర్చింది. ప్రస్తుతం దేశంలో ఓట్లు వేయడం కేవలం ఎన్నికల ప్రక్రియగా, రాజకీయ తంతుగా భావిస్తున్నారు. రాజకీయ నాయకులు నోటు అనే తాయిలాన్ని ప్రజలకు పంచి ఓటును బలహీనపరిచి గెలుపును పటిష్టం చేసుకుంటున్నారు. మనమంతా నోటు తీసుకుని ఓటు వేస్తే నాయకులను ప్రశ్నించే హక్కుని కోల్పోతాము. గెలిచిన నాయకుడు డబ్బుకు అమ్ముడుపోయి అవినీతి, కుళ్లు రాజకీయాలతో ప్రజలను తప్పుడు దారిలోకి తీసుకొనిపోతున్నాడు.
భారతదేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా, సాంఘిక, ఆర్థిక, సమానత్వాన్ని సాధించాలన్నా, మన జీవితాలు, తల రాతలు మారాలన్న అది పారదర్శకమైన ఎన్నికలు, నిజాయితీపరులైన నాయకుల వల్లనే సాధ్యం. మనం వేసే ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడను నిర్ణయించేది ఓటే. రాజకీయ నాయకుల తల రాతల్ని మార్చే ఆయుధం ఓటు. అందరూ ఓటు వేసినపుడే, రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థకత లభిస్తుంది. దేశ దిశ, దశను ఓటు మారుస్తుంది. మనం ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదు. ఓటు వేద్దాం
– మన ప్రాంత, పురోభివృద్ధికి మంచి నేతను ఎన్నుకొని బంగారు బాటలు వేద్దాం. మనం వేసే ఓటే మన భవిష్యత్తు, రాబోయే తరాల మనుగడను నిర్ణయించేది ఓటే. రాజకీయ నాయకుల తల రాతల్ని మార్చే ఆయుధం ఓటు. అందరూ ఓటు వేసినపుడే, రాజ్యాంగం కల్పించిన హక్కుకు సార్థకత లభిస్తుంది. దేశ దిశ, దశను ఓటు మారుస్తుంది. మనం ఓటువేసేది బంగారు భవిష్యత్తు కోసమే అనే విషయం మరచిపోకూడదు.
తీగల అశోక్ కుమార్: 79891 14086