దేశవ్యాప్తంగా కులగణన కోసం డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో బీసీలు రాజకీయాల్లో సముచిత భాగస్వామ్యం కోసం గొంతెత్తుతున్నారు. కాగా, తెలంగాణ బీసీల్లోనూ ఆ దిశగా చైత న్యం కనపడుతుండటం శుభపరిణామం. అయితే, తెలంగాణ సర్కార్ చేట్టిన కులగణనలోని లోపాల పట్ల బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే తప్పుల తడక అని తేలడంతో అధికార పార్టీలోనే ఈ కులగణన పెద్ద చిచ్చు రేపుతున్నది.
దేశ జనాభాలో 60 శాతం పైగా ఉన్న బీసీలు చట్టసభల్లో ఆ నిష్పత్తి ప్రకారం ఎందుకు అడుగుపెట్టడం లేదనే మౌలిక ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. రాజ్యాధికారంలో ఎందుకు భాగస్వాములు కాలేకపోతున్నారనే చర్చ తీవ్రమైంది. ‘మేమెంతో మాకంత వాటా’ అనే నినాదం రోజురోజుకు బలపడుతున్నది. దేశంలో మా లెక్కలు తీయండని న్యాయబద్ధమైన కోరికను స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి బీసీ కులాలు అడుగుతూనే ఉన్నారు.
వివిధ రూపాల్లో నిరసనలు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కానీ, పాలకులు మాత్రం ఇప్పటివరకు కులగణన చేయడం లేదు. జనాభా నిష్పత్తి ప్రకారం విద్య, ఉద్యోగం, ఆర్థిక, రాజకీయ రంగాలతో పాటు చట్ట సభల్లో అన్యాయం జరుగుతూనే ఉన్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్ద కాలంలో బీసీలలో రాజకీయ చైతన్యం పెరిగింది. రాజకీయాల్లో వారు తమ స్థానాన్ని గుర్తించుకునే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రక్రియలో బీసీ నేతలు పోటీకి ముందుకురావడం, అధిక ఓట్లు సాధించడం వంటి పరిణామాలు గమనించవచ్చు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీసీలకు అనుకూలంగా వ్యవహరించినట్టు కాంగ్రెస్ నటించినా, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు తక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు స్పష్టమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీలు రానున్న ఎన్నికల్లో కీలకమైన శక్తిగా మారుతారా? వారి రాజకీయ చైతన్యానికి అనుగుణంగా మరిన్ని రాజకీయ అవకాశాలు లభిస్తాయా? అనేది వేచి చూడాల్సిన అంశం.
– లక్కరసు ప్రభాకర్ వర్మ,అధ్యక్షులు, రాష్ట్ర పెరిక సంఘం