నీట్ పేపర్ లీక్‌కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఢిల్లీలో యువత సాగిస్తున్న ఆందోళనలపై పోలీసులు విరుచుకుపడి లాఠీచార్జి చేశారు. దీనికి సంబంధించి యూట్యూబ్ చానల్స్ చూస్తుంటే జంతర్ మంతర్ వద్ద 20 ఏండ్ల యువతి ఒక్క నిమిషం మాట్లాడిన మాటలు వింటే మనం ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నామా? అనిపించింది. కన్నీళ్లు ఉబికి వస్తుండడంతో ఆ యువతి మాటలు అస్పష్టంగా వచ్చాయి. ‘పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాను. ఈ రోజు వీళ్లను పోలీసులు కొట్టడాన్ని చూశాక..నా నిర్ణయాన్ని మార్చుకున్నాను. నేను పోలీసునై ఉంటే వీళ్లలాగానే కొట్టాలి కదా? వీళ్లు చేసిన పాపం ఏమిటి? నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహించాలని కోరడమే పాపమా? అంతలా లాఠీలతో కొడతారా? అంటూ ఆ యువతి కన్నీళ్లు పెట్టుకున్నది. నీట్ పేపర్ పదే పదే లీకవుతున్నా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా? ప్రశ్నిస్తే నేరమా?
ఇందిరాగాంధీ హయాంలో విధించిన ‘ఎమర్జెన్సీ’ గురించి పదే పదే ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రంలోని బీజేపీ పాలకులు అంతకుమించిన నియంతృత్వంతో వ్యవహరిస్తున్నారు. ప్రజలకు పూచికపుల్ల కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదని భావిస్తున్నారు. మనకు ఏదైతే అందుబాటులో ఉంటుందో దాని విలువ మనకు తెలియదు. స్వేచ్ఛ కోల్పోయే వరకు స్వేచ్ఛ విలువ తెలియదు. దేశంలోని పలు రాష్ర్టాల్లో పరిస్థితులు చూస్తుంటే మెల్లగా నియంతృత్వానికి స్వాగతం పలుకుతున్నామని అనిపిస్తున్నది. నీట్ పేపర్ లీక్‌ను తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా పాలకులకు పట్టడం లేదు. ఢిల్లీలో యువత మూడు వారాల నుంచి ఆందోళన చేస్తుంటే లాఠీఛార్జితోపాటు టియర్ గ్యాస్‌తో తీవ్రంగా హింసిస్తున్నారు. కానీ కోట్ల రూపాయల కుంభకోణం నీట్ లీకేజీకి బాధ్యత ఎవరూ తీసుకోవడం లేదు.
నీట్ పేపర్ లీకేజీ మొదటిసారి కాదు..ఇదొక ఆనవాయితీగా మారింది. ఇందులో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన నీట్ పేపర్ లీకేజీ ఆగిపోతుందని కాదు. కానీ లీకేజీకి అమాత్యవర్యులు బాధ్యత వహించాలి కదా!.
దేశంలో మోదీ ఏకస్వామ్య పాలన సాగిస్తుంటే ఉభయ తెలుగు రాష్ర్టాల్లో పాలకులు అదే మార్గంలో వెళ్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నీటిని వాడుకోవాలి, రైతులను ఆదుకోవాలి అని రిటైర్డ్ ఇంజినీర్లు చెప్పడమే పాపం.. వారిని జైలు పాల్జేస్తాను, బెల్ట్ చికిత్స చేస్తాను అని స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అంటున్నారు. ఇలాంటి నియంతృత్వ వ్యాఖ్యలు గతంలో ఏ పాలకుడి నోటి నుంచి వినలేదు. తెలంగాణ సీఎంలా నోటిదురుసు ఆంధ్రా సీఎం చంద్రబాబుకు అస్సలు లేదు. కానీ మాట్లాడకుండానే ఆయన నియంతృత్వాన్ని అమలుచేస్తారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలనే ఒక యూట్యూబర్ ఇమిటేట్ చేస్తూ మాట్లాడగా అతనిపై వందల్లో కేసులు పెట్టారు. నాలుగుసార్లు బెయిల్ లభిస్తే ఐదవసారి ఉప కేసు పెట్టి మళ్లీ అరెస్ట్ చేశారు. మీడియా పార్టీల వారిగా బాధ్యతలు నిర్వహిస్తుంటే..యూట్యూబ్ చానల్స్‌తో పాలకులకు కంటగింపుగా మారింది. దానితో యూట్యూబ్ వారిని అరెస్టులు చేయిస్తూ అసంతృప్తి స్వరాలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణి చూసి రాష్ర్టాలు సైతం అదే మార్గంలో పయనిస్తున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు బాధ్యత వహించాలి. కానీ మనం క్రమంగా నియంతృత్వానికి స్వాగతం పలుకుతున్నామని అనిపిస్తున్నది. ఒకసారి అధికారంలోకి వచ్చామంటే ఇక తాము ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగా కొందరు పాలకులు వ్యవహరిస్తున్నారు.
నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలో యువత ఉద్యమిస్తుంటే ‘చైనా కుట్ర’ అని ప్రచారం చేసే స్థాయికి నాయకులు చేరారంటే నీట్ పేపర్ లీక్ చేసింది చైనానా? చైనా లీక్ చేస్తుంటే మన వ్యవస్థలు ఏం చేస్తున్నట్టు? ఎవరైనా ప్రభుత్వాన్ని తప్పుపడితే పాకిస్థాన్ ఏజెంట్ అంటున్నారు. ఉద్యమిస్తే చైనా కుట్రనట. రైలు ప్రమాదం జరిగితే పాకిస్థాన్ కుట్ర అంటూ వెంటనే ప్రచారం చేస్తారు. ఒకవేళ నిజంగానే పాకిస్థాన్ మన రైళ్లను ప్రమాదాలపాలు చేసి ఎంతోమంది ప్రాణాలు తీస్తే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? గతంలో రైలు ప్రమాదాలు జరిగితే రైల్వే మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపించేది. ప్రభుత్వ ప్రతిష్ఠ దెబ్బతినేది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఇలాంటి వైఫల్యాలను కూడా పాకిస్థాన్ కుట్ర పేరుతో తనకు అనుకూలంగా మార్చుకుంటున్నది. పారిశ్రామిక అభివృద్ధి, నిరుద్యోగ నిర్మూలన, జీడీపీ వృద్ధి వంటి అంశాలను వదిలేసి, మతం ఆధారంగా మళ్లీ మళ్లీ అధికారం హస్తగతం చేసుకోవాలనేది బీజేపీ వ్యూహం. కానీ దేశంలో వినిపిస్తున్న యువత అసంతృప్తి స్వరాలు వింటుంటే రాజకీయాల్లో మార్పు సాధ్యమేమో అనిపిస్తున్నది. ఈ ఏడాది మే 15న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ‘నిరుద్యోగ బొద్దింకలు’ కామెంట్ యువతలో కదలిక తీసుకువచ్చింది.
‘కాక్రోచ్ జనతా పార్టీ’ దేశంలోని అసంతృప్తి స్వరాలకు కేంద్రంగా మారింది. ఈ పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, ఎన్నికల్లో పోటీ చేయదు, కానీ అధికారపక్షం అవకతవకలను జనంలోకి తీసుకువెళ్లడంలో, ప్రజల్లో చర్చను లేవనెత్తడంలో విజయం సాధించింది. ‘నేను నియంతను’ అని చెప్పకుండానే నియంతలా వ్యవహరిస్తున్న మోదీ ప్రభుత్వానికి ఈ పార్టీ కంటగింపుగా మారింది.
ప్రజాస్వామ్యాన్ని అమితంగా ప్రేమించిన నెహ్రూ కన్నా ఎక్కువ కాలం అధికారంలో మోదీ ఉన్నారని ఇటీవల గర్వంగా ప్రచారం చేసుకున్నారు. సంవత్సరాల లెక్క ప్రకారం ఎక్కువకాలం నిజమే. కానీ విలువల విషయంలోనూ పోలిక ఉండాలి కదా? నెహ్రూ తన మీద కార్టూన్లు వేస్తే కార్టూనిస్ట్‌కు ఫోన్ చేసి అభినందించేవారు. తన పాపులారిటీ రోజురోజుకూ పెరిగిపోతుండడంతో నియంతగా మారుతానేమోనని ఆయనకే అనుమానం వచ్చి తన ప్రభుత్వాన్నే తీవ్రంగా విమర్శిస్తూ మారుపేరుతో తానే వ్యాసాలు రాసుకున్నారు. అలాంటి నెహ్రూ కంటే ఎక్కువ కాలం అధికారంలో ఉన్న మోదీ మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలకు ‘నేను సమాధానం చెప్పడం ఏమిటి?’ అన్నట్టు అధికారంలోకి వచ్చి 13 ఏండ్లు అవుతున్నా ఒక్కసారి కూడా మీడియా సమావేశంలో మాట్లాడలేదు. ‘మౌనముని’ అని మీడియా ఎగతాళి చేసినా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం తరచూ మీడియా సమావేశాలు నిర్వహించి, వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేవారు.
ప్రజాస్వామ్య దేశాల పాలకులు మీడియా వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తారు. ఉత్తర కొరియా అధ్యక్షుడు, నియంత కిమ్ జాంగ్ ఉన్ 2019లో హనాయ్ సమ్మిట్‌లో విదేశీ జర్నలిస్టుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. కానీ మోదీ పాలనలో మన దేశ మీడియాకు అంతటి అదృష్టం కూడా లేదు. ఢిల్లీలో జరుగుతున్న యువత ఉద్యమం పాలకుల్లో తప్పకుండా కదలిక తీసుకువస్తుంది. నాయకులు వస్తుంటారు, పోతుంటారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యం శాశ్వతం అని యువత నిరూపిస్తుంది.