దేశంలో శతాబ్దాలుగా సామాజిక అణిచివేతకు గురైన దళితులు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా రాజ్యాంగపరమైన రక్షణను పూర్తిస్థాయిలో పొందలేకపోతున్నారు. ఈ దేశ మూలవాసులైన దళితులకు అన్నిరంగాల్లోనూ తీరని అన్యాయం జరుగుతున్నదని దళిత సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. స్వాతంత్య్రానంతరం మహనీయుడు అంబేద్కర్ కృషికి తోడు, ఆయన ఆలోచన విధానానికి కొనసాగింపుగా వివిధ దళిత సంఘాలు దళిత సమాజంలో కొంత చైతన్యాన్ని తీసుకురాగలిగినా, వివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలు నేటికీ సమాజంలో కొనసాగుతుండటం బాధాకరం.
దళితులు అట్టడుగు సమూహంగా తమ వెనుకబాటుతనాన్ని జయించడం కోసం ఇంకా పోరాడుతూనే ఉన్నారు. దాడులు, మహిళలపై లైంగిక వేధింపులు దేశంలో ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో పంచమజాతి వారు అనే పేరుతో కుల ఆధారిత వివక్షను అనుభవిస్తూ, శారీరక హింసతోపాటు, సామాజిక వెలివేతకు గురై ఎన్నో దురాగతాలను కూడా ఎదుర్కొంటున్నారు.
దళితులకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తోడ్పాటును అందించడానికి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లను కల్పించారు. ఉమ్మడిగా రిజర్వేషన్ అమలు విధానం వల్ల ఎస్సీల్లోని అత్యంత వెనుకబాటు తనానికి గురైన అత్యల్ప సంఖ్యాక ఉప కులాలు మాదిగల పోరాట విజయంతో ఉమ్మడి రిజర్వేషన్ల విధానానికి స్వస్తి పలికి ఎవరికి వారుగా అభివృద్ధి పథం వైపు (కులాల వారీగా జనాభా దామాషా ప్రకారం వచ్చిన రిజర్వేషన్ వాటాతో) పయనించడానికి వర్గీకరణ ఎంతో మేలు చేకూర్చుతుంది.
రాజ్యాంగం అమల్లోకి వచ్చి సుమారు ఎనిమిది దశాబ్దాలు కావస్తున్నా అప్పటి జనాభాకు అనుగుణంగా దళితులకు రా జ్యాంగబద్ధంగా కల్పించిన 15% రిజర్వేషన్లు మాత్రమే ఇప్పటికే కొనసాగించడాన్ని ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్లను 20 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ, మరో మానవత్వ ఉద్యమానికి దళిత సంఘాలు సమాయత్తమవడం మనుగడ కోసం పోరాటంగానే చూడాలి. ఒక సమూహాన్ని అనేక తరాలుగా విద్యకు దూరంగా ఉంచడం అంటే సమాజంలో మనుషులుగా బతికే హక్కును దూరం చేయడమే. ఇలాంటి వ్యవస్థలో దళితుల దయనీయ స్థితిని, వెనుకబాటుతనాన్ని అధిగమించడానికి దళితులు చదువు వైపు పయనిస్తూ, రిజర్వేషన్లను ఆసరాగా చేసుకొని తమను తాము మనుషులుగా సంస్కరించుకునే పనిలో పడ్డారని గ్రహించాలి.
ఈ తరుణంలో ‘మేమెంతో మాకు అంత వాటా’ అనే నినాదంతో దళిత సంఘాలు, మరీ ముఖ్యంగా చదువుకున్న దళిత యువత ఉద్యమబాట పట్టాలనుకోవడం పాలకులు ‘అధికారం’ అనే అద్దంలో నుంచి కాకుండా, ‘మానవత్వం’ అనే కోణంలో చూడాలి. నిశ్శబ్దంలో నుంచి నిప్పుకణికలు పుట్టేలా.. మలిదశ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దళిత యువత రిజర్వేషన్ల పెంపు కోసం మరో మానవత్వ యుద్ధానికి సిద్ధపడటం హర్షించదగ్గ పరిణామం.
తెలంగాణ వ్యాప్తంగా సభలు, సమావేశలు, రథయాత్రలకు కూడా ప్రణాళికలకు రచిస్తూ, కార్య సాధనకు కదనరంగాన తమ జాతిని నిలుపడానికి పలు దళిత సంఘాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కులాలవారీగా జనాభాను సమాయత్తం చేయడానికి అంబేద్కర్ జయంతిని ఎంచుకోవడం, అది రాష్ట్రంలో మరో మానవత్వ ఉద్యమానికి నాంది పలికే రోజు కావడం అనివార్యంగా కనిపిస్తున్నది.
ఉమ్మడి రిజర్వేషన్ల పెంపు కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధపడటమా? లేదా ఎవరి వేదికల ద్వారా వాళ్లు ముందుకు వెళ్లడమా? అనే విషయంపై నిర్దిష్ట నిర్ణయానికి వచ్చిన తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటించాలని దళిత సంఘాల ప్రతినిధులు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తున్నది.
రాజ్యాంగంలోని కొన్ని నిబంధనల ఆధారంగా వివక్ష, కులవృత్తుల నేపథ్యంలో సామాజిక వెనుకబాటుకు గురైన కులాలు లేదా సమూహాలకు రిజర్వేషన్ కల్పించారు.
రిజర్వేషన్లు స్వాతంత్య్రం రాక ముందే కుల వ్యవస్థలో అంటరాని బతుకుల వల్ల ఏర్పడ్డ తమ వెనుకబాటును పోగొట్టుకోవడం కోసం వివిధ వర్గాల నుంచి డిమాండ్లు రావడంతో 1881-1891 మధ్య కాలంలో కొల్హాపూర్ సంస్థానంలో అప్పటి పాలక రాజు ఛత్రపతి సాహూజీ మహారాజ్ దేశంలో మొదటిసారి రిజర్వేషన్ల ప్రక్రియ మొదలుపెట్టి 1902లో అమల్లోకి తీసుకువచ్చారు. అంతే తప్ప ఈ రిజర్వేషన్లు ఇప్పటికిప్పుడు ప్రత్యేకంగా ఎవరో కల్పిస్తున్న ప్రత్యేక వసతులు ఏమీ కావు.
తమిళనాడులో మొత్తం 69 శాతం రిజర్వేషన్ అమలులో ఉండగా, అందులో దళితులకు 18 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. దీనిని 1994 నాటి 76వ రాజ్యాంగ సవరణ ద్వారా అమల్లోకి తెచ్చారు. కర్నాటకలో మొత్తం 56 శాతం రిజర్వేషన్ అమలవుతుండగా, ఎస్సీలకు 17 శాతం రిజర్వేషన్ అందజేస్తున్నారు.
పంజాబ్లో ఎస్సీలకు 25 శాతం వాటా దక్కుతున్నది. తెలంగాణలో కూడా పెరిగిన జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచాల్సిన ఇదే డిమాండ్ తో దళిత సంఘాలు ఉద్యమ బాట పడుతున్నాయి. పాలకులు ఇతర రాష్ర్టాల్లో రిజర్వేషన్ల అమలును పరిశీలించి, మానవీయ కోణంలో ఎస్సీ రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకతను గుర్తించాలి. అంబేద్కర్ అందించిన గుర్తింపు, సమానహక్కు పేదలకు దక్కాలంటే ప్రభుత్వాలు ప్రజల పక్షాన మానవత్వంతో పనిచేసినప్పుడే దేశంలలో మనుగడ కోసం ప్రజలు రోడ్డెక్కే పరిస్థితి ఉండదు.
– ధీరన్ కొడారి 8008200664