Coronavirus | గోడ మీద క్యాలెండర్లు మారుతున్నాయి. కానీ ‘నిను వీడని పీడను నేనే’ అంటూ కరోనా మనతో దోబూచులాడుతూనే ఉన్నది. కొత్తకొత్త అవతారాలెత్తుతూ వెంటాడుతూనే ఉన్నది. వైరస్ కరాళ నృత్యానికి ఇంకా తెరపడలేదనేది కఠోర వాస్తవం. 2019 డిసెంబర్లో చైనాలోని వూహాన్లో ఇన్ఫ్లూయంజా వ్యాపించింది. ఆ నగరంలోనే వైరస్ పరిశోధన కేంద్రం ఉండటంతో చైనా కావాలని విడుదల చేసిందనో, పొరపాటున బయటకు పాకిందనో.. ఇలా ఏవేవో కుట్ర సిద్ధాంతాలు అప్పట్లో ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘కరోనా వైరస్ డిసీజ్ 2019’కు హ్రస్వరూపమే కొవిడ్-19. సార్స్ కొవ్-2 వైరస్ దీనికి కారణం. 2020 మార్చి 11న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) దీనిని మహమ్మారిగా ప్రకటించింది.
ఆ సంగతి అలా ఉంచితే ఇప్పుడు మనం 2023 డిసెంబర్లో ఉన్నాం. మూడునాలుగు రోజుల్లో 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. కరోనా మాత్రం మన నెత్తి మీద వేలాడుతూనే ఉన్నది. ఎన్నెన్ని దేశాలకు పాకింది కరోనా.. ఎన్నెన్ని ప్రాణాలను బలిగొన్నది? డెల్టా, ఒమిక్రాన్.. ఇలా వేరియంట్ల పేర్లు మారుతున్నాయి. కానీ, కథ ఒకటే. ఈ కథ కంచికి ఎప్పుడు చేరుతుందో తెలియదు. ఇదొక భయానక ధారావాహికలా సాగుతూనే ఉన్నది. మధ్యమధ్యలో ధార తెగుతున్నది. కొంతకాలం విరామం. ఊపిరి పీల్చుకునేలోపే విజృంభణ. కరోనా మళ్లీమళ్లీ రంగులు మారుతూ మన ముందుకు వస్తూనే ఉన్నది. తాజాగా జేఎన్-1 ఎపిసోడ్ నడుస్తున్నది. అప్పుడెప్పుడో వందేండ్ల క్రితం 1918-1920 మధ్యకాలంలో ‘స్పానిష్ ఫ్లూ’ అనే మహమ్మారి ప్రపంచాన్ని గడగడలాడించింది. అప్పటికి ఇప్పుడున్నన్ని ప్రయాణ సాధనాలు లేవు. ఆధునిక చికిత్సలూ అందుబాటులోకి రాలేదు. రవాణా మార్గాలు, వ్యాపార, వాణిజ్య సంబంధాలు విస్తరించిన కొన్నిదేశాలకే పరిమితమైంది. 1.7 కోట్ల నుంచి 10 కోట్ల మంది వరకు దీనికి బలయ్యారు. ఆ తర్వాత వైరస్ చల్లబడటంతో కథ ముగిసింది. కానీ కరోనా అంతకంటే తీవ్రంగా విరుచుకుపడింది. దాదాపు భూమ్మీద ఉన్న అన్ని దేశాలకూ పాకింది. డబ్ల్యూహెచ్‌వో లెక్కల ప్రకారం ఇప్పటివరకు సుమారు 77 కోట్ల మంది కరోనా బారిన పడితే, అందులో సుమారు 70 లక్షల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. ఇటీవలి దశాబ్దాల్లో జడిపించిన మహమ్మారులు బర్డ్ ఫ్లూ’, స్వైన్ ఫ్లూ’ వంటివి కరోనాకు అక్కాచెల్లెళ్ల వంటివే. స్థాయిలో మాత్రం దరిదాపుల్లోకి రావు. అప్పుడప్పుడు కొత్తవైరస్లు పుట్టుకురావడం, కొన్నేండ్లు మానవాళిని పీడించి తెరమరుగు కావడం చరిత్రలో జరిగేదే.
తాజాగా గత వారం రోజుల్లో దేశంలోని పలురాష్ర్టాల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ నాలుగువేలు దాటాయి. స్వల్ప సంఖ్యలోనే అయినా మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. కరోనా టీకా పరిశోధనలో, తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిన మన హైదరాబాద్ మహానగరంలోనూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. వీటిలో అత్యధికం ఒమిక్రాన్ రకాలే. అయితే ప్రస్తుతం వ్యాపిస్తున్న జేఎన్-1 వైరస్‌కు కొత్త టీకా అవసరం లేదని, ఇదివరకు టీకా తీసుకున్న వారు మళ్లీ తీసుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. పైగా ఇది అంతగా ప్రాణాంతకం కాదని వైద్యనిపుణులు అంటున్నారు. ఇది కొంత ఊరట కలిగించే విషయం. అయినా అలసత్వం ఏమాత్రం పనికిరాదు. నిన్నటిదాకా జరిగిన ఘోరకలిని మరచిపోకూడదు.