చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం అనేది పాత సామెత. చేతులు కాలాక కూడా ఆకులు పట్టుకోకపోవటం అన్నది కొత్త సామెత. కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా సరిపోతుంది ఇది. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు ఘోర పరాజయాలు, పార్టీ చరిత్రలోనే అత్యంత తక్కువగా లోక్‌సభ సీట్లు, అనేక రాష్ర్టాల్లో ఓటములు, ఒకరి తర్వాత ఒకరుగా సీనియర్లు పార్టీని వదిలి వెళ్లిపోవటం, జాతీయస్థాయిలో ప్రతిపక్షం అని పేరుకే తప్ప వాస్తవానికి అత్యంత దయనీయస్థితిలో పార్టీ మిగిలిపోవటం.. ఇంత నష్టం జరిగినా కూడా కాంగ్రెస్ అధినాయకత్వంలో చలనం రాలేదు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతలు 23 మంది పార్టీ అధోగతిని గమనించి ఆవేదనతో అధిష్ఠానానికి రెండేండ్ల కిందట లేఖ కూడా రాశారు. భారతదేశ ప్రజాస్వామ్యం నరేంద్రమోదీ రూపంలో అత్యంత తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నదని, ఇకనైనా మేల్కోవాలని కోరారు. కానీ, అధిష్ఠానం కించిత్తు కూడా స్పందించలేదు సరికదా.. జీ-23గా పేరొందిన ఆ నేతల మీద విమర్శలు, ఆరోపణలు సొంత పార్టీ నాయకుల నుంచే వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే, ప్రస్తుత ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత కాంగ్రెస్‌లో ఏకంగా విస్ఫోటనమే సంభవించనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. నయా కాంగ్రెస్ పేరిట పార్టీ నిట్టనిలువున చీలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.
కాంగ్రెస్‌లో ఈ పతనావస్థకు అధినాయకత్వం ఎంత కారణమో, పార్టీ శ్రేణులు, వివిధ స్థాయిల నాయకులు కూడా అంతేకారణం అని చెప్పకతప్పదు. మోదీ, అమిత్‌షాలను ఎదిరిస్తే ఈడీ, సీబీఐ వంటి సంస్థల నుంచి కేసులు మీద పడే ప్రమాదం ఉందని కొందరు, పదవులు ఆశించి మరికొందరు.. ఇలా రకరకాల కారణాలతో ‘బీజేపీ మీద యుద్ధం’ అనే కాడిని వదిలేసి స్వప్రయోజనం చూసుకున్నారు. వీరిలో అనేకులు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులను దర్జాగా వెలగబెట్టినవారే. కాంగ్రెస్‌లో తొలినుంచీ కొనసాగుతున్న గ్రూపుల సంస్కృతి కూడా ఆ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి కీలక కారణమవుతున్నది.
మోదీ హయాంలో ఎనిమిదేండ్లుగా ప్రజాసంక్షేమ చర్యలు చేపట్టటం అటుంచి, ఏకంగా దేశ మౌలిక స్వభావాన్నే మార్చే కుట్రలు జరుగుతున్నాయి. భారతదేశాన్ని మతరాజ్యంగా, నిరంకుశ రాజ్యంగా మార్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిని మేధావులు, ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, రైతులు.. సకల రంగాల జనం ఆవేదనతో, నిస్సహాయతతో గమనిస్తున్నారు. వారి ఆవేదనకు, అసంతృప్తికి రూపం ఇచ్చి, దేశంలో ప్రజాస్వామ్య ప్రభంజనాన్ని సృష్టించే చారిత్రక బాధ్యతను స్వీకరించే స్థాయి లేక కాంగ్రెస్ పూర్తిగా చతికిలబడిపోయింది. దేశాన్ని మతశక్తుల బారి నుంచి రక్షించి, దేశంలో ఉన్న అద్భుతమైన వనరులను ఉపయోగించి, భారతదేశాన్ని బంగారు భారతంగా మార్చే నాయకత్వం కోసం యావత్‌దేశం ఎదురుచూస్తున్నది.