సోషల్ మీడియాలో కాంగ్రెస్‌కు ఘోరమైన ఎదురుదెబ్బ తగిలింది. ఎవరి పాలన కావాలంటూ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టిన పోల్‌లో దాదాపు 70 శాతం మంది ప్రజలు కేసీఆర్ పాలన బాగుందని ఓట్లు వేశారు. కాంగ్రెస్ పార్టీకి ఇది ఊహించని ఎదురుదెబ్బ. తన అధికారిక ట్విట్టర్లో ఇలాంటి ఫలితాలు రావడం ఆ పార్టీకి రెడ్ సిగ్నలే. ఇప్పుడీ పోల్ తెలంగాణ పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్ అయింది.
అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎంతటి అసంతృప్తి, ఆగ్రహం ఉందో తాజా పోల్ నిరూపించింది. ‘కాంగ్రెస్ పాలన వద్దు, కేసీఆర్ పాలన ముద్దు’ అని ప్రజలు నిర్మొహమాటంగా చెప్పేశారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారో తమ ఓటుతో తెలియజెప్పారు. నిజానికి 420 హామీలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వేసిన ట్రాప్‌లో కాంగ్రెస్ చిక్కుకుంది. కాంగ్రెస్ హామీలపై గులాబీ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. అయితే, బీఆర్ఎస్ను ప్రజల్లో బద్నాం చేసేందుకు కాంగ్రెస్ సోషల్ మీడియా ముందు రోజే అంటే జనవరి 29న తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోల్ పెట్టింది.
‘ఫామ్ హౌస్ పాలన కావాలా?ప్రజల వద్దకు పాలన కావాలా?’ అని పోస్ట్ పెట్టింది. ప్రభుత్వానికి పాజిటివ్‌గా తీర్పు వస్తే తన అనుకూల మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తూ బీఆర్ఎస్పై మరింతగా రెచ్చిపోవచ్చునని భావించింది. బీఆర్ఎస్ ప్రోగ్రాం అట్టర్ ఫ్లాప్ అయిందని, బీఆర్ఎస్ను ప్రజలు నమ్మడం లేదని ప్రచారం చేయవచ్చని కలలు కన్నది. అయితే కాంగ్రెస్‌వి పగటి కలలే అయ్యాయి. ప్రజలు ఇచ్చిన దిమ్మతిరిగే షాక్‌తో ప్రభుత్వానికి పట్టపగలే చుక్కలు కనిపించాయి. అంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్‌రెడ్డి పాలనను సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే వ్యతిరేకిస్తున్నట్టు తాజా పోల్ రిజల్ట్ స్పష్టం చేసింది.
ప్రభుత్వ పనితీరుపై కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పెట్టిన పోస్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సొంత క్యాడరే ఓటు వేశారు. దీనిని బట్టి అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సొంత పార్టీలో ఇంత అసంతృప్తి ఉంటే ఇక ప్రజల్లో ఉన్న అసంతృప్తి గురించి చెప్పనక్కర్లేదు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై కేసులు పెడుతుండటాన్ని గ్రహించిన ప్రజలు బాహాటంగా రేవంత్‌ను విమర్శించే సాహసం చేయలేకపోతున్నారు. దీంతో అందివచ్చిన అవకాశంలా భావించి సోషల్ మీడియాలో కాంగ్రెస్ పెట్టిన పోల్ ద్వారా ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, కారు షెడ్‌కు పోయిందని, బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని విమర్శించే కాంగ్రెస్, బీజేపీకి ఈ రిజల్ట్ చెంపపెట్టులాంటిది.
తెలంగాణ ప్రజలతో బీఆర్ఎస్ బంధం ఎంతలా పెనవేసుకుపోయిందో చెప్పేందుకు ఈ ఫలితం ఒక ఉదాహరణ. పోల్‌లో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు విశ్వసించడం ఆ పార్టీకి కొండంత బలాన్ని ఇచ్చినట్టు అయింది. సోషల్ మీడియాలో ప్రజలు తమకు అనుకూలంగా ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్కు వేయి ఏనుగుల బలం వచ్చినట్టు అయింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు మరింతమంది నేతలు సిద్ధంగా ఉన్నారన్న టీపీసీసీ చీఫ్‌కు కూడా ఈ రిజల్ట్‌తో గట్టి షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్పై కూడబలుక్కుని తప్పుడు ప్రచారం చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్‌కు ఈ తీర్పు ఒక చెంపపెట్టులాంటిదే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేనంత బలహీన పడిందని బీఆర్ఎస్పై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలకు ఇది జీర్ణించుకోలేని వార్త.
కీలకమైన సర్పంచ్ ఎన్నికల వేళ ప్రజలు ఇలాంటి తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలు మొదలయ్యాయి. ఎన్నికల్లో కనీసం పరువు అయినా నిలుస్తుందా? అని ఆందోళన చెందుతున్నారు. ప్రతిపక్షాన్ని ఇరుకులో పెట్టబోయి కాంగ్రెస్ తానే నవ్వుల పాలైంది. ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత వ్యతిరేకతను కాంగ్రెస్ ఊహించలేకపోయింది. మరోవైపు సోషల్ మీడియాలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఏకంగా వేల సంఖ్యలో ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ప్రభుత్వానికి అనుకూలంగా ఓట్లు వేయిం చే ప్రయత్నాలు చేస్తున్నది. తాజా పోల్ ఫలితాలతో పార్టీ మారాలనుకున్న చిన్నాచితక నేతలు సందిగ్ధంలో పడిపోయారు. ఈ నేపథ్యంలో ఇకపై రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్నది. అధికార పార్టీ నుంచి నేతలు వలస వెళ్లినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సొంత పార్టీలో, ప్రభుత్వంలో తిరుగుబాటు వచ్చినా రావచ్చు. ఇప్పటికే ఢిల్లీలో భట్టి, ఉత్తమ్ వంటి నేతలు పావులు కదుపుతున్నారు.
ఇంకోవైపు ఇది ప్రతిపక్షానికి ప్రజలు ఇచ్చిన మద్దతు. ఏడాది కాలంగా ప్రతి పక్షం ప్రజల పక్షాన పోరాడుతున్న తీరుకు ఇది ఒక సమర్థన. ఈ తీర్పు ప్రతిపక్షంపై మరింత బాధ్యత పెట్టింది. బరువును పెంచింది.
– తోటకూర రమేశ్ 9866168676