రెండు దశాబ్దాల క్రితం వరకు ఉన్నత విద్య చదవడం అనేది పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు తీరని కల. ముఖ్యంగా ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి వృత్తి విద్య కోర్సులు చదవాలంటే కుటుంబాలు ఆర్థికంగా తీవ్రంగా కుంగిపోవాల్సి వచ్చేది. కొంతమంది తల్లిదండ్రులు తమ ఆస్తులను అమ్మి పిల్లలను చదివించాల్సిన పరిస్థితులు ఉండేవి. ఆర్థికపరమైన కారణాలతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఆలోచనతో 2004లో అప్పటి సీఎం రాజశేఖర్‌రెడ్డి.. ఫీజు రీయింబర్స్మెంట్ అనే పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ఉన్నత విద్యారంగం దశాదిశను మార్చేసింది. లక్షలాది మంది పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో పాతకాలం నాటి కష్టాలు పునరావృతమై, పేదలకు ఉన్నత విద్య దూరమయ్యే దుస్థితి నెలకొన్నాయి.
ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ఉన్నత విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు రూపాయి ఖర్చు లేకుండా ఇంజినీరింగ్, మెడిసిన్, ఇతర వృత్తి విద్య కోర్సులు పూర్తి చేసి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి, వివిధ రంగాల్లో రాణించడంతో తమ కుటుంబాలు ఆర్థికంగా ఎదగడానికి కారణమయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేసింది. తొమ్మిదిన్నరేండ్లలో దాదాపు రూ.15 వేల కోట్లకుపైగా చెల్లింపులు చేసింది. తెలంగాణలో ఐటీ రంగం అభివృద్ధి చెందడంలో ఈ పథకం ముఖ్యపాత్ర పోషించింది. హైదరాబాద్ నగరం ఐటీ హబ్‌గా ఎదిగింది. దాని ఆధారంగా రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివద్ధి చెందింది. ఈ సంక్షేమ పథకం ద్వారా రూపుదిద్దుకున్న నైపుణ్యం కలిగిన పట్టభద్రుల లభ్యత వల్ల ఇవన్నీ పరోక్షంగా సాధ్యమయ్యాయి. ఫలితంగా రాష్ట్ర తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది.
నేటికి దాదాపు రూ.10 వేల కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయి. చిన్న మొత్తాల్లో బకాయిలు ఉన్న డిగ్రీ, జూనియర్ కళాశాలలకు కూడా ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేని దుస్థితి ఏర్పడింది. ఫలితంగా ప్రస్తుతం ఉన్నత విద్యా వ్యవస్థలో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం నెలకొంది. ప్రభుత్వం నుంచి చెల్లింపులు రాకపోవడంతో కళాశాలలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి.
మరోవైపు విద్యార్థులు తమ కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికెట్లు పొందలేని పరిస్థితి నెలకొంది. ఇది కేవలం పరిపాలనా వైఫల్యం మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం చూపే సమస్య. ఉన్నత విద్య పూర్తి చేసి విదేశాలకు వెళ్లాలని, ఉద్యోగ అవకాశాలను పొందాలని ఆశించిన విద్యార్థులు ఇప్పుడు అయోమయంలో ఉన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వడానికి విద్యాసంస్థలు నిరాకరిస్తుండడంతో లక్షలాది మంది ఉన్నత విద్యావంతుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రభుత్వం ఇటీవల ఫీజులను నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించడం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మరింత ఆందోళన కలిగించే అంశం. ఇది విద్యార్థులకు అనుకూలమైన నిర్ణయమని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్తున్నప్పటికీ, వాస్తవానికి ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల భారం విద్యార్థులపై మోపే ప్రయత్నమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే తమ బకాయిలను విద్యార్థుల నుంచే వసూలు చేసుకోవాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ (డీబీటీ) ద్వారా నేరుగా విద్యార్థుల ఖాతాల్లో జమ చేస్తామనడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇటు హైకోర్టు, అటు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల దగ్గర నుంచే ఫీజులు వసూలు చేసుకోవాలని సూచించడం వల్ల కళాశాలలు తమ బకాయిల కోసం విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఇప్పటికే చాలా కళాశాలలు పూర్తి ఫీజులు చెల్లించకపోతే సర్టిఫికెట్లు ఇవ్వబోమని షరతులు విధిస్తున్నాయి. దీని వల్ల పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాయి. కొందరు తల్లిదండ్రులు అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి (పుస్తెల తాడు సహా) ఫీజులు చెల్లిస్తున్నారు. ఇది మళ్లీ రెండు దశాబ్దాల క్రితం పరిస్థితులను గుర్తుకుతెస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థుల ఉన్నత విద్యను దూరం చేసే దిశగా అడుగులు వేస్తున్నదనే అనుమానం కలుగుతున్నది.
ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజులు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉండడంతో అనేక విద్యాసంస్థలు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డిగ్రీ, జూనియర్ కళాశాలలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఉదాహరణకు, మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో ఒకప్పుడు 130కి పైగా ఉన్న డిగ్రీ కళాశాలలు ఇప్పుడు 30కు తగ్గిపోయాయి. అందులో కూడా అనేక కళాశాలలు మూతపడే దుస్థితిలో ఉన్నాయి. ఇది ఉన్నత విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభానికి స్పష్టమైన సంకేతం.
ఇటీవల విద్యాసంస్థలు, విద్యార్థి సంఘాలు కలిసి ఉద్యమాలకు దిగడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నది. కళాశాలల బంద్‌లు, పరీక్షల బహిష్కరణ, ధర్నాలు, రాస్తారోకోలు వంటి నిరసన కార్యక్రమాలతో ప్రభుత్వంపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చాయి. అయినప్పటికీ సమస్యకు స్పష్టమైన పరిష్కారం కనిపించడం లేదు. పైగా పథకాన్ని మరింత గందరగోళంలోకి నెట్టే నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కనిపిస్తున్నది. విద్యార్థుల బంగారు భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రమాదం స్పష్టమవుతున్నది.
ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని బలహీనపరచడం లేదా ఎత్తివేయడం వంటి చర్యలు తీసుకుంటే, అది సామాజికంగా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. పేద, సామాన్య, మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య మరలా అందని ద్రాక్షగా మారే ప్రమాదం ఉన్నది. ఇప్పుడిప్పుడే ఉన్నత చదువులు పూర్తి చేసి విదేశాలకు వెళ్లాలని, మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలని ఆశపడుతున్న విద్యార్థులు అయోమయంలో ఉన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ సమస్యను అత్యవసరంగా పరిష్కరించాలి. ట్యూషన్ ఫీజులను విద్యార్థుల నుంచే వసూలు చేయాలనే విధానాన్ని పునఃసమీక్షించి, పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు అందేలా చర్యలు తీసుకోవాలి. అలాగే దీర్ఘకాలికంగా ఈ పథకాన్ని స్థిరంగా కొనసాగించే విధానాలను రూపొందించాలి.
ఫీజురియింబర్స్‌మెంట్ కేవలం ఒక సంక్షేమ పథకం మాత్రమే కాదు. సమాజంలో సమానత్వాన్ని సాధించే ఒక ముఖ్య సాధనం. అంటే, పేద, సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు ఆర్థికపరమైన కారణాలతో ఉన్నత విద్యకు దూరం కాకూడదనేది పథకం ఉద్దేశం. దీనిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు, సమాజం మొత్తం బాధ్యత. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీలు తమ జెండా, ఎజెండాలను పక్కనపెట్టి, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ (డీబీటీ) పేరుతో ఫీజురియింబర్స్‌మెంట్ పథకాన్ని తప్పుదారి పట్టించే ప్రభుత్వ నిర్ణయంపై తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే, భవిష్యత్తులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నత విద్య కోర్సులు చదువుకోవడం ఒక కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.
– మ్యాకల కృష్ణ 9948556978
– నరసింహ 9948579017