తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడింది. పోలీస్ వ్యవస్థను వాడుకొని ప్రతిపక్ష నాయకులపై కేసుల నమోదు, అరెస్టులు చేయించింది. ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను ప్రలోభాలకు గురి చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని సృష్టించింది. కాంగ్రెస్ అరాచక చర్యలు చూస్తుంటే తెలంగాణలో నడుస్తున్నది ప్రజాస్వామ్యమా? రౌడీ రాజ్యమా అని సందేహం కలుగుతున్నది.
ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఉన్న ప్రధాన బాధ్యత కేవలం పాలన చేయడం మాత్రమే కాదు. సమాన అవకాశాలు కల్పించే వాతావరణాన్ని సృష్టించాలి. ఎన్నికల సమయంలో అధికారపక్షం తటస్థత పాటించాలి. పోలీసు వ్యవస్థ పాత్ర కూడా అత్యంత కీలకం. పోలీసులు చట్టాన్ని అమలు చేసే స్వతంత్ర వ్యవస్థగా పనిచేయాలి. కానీ వారు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తే ఎన్నికల విశ్వసనీయతే ప్రశ్నార్థకమవుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఇలాంటి ఎన్నో ఘటనలు కనిపించాయి.
పాలనపై దృష్టి పెట్టకుండా అధికార దుర్వినియోగానికి రేవంత్ సర్కార్ పాల్పడు తు న్నది. తొర్రూరు మున్సిపాలిటీ ఫలితాల తర్వాత జరిగిన పరిణామాలు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేశాయి. బీఆర్ఎస్ కార్యకర్తలపై జరిగిన దౌర్జన్యాలను తట్టుకోలేక మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కంటతడి పెట్టడం అందరినీ కలచివేసింది. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో జరిగిన పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. బీఆర్ఎస్సీపీఐ కూటమికి మెజారిటీ వచ్చినప్పటికీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను అధికార పక్షం వాయిదా వేసింది. ఈ క్రమంలో జరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం రాజకీయ ప్రేరిత చర్య. జనగామలో బీఆర్ఎస్కు అనుకూల ఓటు వేస్తున్న స్వతంత్ర సభ్యురాలిని కాంగ్రెస్ నేతలు అడ్డుకొనేందుకు యత్నించిన తీరు అత్యంత దుర్మార్గం.
కరీంనగర్లో బీఆర్ఎస్ నాయకుడు తిరుపతి అరెస్టును అడ్డుకునేందుకు మాజీమంత్రి గంగుల కమలాకర్ రంగంలోకి దిగారు. పోలీసులు మాత్రం ఆ కార్యకర్తను వాహనంలో తరలించేందుకు యత్నించారు. పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఎంత తీవ్రంగా ఉన్నదో ఈ ఘటనతో అర్థం చేసుకోవచ్చు. మెదక్ జిల్లాలో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణల తర్వాత 23 మంది బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం చట్టాలను ప్రయోగిస్తూ పోతుంటే, నిజంగా రక్షణ అవసరమైన సందర్భాల్లో ఆ చట్టాల విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేసింది. హస్తం పార్టీకి అనుకూలంగా పోలీసు వ్యవస్థ వ్యవహరించింది. ఎన్నికల్లో అధికారులు, పోలీసుల బలం, బెదిరింపులతో పాలక పక్షం ముందుకు సాగితే, అది పారదర్శక పోటీ ఎలా అవుతుంది? ఇలాంటి చర్యలు తాత్కాలికంగా ఒక పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చవచ్చు. కానీ దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య వ్యవస్థపై మచ్చగా మిగిలిపోతాయి. ప్రజాస్వామ్యం రూపం మాత్రమే మిగిలి, ఆత్మ కోల్పోతుంది. ప్రజాస్వామ్య విలువలను గౌరవించడం ద్వారా మాత్రమే ఒక ప్రభుత్వం తన నైతిక బలం నిలబెట్టుకోగలదు. లేదంటే, ప్రజలే అదును చూసి ఓటుతోనే గట్టిగా సమాధానం చెప్తారు.
– మహేంద్ర తోటకూరి