కేసీఆర్ అనే మూడక్షరాలు వింటే కాంగ్రెస్ పాలకులకు దడుపు పోవడం లేదు. సగం పరిపాలనా కాలం గడిచిపోయినా రేవంత్‌రెడ్డికి తాను సీఎం అనే సోయి రావడం లేదు. తెల్లారి లేస్తే కేసీఆర్ జపం చేయడమే అందుకు నిదర్శనం. కేసీఆర్ అనే మేరునగాన్ని ఎన్నడూ అందుకోలేమనే ఆత్మన్యూనత అనుక్షణం తరిమికొడుతున్నట్టున్నది. అందుకే వైరభక్తిలో తరిస్తున్నారు. పరిపాలన మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యలు తీర్చాలంటే కేసీఆర్‌పై అక్కసుతో కూడిన తిక్క రాజకీయాలతో కాలక్షేపం చేస్తున్నారు. అద్దంపై రాళ్లు వేసే ఈ ధోరణి శ్రుతిమించి దాడులకు తెగబడే ఉన్మాదంగా పేట్రేగుతున్నది. అధికారం ముసుగులో అరాచకం ఊరేగుతున్నది. కక్ష రాజకీయం గతితప్పి అనాగరికంలోకి దిగజారుతున్నది. అక్కసు, నిస్పృహతో ప్రత్యక్ష దాడులకు ఉసిగొల్పుతున్నది.
అన్ని హద్దులూ చెరిగిపోతున్నాయి. ప్రజాస్వామ్యం ప్రహసనమైపోతున్నది. హామీలు అటకెక్కాయి. గ్యారెంటీలు గాలికెగిరిపోయాయి. ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. ప్రశ్నలు వెంటాడుతున్నాయి. ఆ ప్రశ్నలకు సర్కార్ దగ్గర సమాధానాలు లేవు. రాజకీయంగా గెలువలేకే దాడులకు బరితెగిస్తున్నారు. కేసీఆర్ అనే మూడక్షరాలే శ్రీరామరక్ష అని ప్రజలకు తెలుసు. అందుకే కేసీఆర్ అంటే కాంగ్రెస్ పాలకులకు వెన్నులో వణుకు. గుండెల్లో గుబులు. డిమాండ్లతో విపక్షం సర్కార్‌ను ఘెరావ్ చేయడం రివాజు. ఇప్పుడు అధికారపక్షమే విపక్ష నేత ఇంటిపైకి అల్లరిమూకల్ని తోలడం ఏంది? హామీలు నెరవేర్చలేకపోతే, కాంగ్రెస్ నేతలకు పాలన చేతకాకపోతే తక్షణమే సర్కార్ నుంచి వైదొలగాలి. సీఎం సిగ్గుపడి రాజీనామా చేయాలి. అలా చేయకుం డా అసెంబ్లీకి విపక్షనేత రావాలని, లేకపోతే రాజీనామా చేయాలని వితండవాదన చేయడం ఏంది? పోలీసుల ఎస్కార్ట్‌తో ధర్నాలు, దాడు లు చేయించడం ఏంది?
కాంగ్రెస్ నేతలు అడ్డగోలు హామీలతో అరచేతిలో స్వర్గం చూపారు. అబద్ధాలతో బురిడీ కొట్టించారు. పొరపాటో, గ్రహపాటో ప్రజలు అధికారం అప్పజెప్పారు. సగం పుణ్యకాలం కూడా గడిచిపోయింది. చేవలేని పాలనతో తెలంగాణ తెర్లుతెర్లు అయ్యింది. హస్తం పార్టీ నేతలు రాష్ర్టాన్ని అధోగతిపాలు చేసి పక్కచూపులు చూస్తున్నారు. ‘పిచ్చి కుదిరింది రోకలిని తలకు చుట్టు’ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ తీరు మారాలి, మా సారు మళ్లీ రావాలి అని ఊరూరా ప్రజలు పదేపదే అంటున్నారు. వేడుక ఏదైనా, వేదిక ఏదైనా, సభ ఏదైనా, సంబురమేదైనా కేసీఆర్ చర్చనీయాంశంగా మారుతున్నరు. అభిమాననేత పోరాటం, పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను యాది చేసుకొంటున్నరు. మోసపోయి గోసపడుతున్న తీరు చెప్పుకొంటున్నరు. మాటల నుంచి పాటల వరకు, కచ్చీరు నుంచి సోషల్ మీడియా వరకు ‘అప్పుడే మంచిగుండే’ అనే మాట మారుమోగుతున్నది. మళ్లా అధికారంలోకి ఎప్పుడొస్తవు సారూ అనుకుంటూ మనసు నిండా తల్చుకుంటున్నరు… కండ్లల్లో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నరు.
ఈ నేపథ్యంలో పాలన చేతగాని కాంగ్రెస్ నేతలకు, ప్రజల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకొన్న కేసీఆర్ అంటే ఓర్వలేనితనం. కేసీఆర్ అంటే కేవలం మూడక్షరాలు కాదు. పాతికేండ్లుగా ఈ గడ్డతో పెనవేసుకున్న చరిత్ర ఆయనది. స్వరాష్ట్ర సాధన సమరానికి సకల జనులను సన్నద్ధం చేసిన సేనాని. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన అసమాన వ్యూహచతురుడు. మృత్యుముఖంలోకి వెళ్లొచ్చి విజయాన్ని ముద్దాడిన వీరుడు. తెలంగాణ సంకెళ్లు తెంచి స్వాభిమాన పతాకాన్ని రెపరెపలాడించిన యోధుడు. సాధించిన తెలంగాణను సమున్నతంగా నిలబెట్టిన పాలనాదక్షుడు. అభివృద్ధి, సంక్షేమాలు జోడుగుర్రాలుగా పరిపాలనా రథాన్ని నడిపిన సారథి. కేసీఆర్ ఒక శక్తి. ప్రజలను మోసగించి, హామీలతో వంచించిన కాంగ్రెస్ నేతలకు, కేసీఆర్ అంటే అందుకే అంత కక్ష. మహామేరువును ఒడిసిపట్టాలని మరుగుజ్జుల వెంపర్లాట. కన్నంలో దొరికిన దొంగలు తమను పట్టుకున్న వాళ్లను ఎన్నటికీ క్షమించలేరు. అందుకే కేసీఆర్‌పై పగతో రగిలిపోతుంటారు. జ్వాలాముఖిని ఎండుటాకులతో కప్పజూసే వెర్రిమొర్రి తండ్లాట వంటిదే అది. కేసీఆర్ అంటే నీటి మీద సంతకం కాదు. తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరం. ఆయన ఆనవాళ్లు చెరిపేయాలని ఎగిరెగిరి పడ్డవాళ్లు అది సాధ్యం కాదని తెలుసుకున్నారు. అందుకే ఎన్నికలు ఇంకా దూరంగానే ఉన్నా ఓటమి భయం జడిపిస్తున్నట్టుంది. కేసీఆర్ అంటే వారికి సింహస్వప్నమైంది. సావుడప్పు పేరిట క్షుద్ర రాజకీయా లు ఆ ఉలికిపాటు పలువరింతలో భాగమే.