‘నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావో నేను ఆ స్కూల్ ప్రిన్సిపల్‌ను’ అనే డైలాగ్ చాలా సినిమాల్లో ఉపయోగించారు. ఇటీవల కాంగ్రెస్ కొత్తగా మొదలుపెట్టిన దుష్ప్రచారం మాడల్ చూస్తే ఈ డైలాగ్ గుర్తుకువస్తుంది. ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ కోసం బీజేపీ దేశవ్యాప్తంగా తీవ్రంగా కృషిచేసి బ్రహ్మాండమైన విజయం సాధించింది. బీజేపీ దుష్ప్రచార మాడల్‌ను ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ నమ్ముకున్నట్టుగా కనిపిస్తున్నది.
బీఆర్ఎస్ నాయకత్వంపై సామాజిక మాధ్య మాల్లో బురదజల్లే ప్రయత్నాలు శ్రుతి మించు తున్నాయి. సీఎం ప్రసంగాలు కూడా హాస్యాస్పదంగా ఉంటున్నాయి. రాజకీయ అవకాశాలు కలిసి వచ్చాయి తప్పితే జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ప్రసంగించే పరిజ్ఞానం ఆయనకు లేదు. జాతీయ వేదికల మాట దేవుడెరుగు స్థానిక మీటింగ్లలోనూ విషయ పరిజ్ఞానం లేకుండా ప్రసంగించి నవ్వులపాలవుతున్నా రు. వికారాబాద్‌లో టీబీ చికిత్స గురించి మాట్లాడాల్సిన చోట కుష్ఠువ్యాధి గురించి మాట్లాడుతుంటే వేదికపై ఉన్నవారు లెప్రసీ కాదు.. టీబీ అని చెవిలో చెప్పాల్సి వచ్చింది.
టి.అంజయ్య తెలంగాణ యాసలో మాట్లాడితే అప్పటి మీడియా ఆయన ఉపన్యాసాలను వెక్కిరించేది. సముద్రంలో తేలు పడింది అంటూ అంజయ్య మీద జోకులు పుట్టించారు. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడి యా లేదు, ప్రింట్ మీడియానే కాబట్టి తమ ఇష్టం ఉన్న ట్టు జోకులు నిజాలుగా సృష్టించేవారు. ఇప్పుడు అలా కాదు. ఏ నాయకుడి మాట తీరు ఏమిటో? ఏ నాయకుడి విషయ పరిజ్ఞానం ఏమిటో ప్రజలు లైవ్‌లో చూస్తున్నారు. అయినా రాజకీయ పార్టీల అనుబంధాల వల్ల విషయ పరిజ్ఞానం లేకుండా నవ్వుల పాలయ్యే విధంగా ప్రసంగించినా మీడియా ఆ నాయకులను తెలివైన వారిగా ప్రజల మెదళ్లలో చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నది.
కొన్ని నిజాలు మీడియాలో ప్రచారానికి నోచుకోకపోయినా సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు ఎవరేమిటో తెలుస్తున్నది. ఒకవైపు అనేక మీటింగ్‌లలో వక్తలు సీఎం పేరే మరిచిపోతున్నారు . మరోవైపు ఉపన్యాసాల్లో ఆయన డొల్లతనం బయటపడుతున్నది. దీంతో ప్రత్యర్థిపై దుష్ప్రచారం ద్వారా పరిస్థితిని చక్కదిద్దాలనే ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనిలో భాగంగానే కేసీఆర్ అమెరికాకు వెళ్లిపోతున్నారని కాంగ్రెస్ ప్రాయోజిత ప్రచారం మొదలైంది. క్షుద్ర పూజలు అనే ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.
ఇలాంటి ప్రచారంలో బీజేపీని అనుసరించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నట్టుగా ఉన్నది. ప్రచారంలో బీజేపీ యూనివర్సిటీల స్థాయిలో ఉంటే కాంగ్రెస్ అక్షరాభ్యాసం స్థాయిలో ఉన్నది. బీజేపీ ప్రచారం ఒక్క ఆ పార్టీ ఐటీ విభాగం మాత్రమే కాదు హిందూ సంస్థలు, కుల సంఘాలు దశాబ్దాల నుంచి ఒక పథకం ప్రకారం దుష్ప్రచారం సాగిస్తున్నాయి. ఏ కుల సంఘం వాట్సాప్ గ్రూప్ చూసినా, చివరికి టీచర్ల వాట్సాప్ గ్రూపుల్లో సాగే ప్రచారం చూసినా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ ఎంతో దూరంలో లేదనిపిస్తుంది.
ప్రముఖ సామాజిక మాధ్యమం ‘కోరా’లో వృత్తి నిపుణులు, కవులు, రచయితలు, జర్నలిస్టులు అన్ని వృత్తుల వారుంటారు. ప్రశ్నలు, సమాధానాలు సమాచారం తెలిపే విధంగా ఉంటాయి. అందులో ఒక ఆసక్తికరమైన సమాచారం చూశాను. పాస్టర్లు, నన్స్‌కు కాం గ్రెస్ 1944 నుంచి ఆదాయం పన్ను మినహాయించిందని. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత దానిని తీసివేశారని విస్తృతంగా ప్రచారం జరిగింది. పాస్టర్లకు ఆదాయ పన్ను మినహాయించడం ఎలా సాధ్యం? ఒకవేళ అదే నిజమైతే రూ.కోట్ల పన్నులు ఎగ్గొట్టడానికి అందరూ పాస్టర్ అని ైక్లెమ్ చేసుకుంటారు.
అదేమీ అఖిల భారతస్థాయి పరీక్ష కాదు, ఎవరన్నా పాస్టర్ కావ చ్చు. ఎలా సాధ్యం? అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే తెలిసింది. ఏ ఉద్యోగికైనా జీతం ఇస్తే టీడీఎస్ మినహాయించి ఇస్తారు. మద్రాస్‌లో చర్చి పాస్టర్లు తాము జీతా న్ని మత ప్రచారానికే ఉపయోగిస్తామని, కాబట్టి తమను టీడీఎస్ నుంచి మినహాయించాలని కోర్టుకు వెళ్లారు. అయితే, అది సాధ్యం కాదని, దేశంలో ఉద్యోగులందరూ సమానమేని పేర్కొంటూ వారి అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. అసలు విషయం ఇది అయితే, 1944 నుంచి కాంగ్రెస్ పార్టీ పాస్టర్లకు ఆదాయం పన్ను మినహాయించిందని ప్రచారం జరిగింది. ఇది నిజమేనని నమ్మి జనం కాంగ్రెస్‌పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దాడి జరిపారు.
దశాబ్దాల నుంచి బీజేపీ అభిమానులు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నారు. ఒక చిన్న రాష్ట్రం హిమాచ ల్ప్రదేశ్ను మినహాయిస్తే కాంగ్రెస్ ఇప్పుడు తెలంగాణ, కర్ణాటకలో మాత్రమే అధికారంలో ఉన్నది. ఈ లెక్కన దేశంలో 90 శాతం కాంగ్రెస్ ముక్త్ భారత్ నెరవేరినట్టే. మిగిలిన ఈ రెండు రాష్ర్టాల్లో అధికార పక్షానికి బీజేపీ నుంచి ఇప్పటివరకు పెద్దగా ఇబ్బందుల్లేవు. బీజేపీకి ప్రయోజనం ఉన్నంతవరకే ఈ అనుబంధం, సహకా రం ఉంటుంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యాన్ని బీజేపీ ఈ రెండు రాష్ర్టాల నుంచి ఎందుకు మినహాయిస్తుంది.
తన తప్పుడు ప్రచార శక్తితో బీజేపీ దేశమంతటా కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొడితే బీఆర్ఎస్ను లక్ష్యం చేసుకొని కాంగ్రెస్ అదే తప్పుడు ప్రచారాన్ని నమ్ముకొన్నది. నిజానికి ఈ తప్పుడు ప్రచారంలో కూడా కాంగ్రెస్ సొం త తెలివి చూపలేక పోతున్నది. సోనియా గాంధీ ఇటలీ వెళ్లిపోతారని, రాహుల్ గాంధీ అమెరికాలో స్థిరపడతారని బీజేపీ చాలాకాలం క్రితమే ప్రచారం మొదలు పెట్టింది. కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని కాపీ కొట్టి కేసీఆర్ అమెరికా వెళ్లిపోతారని ప్రచారం మొదలుపెట్టింది. సీఎం పదవిలో ఉన్నప్పుడే తన వ్యవసాయ క్షేత్రంపై కేసీఆర్ ఆసక్తి చూపారు. సొంత గ్రామాన్ని, వ్యవసాయ క్షేత్రాన్ని ప్రేమించేవారు వదిలి వెళ్లలేరు.
కాంగ్రెస్‌కు సుదీర్ఘకాలం పాలించిన అనుభవం ఉన్న ది. హామీలను అమలుచేసి చూపిస్తాం. నిధులు ఎలా సమకూర్చుకోవాలో మాకు తెలుసు అని ఎన్నికలకు ముందు గంభీరంగా పలికిన కాంగ్రెస్ నాయకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలుచేయలేక సాకులు వెతుకుతున్నారు. ఒకవైపు హామీలు అమలు చేయలేక ప్రజల్లో చులకన అవుతున్నారు, మరోవైపు విషయ పరిజ్ఞానం లేక నవ్వుల పాలవుతున్నారు. దీంతో బీజేపీ తరహా దుష్ప్రచారాన్ని కాంగ్రెస్ నమ్ముకొన్నది. మతం ఆధారంగా సాగిన, సాగుతున్న ఆ ప్రచారం బీజేపీకి బాగానే ఉపయోగపడింది. అయి తే, ఆ మార్గంలో కాంగ్రెస్ వెళ్లినా ప్రయోజనం ఉండ దు. బీజేపీ సిలబస్ వేరు, కాంగ్రెస్ సిలబస్ వేరు. ఇంకా నాలుగేండ్ల సమయం ఉన్నది. చిలిపి రాజకీయాలు పక్కన పెట్టి రాష్ట్రంపై దృష్టిపెడితే మంచిది.
-బుద్దా మురళి