అటవీభూముల విషయంలో కాంగ్రెస్ సర్కారు రెండు నాల్కల ధోరణి విస్మయం కలిగిస్తున్నది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని అటవీ ప్రాంతాన్ని చెరబట్టబోయి భంగపడిన సంగతి తెలిసిందే. అదే సర్కారు గిరిజన ప్రాంతాల్లోని భూములను అటవీ భూములంటూ నానా హంగామా చేస్తున్నది. అడవిబిడ్డలను కడగండ్లపాలు చేస్తున్నది. ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన్న ఘోర దురాగతాలు ఇన్నీఅన్నీ కావు. విద్యార్థులు, బుద్ధిజీవులు కలిసిపోరాడితే గానీ కేంద్ర వర్సిటీ భూములను కాపాడుకోవడం సాధ్యపడలేదు. కానీ, అమాయక గిరిజనుల విషయం అలా కాదు. కొండల్లో, కోనల్లో జీవనం సాగించే అడవి బిడ్డలు పోడు భూములను కాపాడుకునేందుకు నానా అగచాట్లు అనుభవించాల్సి వస్తున్నది.
పోలీసుల బూట్ల కింద తండాలు, గూడేలు నలిగిపోతున్నాయి. ప్రతిఘటిస్తే దయాదాక్షిణ్యాలు చూపకుండా, ఆడామగా అనే తేడా లేకుండా నరకం చూపిస్తున్నారు. నిన్నామొన్నటి లగచర్ల నుంచి రంగంపేట, కోసగుంపు వరకు ఇదే తతంగం. ‘ప్రాణాలైనా వదులుకుంటం కానీ భూములను వదులుకోబోమ’ని గిరిజనులు అంటే సర్కారు పోలీసు లాఠీని ప్రయోగించి దమనకాండకు దిగుతున్నది. వారు మన పౌరులు, మనం కాపాడాల్సిన పౌరులు అనే స్పృహ లేకుండా తరిమితరిమి కొడుతున్నది. మహిళలపై హింస ప్రయోగించడం సర్కారు కర్కశత్వానికి పరాకాష్ఠ. ఇది ఏ తరహా ప్రజాపాలన?
మొన్నటికిమొన్న రాజన్న సిరిసిల్లా జిల్లాలోని రంగంపల్లిలో పోడు భూములపైకి సర్కారు దండెత్తింది. ఎవుసమే జీవనాధారంగా బతికే రైతన్నల నోటికాడి ముద్ద ఎత్తగొట్టేందుకు సమకట్టింది. ఇంకా పట్టాలివ్వని పోడు భూములను అటవీ భూములంటూ వితండవాదం ముందుకుతెచ్చింది. ప్లాంటేషన్ పేరుతో లాగేసుకునేందుకు సర్కారు ఎత్తులు వేసింది. ఊరు ఊరంతా ఒక్కటై ఎదురుతిరగడంతో తోకముడిచింది. ఇక భద్రాద్రి జిల్లా కోసగుంపులో జరిగిన దారుణాలు లగచర్ల దురాగతాలను మరిపించేలా ఉన్నాయి.
శత్రు దేశంపైకి శతఘ్నులు తోలినట్టుగా అక్కడి భూములపైకి సర్కారు జేసీబీలతో దండెత్తింది. ఇదేమిటని ప్రశ్నించిన గిరిజన మహిళలతో ఖాకీలు వ్యవహరించిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. ఎప్పటినుంచో సాగు చేసుకుంటున్న భూముల్లోకి ఎందుకు వచ్చారని ప్రశ్నిస్తే నాటిన విత్తనాలు తవ్విపోస్తామంటూ రెచ్చిపోయారు. నిస్సహాయ మహిళలపై కీచకపర్వం సాగించడం పరమ దుర్మార్గం. 18 నెలల పాలనలో ఆదివాసీ గూడేలపై 22 దాడులు జరగడం దారుణం. ఇదేనా కాంగ్రెస్ తెస్తానన్న మార్పు?
నిజమే. ఇదివరకటి బీఆర్ఎస్ పాలన ఎక్కడ? ఇప్పటి కాంగ్రెస్ పాలన ఎక్కడ? ఎంత తేడా. ఎక్కడి నుంచి ఎక్కడకు పడిపోయామని ప్రజలు వాపోతున్నారు. సుదీర్ఘకాలంగా తండాలు, గూడేలు కోరుకున్న స్వయంపాలన అవకాశాలు కల్పిస్తూ వాటిని గ్రామ పంచాయతీలుగా అభివృద్ధి చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ‘మావ నాటే మావ రాజ్’ నినాదాన్ని నిజం చేసింది. జీవనాధారమైన పోడు భూముల సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తూ గిరిపుత్రులకు పట్టాలు పంపిణీ చేసి రికార్డు సృష్టించింది.
‘మావ జమీన్.. మావ పట్టా’ నినాదాన్ని సాకారం చేసి దేశానికే ఆదర్శంగా నిలిచింది. దేశవ్యాప్తంగా అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చాక ఏకకాలంలో నాలుగు లక్షల పైచిలుకు ఎకరాలకు పట్టాలు పంపిణీ చేయడం ఓ చరిత్ర. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి సీతక్క తల్లిదండ్రులు కూడా లబ్ధిదారుల్లో ఉండటం విశేషం. గిరిపుత్రులు ప్రశాంతంగా వ్యవసాయం చేసుకుని హాయిగా జీవిస్తారనే చల్లని తలంపుతో ఈ మార్పులు ప్రవేశపెట్టింది బీఆర్ఎస్ సర్కారు. అందుకు భిన్నంగా కాంగ్రెస్ సర్కారు గిరిజనులను వారికి ప్రాణసమానమైన భూమికి దూరం చేసేందుకు వికృత మార్గాలు అనుసరించడం దుర్మార్గం.