కింది కులాల వారిని ఎదగకుండా అణచివేసే ప్రయత్నం చరిత్రలో అడుగడుగునా కనబడుతుంది. ప్రజాస్వామ్య వ్యవస్థగా పేరుగాంచిన మన దేశంలోని జనాభాలో సగానికి పైగా ఉన్న వీరికి పాలనా అవకాశాలు దక్కే పరిస్థితులు ఇప్పటికీ ఏర్పడలేదు. ఈ విషయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ చరిత్రనే ఉన్నది. గతంలోకి వెళ్తే బాబా సాహెబ్ అంబేద్కర్‌ను రాజ్యాంగ నిర్మాణ కమిటీలోకి రాకుండా అడ్డుకున్నది కాంగ్రెసే. దళితుడైన బాబు జగ్జీవన్‌రామ్‌ను ప్రధానిని చేయకుండా బయటకు పంపింది ఆ పార్టీనే. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఒక్క దామోదరం సంజీవయ్య తప్ప దళిత, బహుజనులను సీఎం పదవి దరిదాపుల్లోకి కూడా రానివ్వలేదు. అది కూడా కొద్ది రోజులు. అలాంటి పార్టీ నుంచి రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డి బహుజన ఉద్ధారకుడిగా మాట్లాడటం వింతగా ఉన్నది.
నిజానికి నేటిదాకా ఎస్సీ, ఎస్టీ, బీసీలు సామాజికంగా, రాజకీయంగా ఏమైనా సాధించుకున్నారంటే అది కేవలం వారి పట్టుదల, పోరాట పటిమతోనే సాధ్యపడింది. అనివార్య పరిస్థితుల్లోనే ఆధిపత్య కులాలు బహుజనులకు కొద్దో గొప్పో అవకాశాలు ఇస్తున్నాయి. గత డబ్భు ఏండ్లుగా చదువుకు చేరువైన కింది కులాలు స్వశక్తితో, రిజర్వేషన్ల ఆసరాతో తెలివికి వస్తున్నాయి. విద్య వల్ల ఒనగూరిన మేధస్సుతో రాజ్యాంగపరంగా తమ హక్కుల కోసం గొంతెత్తుతున్నాయి. ఇక వీరిని మభ్యపెట్టలేమనే ఆలోచనతో రాజకీయ పార్టీలు బహుజనులకు కొంతలో కొంత అవకాశాలను కలిగిస్తున్నాయి. అయితే, ఈ మాత్రానికే చరిత్రను తిరగరాసినట్టుగా మన ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. 25వ తేదీన ఓయూలో హాస్టల్ భవనాలను ఆరంభించిన రేవంత్‌రెడ్డి ఠాగూర్ ఆడిటోరియంలో ప్రసంగించారు. ఆ సదస్సులో ‘తెలంగాణ విద్యారంగంలో రావాల్సిన మార్పులు, ప్రభుత్వ ప్రణాళిక’ అనే అంశంపై ఆయన మాట్లాడవలసి ఉన్నది. టాపిక్ ఎంతో ఉన్నతమైన, అవసరమైన విషయమే అయినా సీఎం మాట్లాడినదంతా తనను, తన పాలనను, తన ప్రభుత్వాన్ని కీర్తించుకున్నట్టుగా ఉన్నది. పైగా కొన్ని మాటలు సభికులకు మనస్తాపం కలిగించేలా కూడా ఉన్నాయి.
ఓయూ చరిత్రలో తొలిసారిగా ఒక దళితుడిని వైస్ ఛాన్సలర్‌గా తానే నియమించానని రేవంత్ పదే పదే తన ప్రసంగంలో ప్రస్తావించారు. తన పేరెత్తినప్పుడు వీసీ కుమార్ తప్పదన్నట్టు లేచి నిలబడ్డారు. ఆయనే కాకుండా కష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలు పొందిన బహుజనుల పేర్లు కూడా సీఎం ఆ సభావేదిక నుంచి ఉటంకించారు. సభికుల్లో ఉన్నవారు తమ పేరు ముఖ్యమంత్రి నోట రాగానే లేచి కృతజ్ఞతాపూర్వకంగా అభివాదం చేశారు. వారందరిని తానే పైకి తెచ్చాననే భావన ఆయన మాటల్లో స్ఫురించింది. పేదరికంలో పుట్టి పెరగడం వల్ల వీసీ, తదితర అధికారులకు వంద కోట్ల నిధులు అడగడానికి నోరు రావడం లేదని రేవంత్ అన్నారు. ఉన్నతస్థాయిలో ఉన్న వారిలో ఇంకా పేదరికపు వాసనలు పోలేదని వారిని ఎద్దేవా చేయడమే ఈ మాటల ఆంతర్యంగా భావించాలి. అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, లక్ష్మణ్‌కుమార్ మంత్రి కావడం వెనుక ముఖ్యమంత్రి హస్తం ఉండొచ్చు. ఒక విద్యావేత్త ఉన్నత పదవి వెనుక సొంత కృషినే ఎక్కువగా ఉంటుంది. నిజంగా ఒక బహుజనుడిని వీసీ చేయాలనీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఇన్నేండ్లు రెడ్డిలనే ఆ సీట్లో ఎందుకు కూర్చోబెట్టిందో సమాధానం చెప్పాలి. సందు దొరికినప్పుడల్లా ఒక కింది కులానికి చెందిన వ్యక్తి కులాన్ని నలుగురిలో ప్రస్తావించడానికి పైకులాల వారికి సంబరమేమో కానీ ఆ బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. విశ్వవిద్యాలయంలో విద్య, దాని అభ్యున్నతికి ప్రభుత్వం పాత్ర గురించి చెప్పకుండా సభలో ఉన్నవారి, లేనివారి కులాల ప్రస్తావన ముఖ్యమంత్రికి ఎందుకు? కోదండరాం ఎమ్మెల్సీ పదవిపై వేసిన కేసు సుప్రీంకోర్టులో తదుపరి విచారణలో ఉన్నది. తన ప్రసంగంలో ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ 15 రోజుల్లో ఆయనను మళ్లీ ఎమ్మెల్సీని చేస్తా, దానిపై ‘ఎవడు అడ్డమస్తడో చూస్తా’ అని సీఎం స్థాయిలో విద్యార్థుల సభలో అనడం భావ్యమేనా?
హాలులో ఉన్నవారందరూ పేదరికంలో మగ్గుతున్నట్టు, తన రాకతో అందరి బతుకులు మారిపోతాయన్నట్టు ఆయన మాట్లాడటం సబబు కాదు. అదేమీ ఎస్సీ, ఎస్టీ వసతి గృహం కాదు. అన్నివర్గాల వారు ఓయూలో ఉన్నారు. ఏ సామాజిక, ఆర్థిక నేపథ్యం ఉన్నవారైనా అందరూ ఓయూ విద్యార్థులే తమను తాము ఉద్ధరించుకొనే విద్వత్తు, ప్రభుత్వాలను మార్చేసే చైతన్యం వారిలో ఉన్నది. ఎన్ని కోట్లయినా మంజూరు చేస్తాననగానే చప్పట్లు, ఈలలు వేసిన విద్యార్థులే రేపు మాట తప్పితే ఊరుకొనే బాపతు కాదు.
ఉస్మానియా యూనివర్సిటీని ఆక్స్ఫర్డ్ స్టాన్ఫర్డ్ల స్థాయికి తీసుకువెళ్తానని మాట మాత్రంగా అనడం తేలికే. వాస్తవానికి ఓయూ కోర్సుల్లో ఎన్నో సంస్కరణలు అవసరం. ఆర్ట్స్ కాలేజీలో అందుబాటులో ఉన్న కామర్స్, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, జర్నలిజం కోర్సులు మినహా మిగతా వాటికి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయి. సైన్స్ కోర్సుల్లో పరిశోధనా సదుపాయాలను మెరుగుపరచవలసి ఉన్నది. ఓయూ ఇంజినీరింగ్ కాలేజీ ఆల్ ఇండియా ర్యాంక్ 61 నుంచి 73కు పడిపోయింది. క్యాంపస్‌లోని హాస్టళ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నట్లు వార్తలు వస్తుంటాయి. అధ్యాపకుల, ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోయింది. కాలేజీ భవనాలు, విద్యార్థుల వసతి గృహాలు, ఉద్యోగుల క్వార్టర్లు అన్ని కలిసి ఆ ఆవరణనే ఓ పురాతన భవనాల సముదాయంగా మిగిలిపోయింది. పూర్వవైభవం రావాలంటే నిధులతో పాటు ఎన్నో సంస్కరణలు అవసరం. నేటి కాలానికి సరిపడే కోర్సులను ప్రవేశపెట్టాలి. ప్రవేశం పొందిన ప్రతి విద్యార్థికి ఏదో కొలువు దొరికే చదువు, నైపుణ్యం అందాలి. ఒక్క పోలీసు లేకుండా ఆర్ట్స్ కాలేజీ ముందు మరో మీటింగ్ పెడతానన్న ముఖ్యమంత్రి అప్పుడు ఏమంటారో చూడాలి.