‘ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి’ అని అని పెద్దలు ఎప్పుడో అన్నారు. ఒడ్డున కూర్చుండి ఎన్నయినా మాట్లాడవచ్చును. పగ్గాలు చేతపుచ్చుకొని బండి నడిపించినప్పుడే ఆ మాటల పస ఏంటో తేలిపోతుంది. తెలంగాణ తొలి సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్ సాగు మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్ర సాధనకు అనితర సాధ్యమైన ఉద్యమాన్ని నిర్మించిన కేసీఆర్.. సమైక్య పాలకులు దండగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చేందుకు మరో మహోద్యమాన్ని చేపట్టారు. వ్యవసాయ స్థిరీకరణకు నడుం బిగించారు. అద్వితీయమైన చాకచక్యంతో కరెంట్ కష్టాలు తీర్చారు. ‘నీరు పల్లమెరుగు’ అనే నానుడిని మార్చి గోదారి గంగను కొండలెక్కించారు.
బీటలు వారిన తెలంగాణను పచ్చలహారంలా మలిచారు. మరో కోనసీమగా నిలిపారు. వరి దిగుబడిలో రికార్డులు బద్దలు కొట్టి, తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా ఆవిష్కరించారు. కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోళ్లు జరిపించారు. ఇదంతా నిరాటంకంగా జరుగుతున్న సమయంలో అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం చేశారు? ప్రభుత్వానికి వంకలు పెట్టారు. ‘అంతన్నాడింతన్నాడే’ అన్నట్టు గప్పాలు కొట్టారు. ప్రజల పొరపాటునో, గ్రహపాటునో ఇప్పుడు సీఎం. నాడు చెప్పిందేంటి? నేడు చేస్తున్నదేమిటి? అని ప్రజలు గమనిస్తున్నారు.
సాధకులు మాటలతో కాలక్షేపం చేయరు. ఇతరుల మీద రాళ్లు వేస్తూ స్వోత్కర్ష చేసుకోరు. కానీ పెనం మీద పేలపు గింజలా ఎగిరే రేవంత్‌రెడ్డికి ఇలాంటి ఉదాత్తమైన విషయాలు వర్తించవు. ‘అల్పుడెప్పుడు పల్కు ఆడంబరంగాను’ అన్నట్టు నోరు గోక్కునే మాటలు తప్ప తనకు మరేమీ చేతకాదు. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఇప్పుడు మాట మార్చారు. యూరియా సరఫరా చేయలేక ఏకంగా వరి పంటే వేయొద్దని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. అటు బడేభాయ్ని ఒప్పించే జామర్దా లేక కొనుగోళ్లు సాధ్యం కావని బీద అరుపులు అరుస్తున్నారా? ఇటీవల కేంద్రమంత్రిని కలిసినప్పుడు 50 వేల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ వడ్లు కొనబోమని తేల్చిచెప్పారని, కాబట్టి అంతకుమించి కొనే ధాన్యాన్ని ఏం చేయాలో చెప్పాలని రైతులను బేలగా అడుగుతున్నారు ముఖ్యమంత్రి.
కానీ ధాన్యం కొనాల్సిందేనని కేంద్రంతో కేసీఆర్ కొట్లాడిన ప్పుడు ఇదే రేవంత్‌రెడ్డి స్థాయిని మర్చిపోయి ఏమన్నారో గుర్తుచేసుకుందాం. ‘నరేంద్రమోదీనే వడ్లు కొనేదుంటే నువ్వేమన్నా బ్రోకర్ గాడివా? దళారీ పని చేస్తవా? రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవా? రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు రైతుల దగ్గర కొనాల్సింది నువ్వు. నీకు ఓటేసి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే, నువ్వు కొనకుండా మోడీ కొనాలె, బోడిగాడు కొనాలె అని మోకాలికి, బోడి గుండుకు లింకు పెట్టి మాట్లాడున్నడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. కాబట్టి, ఇప్పుడు కేంద్రం వడ్ల కొనుగోలుకు పరిమితి విధించింది అని చెప్తున్న రేవంత్‌రెడ్డిని ప్రజలు ఏ భాషలో నిలదీయాలి.
ఆనాడు ఆయన మాట్లాడిన మాటలనే తిరిగి ఆయనకే అప్పగిస్తే ఏం సమాధానం చెప్తారో మరి! అంటే ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎంతటి జిమ్మిక్కులకు పాల్పడిందో అర్థం చేసుకోవచ్చు. డిసెంబర్లో ఇవ్వాల్సిన రైతుభరోసా పైసలు ఇంకా ఇవ్వలేదు. కానీ రైతుభరోసా ఇచ్చినందుకు తనకు అభినందనలు తెలుపాలని అసెంబ్లీలో రేవంత్‌రెడ్డి అడుక్కుంటున్నారు. ఎందుకో..! ఇదేమి ఇచ్ఛంత్రమో!
కాంగ్రెస్ పాలకులు రైతులను ఒక్కతీరుగా మోసం చేయలేదు. ‘కేసీఆర్ రెండు పంటలకు మాత్రమే రైతుబంధు ఇస్తున్నారు, మూడో పంటకు ఎందుకు ఇవ్వరు?’ అంటూ హస్తం పార్టీ నేతలు నిలదీశారు. తాము గెలిస్తే భూమి ఉన్న రైతులకు, భూమిలేని కౌలు రైతులకు, ఉపాధి హామీ కూలీలకు మూడు క్యాటగిరీల్లో రైతుభరోసా ఇస్తామని చెప్పుకొచ్చారు. ‘ఇండ్లొ స్తే అండ్ల రాదు, అండ్లొస్తే ఇండ్ల రాదు, మొత్తానికి అందరికీ వస్తుంది’ అంటూ అతితెలివి ప్రదర్శించారు. అధికారంలోకి రాగానే చాలా విషయాల్లో దగాకు పాల్పడ్డారు. నమ్మించి గొంతుకోశారు. మూడో పంటకు రైతుబంధు ఎందుకు ఇవ్వరు అన్నటువంటి పెద్దమనిషి, అసలుకే ఎసరు పెడితే రైతులను నమ్మించి గొంతు కోయడం కాదా? ఇప్పుడు ఏకంగా యూరియా కూడా ఇవ్వలేమని అసమర్థతను చాటుకున్నారు.
ఆనాడు కేసీఆర్ ఆయిల్‌పామ్ పంటను ప్రోత్సహిస్తే.. అదొక వృథా అని ఘనత వహించిన కాంగ్రెస్ పెద్దలు విజ్ఞాన ప్రదర్శనలు చేశారరు. ఇప్పుడు పంట మార్పిడి చేయాల్సిందేనని చిలుక పలుకులు పలుకుతున్నారు. కాంగ్రెస్‌ను నమ్మినందుకు రైతులకు మన్నే గతి అయింది. ‘తియ్యటిమాటలకు తీర్థం పోతే నువ్వు గుల్లె, నేను సల్లె’ అన్నట్టు అయిపోయిం ది పరిస్థితి. ఈ మోసకారి పాలనను రైతన్నలు మరో రెండేండ్లు భరిస్తారా? సందేహమే!