అధికారం కోసం అడ్డగోలు హామీలిచ్చిన కాంగ్రెస్‌కు వాటి అమలు సాధ్యం కాదని ముందునుంచే తెలుసు. అందుకే ఆ అపకీర్తి నుంచి తప్పించుకునేందుకు ప్రత్యామ్నాయం సిద్ధంగా ఉంచుకుంది. హామీలు హళ్లికి హళ్లి, సున్నకు సున్నా అని చెప్పుకోకుండా ఉండేందుకు అన్నట్టుగా మహిళలకు మహాలక్ష్మి పేరిట ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమల్లోకి తెచ్చింది. అది కూడా ఆర్టీసీని బలిపశువును చేయడం ద్వారానే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఒక్క హామీ కూడా పోస్ట్ డేటెడ్ చెక్కు ఖాతాలోనే అమలవుతున్నది. ఇటీవలే ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్లు దాటిందని ప్రభుత్వం గొప్పగా టాంటాం వేసుకున్నది. కానీ, అందుకు సంబంధించి జీరో టికెట్ల భారం కింద ఆర్టీసీ నలిగిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఈ పథకం కింద ప్రభుత్వ బకాయిలు మొత్తం ఎంతనేది బ్రహ్మపదార్థంగా తయారైంది. దీనిని వెల్లడించేందుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడం అందుకు కారణం.
ఇదిలా ఉంటే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి, పీఎఫ్, సీసీఎస్, ఎస్ఆర్బీఎస్ నిధులు చెల్లించడానికి ఇటీవల ప్రతిష్ఠాత్మక గౌలిగూడ బస్టాండ్‌ను రూ.400 కోట్లకు తాకట్టు పెట్టినట్టు వార్తలు వెలువడటం గమనార్హం. ఆర్టీసీకి ఇవ్వాల్సిన గ్రాంట్లు, లోన్లను అనధికారికంగా సర్కారు రద్దు చేయడంతో కార్మికులకు బెనిఫిట్స్ చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ చెల్లింపుల కోసం ప్రభుత్వ బాండ్లను కూడా తాకట్టు పెడుతున్నట్టు తెలుస్తున్నది.
మొత్తంగా జీతాలు సకాలంలో ఇస్తే చాలన్న పరిస్థితి ప్రస్తుతం ఆర్టీసీలో నెలకొన్నది. అంతేకాకుండా ఉచిత ప్రయాణాల వల్ల పని ఒత్తిడి పెరిగిపోయి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. పండుగలు, పబ్బాలు అని లేకుండా అహోరాత్రులు పనిచేస్తూ ప్రజలకు నిరంతరం సేవలందించే ఆర్టీసీ కార్మికుల పని పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. 12 నుంచి 18 గంటలు పనిచేయించుకుంటూ స్పెషల్ ఆఫ్ గాని, ఓటీ గాని ఇవ్వడం లేదు. మరోవైపు రన్నింగ్ సమయం తగ్గిస్తూ, విశ్రాంతికీ కోతపెడుతూ యాజమాన్యం నరకం చూపిస్తున్నది. ఇంత విషమిచ్చి చంపమనేకాడికి పరిస్థితి రావడం దారుణం.
సిబ్బంది మరణాల్లో అత్యధికం పని ఒత్తిడి వల్లే కావడం బాధాకరం. అనేకమంది ఈ ఒత్తిళ్లు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. అయినా సంస్థలో పని ఒత్తిడి లేదని ప్రభుత్వం బుకాయిస్తున్నది. రకరకాల కారణాల వల్ల 20 వేల మంది సిబ్బంది తగ్గిపోయినా కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టనూ లేదు. ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వనూ లేదు.
ఉన్నవారికి చట్ట వ్యతిరేకంగా విపరీతమైన పనిభారాన్ని మోపి తీవ్ర వేధింపులకు గురిచేస్తూ చేస్తావా, చస్తావా? అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తగ్గిన ఉద్యోగాలను భర్తీ చేయకపోగా ఉన్నవారిపై విపరీత పనిభారం పెంచుతున్నారు. ప్రశ్నించినవారిని అన్యాయంగా, అక్రమంగా విధుల నుంచి తొలగిస్తున్నారు. ఇలా ప్రజలకు సేవలందించే ఈ గొప్ప సంస్థలో పనిచేసే కార్మికులు ఇలా దిగ్బంధనంలో చిక్కుకుని అష్టకష్టాలు పడుతుండటం దురదృష్టకరం. ప్రభుత్వ నిర్లక్ష్యం, చేతకానితనం ఈ పరిస్థితికి కారణమని చెప్పక తప్పదు.