58 ఏండ్ల సమైక్య పాలనలో తెలంగాణ తీవ్ర వివక్షకు గురైంది. ప్రజల జీవనాధారమైన వ్యవసాయం కునారిల్లింది. ఎవుసానికి అవసరమైన సాగునీరు, కరెంటు లేక, చెరువులు మరమ్మతులకు నోచుకోక రైతులు ఉరితాళ్లకు వేలాడారు. మొత్తంగా వలసలు, ఆత్మహత్యలతో విధ్వంసమైన తెలంగాణ తన అస్తిత్వాన్ని, ఉనికిని కోల్పోయింది.
పదమూడేండ్ల నిరంతర పోరాటం, వందలాది అమరుల ఆత్మ బలిదానం వల్ల సాకారమైన తెలంగాణ ప్రజలు దూరదృష్టితో ఆలోచించారు. అందుకే, ఉద్యమ నాయకుడికే ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్న కేసీఆర్ విధ్వంసానికి గురైన తెలంగాణకు కాపుగాశారు. ఒక్కో రంగాన్ని వృద్ధి చేస్తూ, స్వయం సమృద్ధి సాధించేలా చేస్తూ, 24 గంటల నాణ్యమైన కరెంటు, ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి ఇంటికి తాగునీరు, సంక్షేమ పథకాలు అందించి రాష్ర్టాన్ని అనతికాలంలోనే దేశంలో నంబర్ వన్‌గా తీర్చిదిద్దారు. బంగారు తెలంగాణ వైపు రాష్ర్టాన్ని పరుగులు పెట్టించారు. కానీ, కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీలను నమ్మి అత్యాశకు పోయిన ప్రజలు ఆ పార్టీకి అధికారం అప్పగించారు.
ప్రజలకు ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మోచేతికి బెల్లంపెట్టి నాకమంటున్నది. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రి అధికారిక నివాసం వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను ప్రమాణస్వీకారం చేయకముందే ధ్వంసం చేసిన రేవంత్‌రెడ్డి సర్కార్ రాష్ర్టాన్ని విధ్వంసం వైపు నడపడంలో మొదటి అడుగు వేసింది. తన సొంత ఇంటి నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్న రేవంత్.. నిత్యం తమకు అందుబాటులో ఉంటాడని ఆశించిన ప్రజలకు మొండిచెయ్యి చూపించారు.
కేసీఆర్‌పై ఉన్న అక్కసుతో తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ ఎండబెట్టారు. దురదృష్టవశాత్తూ మేడిగడ్డ బరాజ్‌లోని రెండు పిల్లర్లు కుంగిపోతే లక్ష కోట్ల రూపాయల నష్టం అంటూ కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారు. కాళేశ్వరం పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ పిల్లర్లకు మరమ్మతులు కూడా చేయించలేదు. పర్యవసానంగా లక్షల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలయ్యాయి. తెలంగాణ మళ్లీ కరువు కాటకాలతో అల్లలాడాలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధమైన కుట్రలకు పాల్పడుతున్నది.
దేశ సంపదను ప్రదాని మోదీ ఆప్తమిత్రుడైన అదానీ కొల్లగొడుతున్నారని రాహుల్‌గాంధీ గగ్గోలు పెడుతుంటే, రేవంత్ మాత్రం అదానీకి ఎర్రతివాచీ పరుస్తున్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో అదానీ సిమెంటు పరిశ్రమ ఏర్పాటుకు ఆగమేఘాల మీద అనుమతులిచ్చిన రేవంత్ సర్కార్ నల్గొండ జిల్లాను కాలుష్య కాసారంగా మార్చేందుకు కంకణం కట్టుకున్నది. అంతేకాదు, తెలంగాణలోని బొగ్గు గనులను ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టేందుకు చూస్తున్న బీజేపీకి కాంగ్రెస్ వంతపాడుతున్నది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన వేలంలో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొనడమే అందుకు నిదర్శనం. ఇది ముమ్మాటికీ తెలంగాణ ధ్వంస రచనకు పునాది వేయడమే. తెలంగాణలోని బొగ్గు గనులు ప్రైవేటు చేతిలోకి వెళ్లకుండా కేసీఆర్ సర్కార్ పదేండ్ల పాటు అడ్డుకున్నది. తెలంగాణ గనులను సింగరేణికే కేటాయించాలని పోరాడింది. కానీ, ఇప్పుడు రేవంత్ సర్కార్ వాటిని అప్పనంగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. దామగుండం అడవులను నేవీకి అప్పగించిన కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణ విధ్వంసం వైపు అడుగులేసింది. తద్వారా మూసీ జన్మస్థలాన్ని నాశనం చేసి ఆ నది గొంతు పిసికింది.
హైడ్రా కారణంగా హైదరాబాద్ అతలాకుతలమైంది. ఆర్ఆర్ ట్యాక్స్ కట్టని వారిని భయభ్రాంతులకు గురిచేసేందుకు దీన్ని తెరపైకి తీసుకొచ్చినట్టు ఆరోపణలున్నాయి. అంతేకాదు, రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. తన స్వార్థ ప్రయోజనాల కోసం విధ్వంసకాండ జరుపుతున్న కాంగ్రెస్ పాలకులను చరిత్ర ఎన్నటికీ క్షమించదు.
ఫార్మా సిటీ ఏర్పాటు కోసం కేసీఆర్ సర్కార్ 15 వేల ఎకరాలను ఎలాంటి వివాదం లేకుండా సేకరించింది. కానీ, రేవంత్ మాత్రం తన కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూర్చాలని 1500 ఎకరాల కోసం గిరిజనులపై దాష్టీకానికి దిగారు. పచ్చని పంట పొలాలు లాక్కునే ప్రయత్నంలో లగచర్ల రైతులపై ప్రదర్శించిన జులుం కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న జీవన విధ్వంసానికి పరాకాష్ఠ. రైతుబంధు పథకాన్ని బందుపెట్టిన రేవంత్ ప్రభుత్వం వ్యవసాయ రంగ విధ్వంసానికి పాల్పడుతున్నది. బతుకమ్మ చీరల పథకాన్ని రద్దు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో చేనేతరంగ విధ్వంసానికి పూనుకున్నది.
ప్రతి తెలంగాణ బిడ్డ చదువుకోవాలన్న గొప్ప ఆలోచనతో కేసీఆర్ ప్రారంభించిన గురుకులాలను గాలికొదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 48 మంది విద్యార్థుల చావుకు కారణమైంది. రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్యం, విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల విద్యావ్యవస్థ సర్వనాశనమైపోయింది. అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా హోంమంత్రిని నియమించలేదు. దీంతో తమ కష్టాలు చెప్పుకునేందుకు ఎవరూ లేక పోలీసులు రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేయాల్సి వస్తున్నది. అంతేకాదు, శాంతిభద్రతలు క్షీణించి హత్యలు, లైంగికదాడులు జరుగుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా గుళ్లు, గోపురాలపై దాడులు జరుగుతున్నాయి. మైనారిటీలపైనా దాడులు జరుగుతుండటం ఆందోళనకరం.
రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం, మూసీ, హైడ్రా కూల్చివేతల పుణ్యాన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది. దాంతో పెట్టుబడులు నిలిచిపోయాయి. ఏడాదిలో రూ.80 వేల కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్‌రెడ్డి ఒక్క కొత్త అభివృద్ధి పని చేయకపోవడం విడ్డూరం. తమ అస్మదీయ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చుకుంటూ, 15 శాతం కమీషన్లు వసూలు చేస్తూ రాష్ట్ర ఆర్థికరంగాన్ని ధ్వంసం చేసింది. కమీషన్లు, వసూళ్లకు భయపడుతున్న కాంట్రాక్టర్లు అభివృద్ధి పనులు చేసేందుకు ముందుకురావడం లేదు.
‘ఇందుగలడు అందులేడని సందేహం వలదు ఎందెందు వెతికినా అందందు గలడు’ అన్న రీతిలో ప్రతి రంగాన్ని రేవంత్ సర్కార్ విధ్వంసం చేసింది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలి. పూర్తిస్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించాలి. అంతేకాదు, కేసీఆర్, కేటీఆర్ ఫోబియా నుంచి బయటపడి ప్రతిపక్ష నాయకులు, వారి కుటుంబ సభ్యులను వేధించడం మానుకొని పరిపాలనపైనే పూర్తిగా దృష్టి సారించాలి. 6 గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయాలి. లేకపోతే రేవంత్ చేతిలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా కను మరుగు కావడం ఖాయం.