‘రానూ వస్త కాకుండా జేస్త’ అన్నట్టుంది రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ ధోరణి. ఒక్క చాన్స్ అన్నట్టుగా ఓటరును తికమక పెట్టి అధికారమైతే చేజిక్కించుకున్నారు. ఆపైన యథావిధిగా బోడ మల్లయ్య సామెతను లంకించుకున్నారు. సాగును బాగు చేయడం మీద ధ్యాస ఎటూ లేదు, కనీసం కొనుగోళ్లయినా సక్రమంగా చేస్తరా అంటే అదీ లేదు. రైతుబంధే ఇవ్వకపోవడంతో భరోసాను ఎవరూ అడిగే పరిస్థితి లేదు. రుణమాఫీని దారుణమైన రీతిలో చుట్టబెట్టేశారు. సర్కార్ నుంచి ఏ సాయమూ అందకపోయినా రైతులు నానా తంటాలు పడి పండించిన ధాన్యాన్ని మార్కెట్లకు తెస్తే ప్రభుత్వం కొనకుండా మీనమేషాలు లెక్కిస్తున్నది.
ఈలోగా అకాల వర్షాల వల్ల పలుచోట్ల పొలాల్లో, కల్లాల్లో, మార్కెట్లలో ధాన్యం తడిసిపోతున్నది. గుండెలవిసిపోతున్నవి. మంచి ధాన్యం కొనేందుకు చేతులు రాని సర్కార్ తడిసిన ధాన్యం కొంటుందా అనేది ప్రశ్న. అనేక చోట్ల మార్కెట్కు ధాన్యం తెచ్చి 20 రోజులుగా ఎదురుచూస్తున్నా కొనే నాథుడే కరువయ్యాడు. కొనుగోలు కేంద్రాలు కూడా అరకొరగానే ఏర్పాటుచేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 1008 కేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించగా అందులో ఐదో వంతు మాత్రమే ఇప్పటివరకు తెరవగలిగారు.
వరిపై ఇస్తామన్న రూ.500 బోనస్ కాంగ్రెస్ మార్కు బోగస్ అని తేలిపోయింది. 33 రకాలకే బోనస్ అని చెప్పిన తర్వాత మళ్లీ గింజ కొలతలు దేనికి? బోనస్ ఎగ్గొట్టేందుకే ఈ తతంగమని తెలుసుకోలేనంతటి అమాయకులా రైతులు? మరోవైపు మిల్లర్లతో బ్యాంకు గ్యారెంటీల విషయంలో సర్కారు పంచాయితీ ఇంకా తెగలేదు. రైస్ మిల్లుల కేటాయింపు జరగనందువల్లే ధాన్యం కొనుగోలు చేయలేపోతున్నామని అధికారులు, సర్కారు సడలింపు ఇస్తేనే ముందుకు వస్తామని మిల్లర్లు అంటున్నారు. మధ్యలో రైతులు నలిగిపోతున్నారు. ఇదంతా గమనిస్తే అసలు సర్కారుకు ధాన్యం కొనుగోలుపై ఓ విధా నం, ప్రణాళిక, కార్యాచరణ ఉందా? అనే సందేహాలు కలుగక మాన వు. పుణ్యకాలం గడిచిపోయిన తర్వాత సీఎం రేవంత్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష జరిపి, సమస్యల పరిష్కారానికి ఉమ్మడి జిల్లాలవారీగా ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్టు ప్రకటించడం హాస్యాస్పదం.
సమైక్య పాలకులు దండుగన్న వ్యవసాయాన్ని పండుగలా మార్చిన బీఆర్ఎస్ హయాంలో రైతే రాజులా వెలిగిపోయాడు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యంతో నీరసించిపోతున్నాడు. సాగుకు సమస్త సాయాలు అందించి, పండిన ధాన్యాన్ని చివరి గింజవరకు కొంటామని భరోసా ఇచ్చిన రోజులను రైతులు తలపోస్తున్నారు. పోయిన ఏడాది ఇదే సీజన్లో కేసీఆర్ ప్రభుత్వం నవంబర్ రెండో వారానికల్లా ఊరూరా కేంద్రాలు తెరచి 15 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది.
కాగా ఇప్పటివరకు రేవంత్ సర్కారు కొన్నది కేవలం 18 వేల టన్నులే. దీనికే నెలరోజులు పడితే పౌరసరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకున్న 80 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఇంకెన్నాళ్లు పడుతుంది? ఇంకేన్నేళ్లు పడుతుంది? అనేది ప్రశ్న. కాంగ్రెస్ పాలన ఘోర వైఫల్యానికి ఇది నిదర్శనం కాదా? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తన మొద్దు నిద్ర వదిలించుకొని కొనుగోళ్లపై దృష్టిపెడితే రైతుల నష్టాలు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది.