ఓ ఊరిలో పాముకాటుతో ఒకాయన చనిపోయాడట. కొందరు సావు కాడికిపోయి.. ‘పాము ఏడ కరిచింది? కన్ను కింద కరిచిందా.. ఇంకా నయం కన్ను మీద కరవలేదు. కన్నుపోతుండె’ అని వారు అన్నరట. మనిషే సచ్చిపోయిండు. ఇక పాము ఏడ కరిస్తే ఏంది? ఆడ కరిస్తే కన్ను పోతుండె.. ఈడ కరిస్తే కాలుపోతుండె అనడంలో అర్థం ఉందా? కేసీఆర్ అప్పట్లో చెప్పే ఈ కథ లెక్కనే ఉన్నది కాంగ్రెస్ పాలకుల పనితీరు. ఇంకా చెప్పాలంటే సంపినోడే సావుకాడికి పోయి సావు డప్పు కొట్టినట్టు ఉంది.
మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన నాటినుంచీ పాలమూరును నిర్లక్ష్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ. పక్కనే కృష్ణా నది ప్రవహిస్తున్నా సాగు నీళ్లు అందించలేని అసమర్థత కాంగ్రెస్ పాలకులది. ఉమ్మడి ఏపీని 40 ఏండ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రాజెక్టులు నిర్మించి పాలమూరుకు నీళ్లివ్వలేకపోయింది. ఏటికేడు ప్రాజెక్టుల నిర్మాణాన్ని సాగదీసే చరిత్ర ఉన్న హస్తం పాలకులు నేడు పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంలో మిగిలిన 10 శాతం పనులను కూడా పూర్తి చేయలేకపోతున్నారు.
నాటి కాంగ్రెస్ పాలకుల చేతకాని పాలనే పాలమూరుకు వలసల జిల్లా అనే పేరు తెచ్చిపెట్టింది. నేటి పాలకులు కూడా అదే బాటలో నడుస్తున్నారు. అంతేకాదు, ‘పాలమూరు మాదిగలు డప్పులు కొట్టాలె.. మనది మాదిగల జిల్లా’ అంటూ ముఖ్యమంత్రి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్ని జన్మలెత్తినా కాంగ్రెస్ పార్టీ పాలమూరుకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం లభించదు. సకలజనుల వనరులను సర్వనాశనం చేసి, జలహారతులిచ్చి ‘మా నీళ్లు తీసుకుపోండి’ అని నీళ్ల దోపిడీకి సహకరించిన పార్టీ మళ్లీ అందలమెక్కడం మన ఖర్మ. నాటి పరాయి పాలనలో జరిగిన విధ్వంసాన్ని రూపుమాపి, జల వనరులు సృష్టించిన మనీషి కేసీఆర్.
సాగు, తాగునీరు అందించడమే కాకుండా రైతుబంధు ఇచ్చి రైతన్నల మోములో చిరునవ్వులు పూయించింది కేసీఆర్ సర్కార్. కేసీఆర్ హయాంలో పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామంలో గ్రామ దేవతలను కొలుస్తూ దాదాపు 40 ఏండ్ల తర్వాత పెద్దావర పండుగను రైతాంగం ఘనంగా జరుపుకొన్నది. ఆ సంబరాలు ఎంతో కాలం ఉండవంటూ మార్పు అనే పేరుతో వచ్చిన కాంగ్రెస్ సకల విధ్వంసాలు సృష్టిస్తున్నది. ఆనాటి రోజులు తెస్తామని చెప్పినట్టే నాటి నిర్లక్ష్యపు పాలన మళ్లీ తీసుకొచ్చింది నయవంచక కాంగ్రెస్. తాను పాలమూరు బిడ్డనని, పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా తెస్తానని చెప్పి ఉన్న ప్రాజెక్టును పడావు పెట్టిన్రు. అంతేకాదు, నారాయణపేట- కొడంగల్ ప్రాజెక్టు పేరుతో సగం పాలమూరును మళ్లీ ఎడారి చేసే ప్రయత్నం చేస్తున్నారు.
రైతాంగాన్ని సకల విధాలుగా ధ్వంసం చేసి రైతు పండుగలంటూ హడావుడి చేస్తున్నారు. అసలెందుకు రైతు పండుగలు జరుపుతున్నట్టు? పచ్చబడ్డ పాలమూరును ఎండబెట్టినందుకా? జాతీయ హోదా తీసుకొస్తానని చెప్పి ప్రాజెక్టును పడావు పెట్టినందుకా? రైతు భరోసా ఇస్తనని చెప్పి కనీసం రైతుబంధు ఇవ్వలేకపోతున్నందుకా? బోనస్‌ను బోగస్ చేసినందుకా? పాలమూరు బిడ్డకు ఒకింత ప్రేమ ఎక్కువ ఉంటదని నమ్మిన ప్రజలను నట్టేట ముంచినందుకా?
పండుగలను దండుగ చేసి ప్రచార ఆర్భాటాల కోసం పండుగలు చేస్తే నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. పుట్టిన గడ్డకు సేవ చేసే అవకాశం కోసం చాలామంది ఎదురుచూస్తుంటారు. కానీ, పాలమూరు బిడ్డ మాత్రం వచ్చిన అవకాశాన్ని కృష్ణానది పాల్జేశారు. ఈ ఏడాదికాలంలో పాలమూరుకు ఒరిగిందేమిటి? ఇప్పటికైనా ప్రచార ఆర్భాటాలు మానుకొని, పాలనపై దృష్టిపెడితే కనీసం పాలమూరు ఆత్మగౌరవాన్ని నిలబెట్టినవారు అవుతారు.
-మేడిపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి
96151 46666