రాష్ట్రంలో ఉద్యోగ, పెన్షనర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారంలోకి రాగానే ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. అందుకనుగుణంగా మ్యానిఫెస్టోలో కరువు భత్యం, పీఆర్సీ, సీపీఎస్ రద్దు, 317 జీవో సవరణ చేస్తామని హామీలు ఇచ్చింది. అయితే దాదాపు ఏడాదిన్నర కావస్తున్నా ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు.
ప్రొఫెసర్ కోదండరాంతో పాటు ప్రణాళిక సంఘం చైర్మన్ చిన్నారెడ్డి ఉద్యోగుల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వానికి నివేదిస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వారికి తమ సమస్యలు నివేదించారు. కానీ, ఒక్క అడుగు ముందుకుపడకపోగా, 12 నెలలు గడిచినా ఎలాంటి పురోగతి లేదు.
ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిపారు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా సమస్యల పరిష్కారం కోసం కొంత సమయం ఇవ్వాలని, మార్చి 25 తర్వాత ఆర్థిక డిమాండ్లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇతర ఆర్థికేతర డిమాండ్లపై ఉద్యోగులతో చర్చలు జరుపడానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో పాటు ఇద్దరు మంత్రులతో కమిటీ వేస్తున్నట్టు ప్రకటించారు. కొత్తగా కమిటీలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న కేశవరావును సభ్యులుగా చేర్చారు. (కోదండరాం, చిన్నారెడ్డి ఇద్దరూ మాయమైపోయారు) అప్పటికీ పెండింగ్‌లో ఉన్న 3 కరువు భత్యాలకు ఒకటి మాత్రమే ఇస్తామని, సర్దుకోవాలని చెప్పి సమావేశం ముగించారు. అక్టోబర్ 24 నుంచి 6 నెలల పాటు మంత్రుల కమిటీ సమావేశం జరుగుతుందని ఎదురుచూసినా నిరాశే మిగిలింది.
ప్రాథమిక సభ్యుల ఒత్తిడితో 2025, మేలో ఉద్యోగుల జేఏసీ విస్తృత సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ దశలవారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలపై ముఖ్యమంత్రి స్పందించిన తీరు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నదని పెద్ద ఎత్తున ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం వద్ద డబ్బు లేదని, ‘నన్ను కోసుకొని తింటరా’ అని చెప్పి ప్రజా సంక్షేమ పథకాలేవి ఆపాలో ఉద్యోగులు చెప్పాలని కోరారు. ప్రజల నుంచి ఉద్యోగులను వేరుచేసే విధంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం దారుణం.
ఉద్యోగులు ఆందోళన చేయకుండా 2 గంటలు ఎక్కువ సేపు పనిచేసి నిరసన తెలపాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇతర దేశాల్లో ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారని ప్రకటించారు. కానీ, ‘ఈడీ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వంటి నాయకులను వేధిస్తున్నారని మంత్రులు, నాయకులు ధర్నా నిర్వహించారు. ధర్నా చేయకుండా 2 గంటలు పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిచేసి ఉండవచ్చు కదా’ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆర్థికపరమైన డిమాండ్ల కోసం పట్టుబడితే 1వ తేదీన వచ్చే జీతం కూడా రాదని తేల్చేశారు. ఎవరూ మాట్లాడకుండా ముందుగానే సంఘాల నోళ్లు మూయించడానికి ప్రయత్నించారు.
సీఎం మాట్లాడిన తీరుపై సర్వత్రా విమర్శల జడివాన కొనసాగింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగానే అధికారులతో కమిటీ ఏర్పాటు చేసినట్టు ప్రకటించి వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సహజంగానే ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీతో సమావేశం నిర్వహించి సమస్యలు మళ్లీ నివేదించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి మంత్రుల కమిటీ పరిష్కరించని సమస్యలను అధికారుల కమిటీ పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నదని చెప్పడం హాస్యాస్పదం. ‘ముఖ్యమంత్రి స్వయంగా బహిరంగంగా తాను పరిష్కరించలేనని స్పష్టం చేసిన తర్వాత.. అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడం వీలవుతుందా’ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. డిమాం డ్లు తీరకుండానే దశలవారీ ఆందోళన వాయిదా వేసుకొని అధికారుల కమిటీ నివేదిక కోసం ఉద్యోగ సంఘాలు ఎదురుచూడటం విషాదం.
మొత్తం 57 డిమాండ్లలో దాదాపు 45 ఆర్థికేతర అంశాలున్నాయని ఉద్యోగులు చెప్తున్నారు. దేశంలోనే 5 డీఏలు పెండింగ్ ఉన్న రెండు రాష్ర్టాల్లో తెలంగాణ ఉండటం ప్రభుత్వ వైఫల్యం కాదా? గత ప్రభుత్వంలో 3 డీఏలు పెండింగ్‌లో ఉండగా అందులో ఒక డీఏ ఇవ్వడానికి క్యాబినెట్ తీర్మానం చేసి ఎన్నికల కమిషన్ అనుమతి కోసం వేచి చూసింది.
కానీ, అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్నికల తర్వాత విడుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలిచ్చింది. గత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం ఎన్నికల కోడ్ వల్ల ఆగిపోయిన డీఏ ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. దీనికి తోడు గత 17 నెలల్లో 4 డీఏలు కేంద్రం విడుదల చేయడంతో మళ్లీ పెండింగ్‌లో 5 డీఏలు ఉన్నాయి. ప్రతి ఉద్యోగి తమ వేతనంలో నెలకు దాదాపు రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు కోల్పోతున్నారు. రెండవ ముఖ్య డిమాండ్ పీఆర్సీ అమలు. జూలై 23 నుంచి అమలు కావాల్సిన పీఆర్సీపై గత ప్రభుత్వం కమిటీ వేసింది. పీఆర్సీ ఆలస్యమైన పక్షంలో ఇవ్వవలసిన మధ్యంతర భృతి (ఐఆర్) 5 శాతం పీఆర్సీ ఏర్పాటుతో కేసీఆర్ ప్రకటించడం దేశ చరిత్రలో తొలిసారి. 17 నెలలుగా పీఆర్సీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు, సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి కనీసం కమిటీ కూడా వేయలేదు. 317 జీవో సవరిస్తామని చెప్పి చేతులు దులుపుకొన్నారు.
మరో ముఖ్యమైన సమస్య 3/24 నుంచి రిటైరైన ఉద్యోగులకు రావలసిన ప్రయోజనాలు జీవితం చివరి దశ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ మొత్తం కూడా ఇవ్వకుండా 12 వేల కుటుంబాలను వేధిస్తున్నది. ప్రతి నెల రిటైర్మెంట్ సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రూ.8 వేల కోట్ల మొత్తం బిల్లులు ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి. నెలకు రూ.300-400 కోట్లు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం కనీసం రూ.100 కోట్లు అయినా విడుదల చేయడం లేదు. చివరికి ఆరోగ్య కార్డుల విషయంలోనూ నిర్ణయం తీసుకోకపోవడం ఉద్యోగుల పట్ల ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తున్నది.
ఆశ, అంగన్వాడీ ఉద్యోగుల వేతనాలు పెంపు చేస్తామని చెప్పి మోసం చేశారని, ఉద్యోగులు డైరెక్టర్ కార్యాలయానికి వస్తే లాఠీఛార్జ్ చేయడమే కాకుండా అరెస్టులు చేసి ప్రజాపాలనకు రక్తంతో మెరుగులు దిద్దడం దుర్మార్గం కాదా? నెలలో 1వ తేదీ వేతనం ఇస్తున్నామని చెప్తున్నా వేల మంది ఉద్యోగులు నెలల తరబడి జీతాలు రాలేదనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోంగార్డులు, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్‌లలో పనిచేస్తున్న లక్షల మంది ఉద్యోగులు వేతనాలు నెలల తరబడి ఆలస్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రెండు పీఆర్సీలు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఉద్యోగులను సంతృప్తిపరిచే విధంగా వేతనాలను పెంచుతూ నిర్ణయం తీసుకోవడం చరిత్ర. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఫిట్మెంట్ ఇవ్వడం వంటి చర్యలు తీసుకోవడం ఉద్యోగుల పట్ల కేసీఆర్‌కు ఉన్న గౌరవాన్ని తెలిపింది. అంతేకాదు, కేసీఆర్ ప్రభుత్వం 2019 వరకు మొదటి తారీఖున జీతాలు ఇచ్చింది. కరోనా మహమ్మారి వల్ల, దేశవ్యాప్తంగా ఆర్థికమాంద్యం ఏర్పడి ఆలస్యమైంది తప్ప ఏనాడూ ఉద్యోగుల ప్రయోజనాలు ఇవ్వకుండా ఆపలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం పూర్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమన్వయ కమిటీ ఏర్పాటుచేసి రాజకీయాలకతీతంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడం సామాజిక బాధ్యతగా గుర్తించి ముందుకువస్తే కాంగ్రెస్ నాయకులు ఎదురుదాడి చేయడం అమానుషం.
ఉద్యోగ సంఘాలకు వ్యతిరేకంగా సమన్వయ కమిటీ అని కొందరు దుష్ప్రచారం చేయడం బాధాకరం. ఉద్యోగ సంఘాలు చేస్తున్న పోరాటం బలోపేతం చేయడానికే సమన్వయ కమిటీ సుదీర్ఘకాలంగా ఉద్యోగ సంఘాల నిర్మాణంలో పనిచేసి అద్భుతమైన పోరాటాలు చేసిన నాయకులపై బురద చల్లడం సరికాదు. టీఎన్జీవో ఉద్యోగుల సంఘం చరిత్రలో ఎన్నడూ ప్రభుత్వాలకు లొంగకుండా, ఉద్యోగుల ప్రయోజనాలకే పనిచేసిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.
అధికారుల కమిటీ నివేదిక ఇవ్వకుండానే 45 సమస్యలు పరిష్కరించామని అధికార పార్టీ విప్ ప్రకటించడం విడ్డూరం. రాజకీయంగా ఉద్యోగులను విభజించడానికి బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నిస్తున్నదని విమర్శించడం అర్థ రహితం. అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడం వల్ల ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ప్రజలు, ఉద్యోగుల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయడం సరికాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో వీరోచిత పోరాటం చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి హేయనీయం. ఈ ఆందోళనను దూరం చేయడానికి ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరపాలి. జూన్ 2 వరకు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేయాలి.
ఉద్యోగులు ఆందోళన చేయకుండా 2 గంటలు ఎక్కువ సేపు పనిచేసి నిరసన తెలపాలని ఉచిత సలహా ఇచ్చారు. ఇతర దేశాల్లో ఇదే పద్ధతి కొనసాగిస్తున్నారని ప్రకటించారు. కానీ, ‘ఈడీ కేసులో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ వంటి నాయకులను వేధిస్తున్నారని మంత్రులు, నాయకులు ధర్నా నిర్వహించారు. ధర్నా చేయకుండా 2 గంటలు పారిశుద్ధ్య కార్మికులు చేసే పనిచేసి ఉండవచ్చు కదా’ అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
-వ్యాసకర్త: పూర్వ ఉద్యోగ సంఘాల నాయకులు జి.దేవీప్రసాద్ రావు, 90006 33404