జనవరి 6న తన ప్రజెంటేషన్‌లో వెదిరె శ్రీరాం కృష్ణా జలాల ఒప్పందం విషయమై సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు జనవరి 2న రాష్ట్ర అసెంబ్లీలో చేసిన అబద్ధాలను, వక్రీకరణలను మక్కికి మక్కీగా పునశ్చరణ చేయడం ఆశ్చర్యం కలిగించింది. తెలంగాణకు 500 టీఎంసీలు రావలసి ఉండగా కేవలం 299 టీఎంసీలు మాత్రమే అడిగి తెలంగాణకు మరణ శాసనం రాశారని ఆరోపించాడు. పైగా 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులే కొనసాగుతాయన్న నిర్ణయాన్ని కేసీఆర్ అంగీకరించారని దారుణమైన ఆరోపణ చేశారు. అపెక్స్ కౌన్సిల్ మినిట్స్లోని పొంతన లేని పేరాలను కలిపి చదివి ఎంత వక్రీకరణ చేశారో జనవరి 3న తన్నీరు హరీశ్‌రావు సోదాహరణంగా వివరించి ఉన్నారు. ఆ తర్వాతనే వెదిరె మళ్లీ అదే తరహా వక్రీకరణకు పాల్పడి తన మేధో కుటిలత్వాన్ని (Intellectual Dishonesty) ప్రదర్శించుకున్నాడు. ఇప్పుడు కృష్ణాజలాల ఒప్పందాల్లో అసలు వాస్తవాలు ఏమిటి? వారి వక్రీకరణలు ఏమిటి? అన్నవి విశ్లేషిద్దాం.
కృష్ణాజలాల పంపిణీపై 2015 జూన్‌లో తెలంగాణ వాటాను 299 టీఎంసీలకు పరిమితం చేసి 512 టీఎంసీల నీటిని ఆంధ్రాకు అప్పగించే ఒప్పందం చేసుకోవడం ద్వారా కృష్ణా జలాల్లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణకు శాశ్వతంగా నష్టం కలుగజేసిందని దుష్ప్రచారం చేస్తున్నారు. 2015, జూన్ 18, 19 తేదీలలో జరిగిన అంతర్రాష్ట్ర సమావేశపు మినిట్స్‌లో రాసుకున్న అంశాలను పూర్తిగా చదువకుండానే, చదివినా కుట్రపూరితంగా, ఉద్దేశ్యపూరితంగా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారనుకోవాలి. వారు సాక్ష్యంగా చూపిస్తున్న సమావేశపు మినిట్స్‌లో నమోదైన వాక్యాలివి.
మొదటి పేజీలో పేరా 5లో ఈ విధంగా రాయడం జరిగింది. It was agreed in the meeting that the figures of share of the two states as mentioned list of projects dated 18.10.2013 (appended herewith as Annexure) may be followed as the working arrangementfor the current year only without prejudice to the rights of the two states about their entitlements which have been raised or to be raised before appropriate fora.
అదే పేజీలో పేరా 7లో ఈ విధంగా నమోదైంది. Thereafter, project related issues were discussed and following working arrangements for the water year 2015-2016 only were agreed as a temporary measure.
వీటికి అదనంగా చివరలో మరొకసారి ఇవే మాటలు నమోదైనాయి. చివరి పేజీలో పేరా 18లో వాక్యాలు ఈ విధంగా నమోదైనాయి. The entire arrangements agreed for the current year would be without any prejudice to the stand of both the States before any forum.
మినిట్స్లోని ఈ వాక్యాలను చదివి వారికి తెలంగాణ ప్రభుత్వం శాశ్వతంగా తెలంగాణ నీటి హక్కులను ఆంధ్రాకు ధారాదత్తం చేశారని ఎవరైనా భావిస్తే వారి ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానాన్ని శంకించవలకి వస్తుంది. లేదంటే కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి దుష్ప్రచారం చేస్తున్నారనుకోవాలి. కృష్ణాజలాల నీటి పంపిణీపై ఒక ఏడాది కోసం తాత్కాలిక Working Arrangement చేసుకోవడం జరిగింది తప్ప అది ఒప్పందం కానే కాదు. ఒప్పందానికి(Agreement), సర్దుబాటుకు (Arrangement) తేడా తెలియని మేధావులు వీరు.
ఈ సమావేశం జరిగేనాటికే ఏపీ విభజన చట్టం, 2014 ప్రకారం కృష్ణానది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) ఏర్పాటైంది. 2015-16 వాటర్ ఇయర్‌కు నీటి పంపిణీ చేయవలసిన బాధ్యత కృష్ణా బోర్డుదే. అదే విభజన చట్టం ప్రకారం 2014, మే 15న గెజిట్ నోటిఫికేషన్ జారీచేసి బ్రిజేశ్‌కుమార్ (కేడబ్ల్యూడీటీ-2) ట్రిబ్యునల్‌కు రెండేండ్ల పాటు పదవీకాలాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ట్రిబ్యునల్ విచారణను 2014 జూన్ నెల నుంచే ప్రారంభించింది. ట్రిబ్యునల్ ముందు హాజరుకావాలని తెలంగాణ సహా మూడు పరీవాహక రాష్ర్టాలకు 20.6.2014న నోటీసులు కూడా జారీచేసింది.
దీంతో రెండేండ్లలో తీర్పును వెలువరించే అవకాశం ఉన్నదని అందరిలో ఒక ఆశాభావం కలిగింది. నాటికి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జలయజ్ఞం కింద ప్రారంభించిన కృష్ణాబేసిన్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల ప్రాజెక్టులు ఇంకా నీటిని వినియోగించుకునే దశకు రాలేదు. అనేక సమస్యల కారణంగా ఉమ్మడి రాష్ట్రంలో అవి పెండింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకాగానే కరువుకు, వలసలకు, రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిన మహబూబ్‌నగర్ జిల్లా ప్రాజెక్టులను పూర్తిచేయడానికి కేసీఆర్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యాన్నిచ్చింది. భూ సేకరణ చేసింది. అటవీ సంబంధిత సమస్యలను పరిష్కరించింది.
రైల్వే, రోడ్డు క్రాసింగ్ సమస్యలను పరిష్కరించింది. నిధులు సమకూర్చింది. 2015 నాటికి ఆ ప్రాజెక్టుల పనులు ఇంకా పురోగతిలో ఉన్నాయి. పైన వివరించిన కారణాల రీత్యా 2015 జూన్ 18, 19 తేదీలలో రెండు రోజుల పాటు జరిగిన అంతర్రాష్ట్ర సమావేశంలో కృష్ణాజలాల నీటి పంపిణీపై ఒక ఏడాది కోసం తాత్కాలిక working arrangment చేసుకోవడం జరిగిగింది. పైన వివరించినట్టు ఆ మినిట్స్‌లో ట్రిబ్యునల్, కోర్టులు, ఇతర చట్టబద్ధ సంస్థల ముందు తెలంగాణ ప్రయోజనాలకు, నీటి హక్కులకు ఎటువంటి భంగం కలగకుండా ఉండేవిధంగా తెలంగాణ ప్రతినిధులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రభుత్వం పెట్టిన ప్రత్యేక శ్రద్ధ వల్ల 2018 నాటికి కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతలు పూర్తయి పాక్షికంగా నీటిని వినియోగించుకునే దశకు చేరుకున్నాయి. ఆర్డీఎస్ కాలువ కింద ఉన్న 58 వేల ఎకరాల స్థిరీకరణకు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కూడా 11 నెలల్లో పూర్తి చేయించింది కేసీఆర్ ప్రభుత్వం. కాబట్టి ఒక ఏడాది కోసం చేసుకున్న సర్దుబాటును వదిలేసి ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు కృష్ణా జలాల్లో 50 శాతం నీటిని వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు, కృష్ణా యాజమాన్య బోర్డుకు నిరంతరం నివేదిస్తూనే ఉన్నది తెలంగాణ ప్రభుత్వం.
2018, ఫిబ్రవరి 15న రాసిన లేఖతో మొదలైన 50 శాతం నీటి పోరాటం 2023 దాకా కొనసాగింది. ప్రతీ ఏడాది కృష్ణా బోర్డు సమావేశాల్లో తెలంగాణ ప్రతినిధులు ఈ అంశంపై గట్టిగా వాదించారు. అందుకు కృష్ణా బోర్డు సమావేశాల మినిట్స్, ఈ అంశంపై కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు, కృష్ణాబోర్డుకు రాసిన బోలెడన్ని లేఖలు సాక్ష్యంగా ఉన్నాయి. అయితే బోర్డు చైర్మన్ తన విచక్షణాధికారాలను వినియోగించి 34(తె): 66 (ఆం) నిష్పత్తినే కొనసాగించేవారు. చైర్మన్ ప్రయోగిస్తున్న ఈ విచాక్షణాధికారాన్ని ప్రశ్నిస్తూ అనేక సార్లు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖకు కూడా లేఖలు రాయడం జరిగింది. కేంద్రం ఈ విషయంలో తీసుకున్న చర్యలు శూన్యం.
2021లో జరిగిన కృష్ణా బోర్డు 14వ సమావేశంలో, 2022లో జరిగిన 16వ సమావేశంలో నాటి ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత్ కుమార్ కృష్ణా బేసిన్ పేరామీటర్లను దృష్టిలో ఉంచుకొని తెలంగాణకు కృష్ణా జలాల్లో 70.80 శాతం వాటా పొందడానికి అర్హత ఉన్నదని గట్టిగా వాదించారు. కృష్ణా బేసిన్లో అప్పటికే వినియోగంలో ఉన్న ఎస్ఎల్బీసీకి 40 టీఎంసీలు, కల్వకుర్తికి 40 టీఎంసీలు, నెట్టెంపాడుకు 25 టీఎంసీలు మొత్తం 105 టీఎంసీలు అవసరమని, ఈ నీటికి వాడుకోవడానికి అనుమతించాలని పట్టుబట్టారు. ట్రిబ్యునల్ తీర్పు వచ్చేదాకా 811 టీఎంసీలలో 405.5 టీఎంసీలను తెలంగాణ వాడుకుంటుందని బోర్డు చైర్మన్‌కు నివేదించారు. 2023లో జరిగిన బోర్డు 17వ సమావేశలో కూడా 50 శాతం నీటి వాటా కోసం గట్టిగా వాదించడమే కాదు, బోర్డు చైర్మన్ తన విచక్షణాధికారంతో నీటి పంపిణీ నిష్పత్తిని నిర్ధారించడాన్ని అడ్డుకున్నారు తెలంగాణ ప్రతినిధులు.
నీటి పంపిణీ నిష్పత్తి లేకుండానే 17వ కృష్ణా బోర్డు సమావేశపు మినిట్స్ జారీ అయ్యాయి. ఇది తెలంగాణ ప్రతినిధి బృందం సాధించిన గొప్ప విజయం. ఈ రకంగా కేసీఆర్ ప్రభుత్వంలో 50 శాతం తాత్కాలిక నీటి వాటా కోసం పోరాటం కొనసాగింది. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో జరిగిన 19వ బోర్డు సమావేశం మినిట్స్‌లో మళ్లీ 34(తె): 66 (ఆం) నిష్పత్తి దర్శనం ఇవ్వడం దౌర్భాగ్యం కాదా? కేసీఆర్ ప్రభుత్వం చేసిన ఈ పోరాటాన్ని వెదిరె గుర్తించకపోవడం విచారకరం.
అదే సమయంలో.. అంతర్రాష్ట్ర నదీజల వివాదాల పరిష్కార చట్టం, 1956, సెక్షన్ 3 ప్రకారం కృష్ణా జలాల పునఃపంపిణీ కోసం ట్రిబ్యునల్ వేయమని కేంద్ర ప్రభుత్వాన్ని నిరంతరం కోరుతూనే ఉన్నది కేసీఆర్ ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 42 రోజులకే 2014, జూలై 14న సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ అంశాన్ని కృష్ణా ట్రిబ్యూనల్ నివేదించాలని కోరడం జరిగింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రధాని మోదీకి, జలవనరుల మంత్రులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. 2016లో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా కేసీఆర్ ఈ అంశంపై గట్టిగా వాదించారు. ఆనాటి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ట్రిబ్యునల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం లేఖ రాసి ఏడాది గడిచినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో న్యాయం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో ఈ అంశంపై నిరంతరం సంప్రదింపులు జరిపింది. లేఖలు రాసింది.
విభజన చట్టం సెక్షన్ 89 ప్రకారం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతుండగా మళ్లీ ఈ సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ వేయమని ఎందుకు అడిగారు? అన్నది కీలకమైన ప్రశ్న. దానికి బలమైన కారణం ఉన్నది. విభజన చట్టం సెక్షన్ 89లో ప్రాజెక్టులవారీగా నీటి కేటాయింపులు చేయమని మాత్రమే అందులో ప్రస్తావించడం జరిగింది తప్ప కృష్ణా జలాల పునఃపంపిణీ ప్రస్తావన లేదు. ఇది చట్టం రూపొందించినప్పుడు జరిగిన తప్పిదం. అందులోనే సెక్షన్ 3 కింద పునఃపంపిణీ అంశాన్ని చేర్చి ఉంటే ఈపాటికి తెలంగాణ న్యాయమైన వాటా పొంది ఉండేది. 2013లో యూపీఏ ప్రభుత్వంలో చట్టం రూపకర్తలు ఆంధ్రా అనుకూల చట్టాన్ని తయారుచేశారు. సెక్షన్ 89 కింద విచారణ వల్ల తెలంగాణకు న్యాయం జరగదన్న స్పృహ కేసీఆర్‌కు మొదటినుంచి ఉండింది. కృష్ణా ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేశ్‌కుమార్ కూడా సెక్షన్ 89 కింద పునః పంపిణీ అనే అంశం తమ విచారణ పరిధిలో లేదని రెండుసార్లు రాత పూర్వకంగా తమ తీర్పుల్లో పేర్కొన్నారు.
ఇదే అభిప్రాయాలను విచారణ సందర్భంగా అనేకసార్లు వెల్లడిచేశారు కూడా. కాబట్టే సెక్షన్ 3 కింద జరిగే విచారణ ద్వారానే రెండు రాష్ర్టాల మధ్య కృష్ణా జలాల పునఃపంపిణీ న్యాయబద్ధంగా జరుగుతుందని భావించి నిరంతరం పోరాడింది. 2020, అక్టోబర్ 6న జరిగిన 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేసీఆర్ ఈ అంశంపై గట్టిగా పదే పదే పట్టుబడితే నాటి కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెఖావత్ ట్రిబ్యునల్ వేయడానికి అంగీకరించక తప్పలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును వాపస్ తీసుకోవాలని కోరారు. కేంద్ర మంత్రి హామీని పురస్కరించుకొని కేసు విత్‌డ్రా పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు 2021, అక్టోబర్‌లో విత్ డ్రా పిటిషన్ అనుమతించింది.
తదనంతరం రెండేండ్లు గడిచిన తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు ముందు 2023 అక్టోబర్‌లో సెక్షన్ 3 కింద అదనపు రెఫరెన్సెస్ను బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో కృష్ణా ట్రిబ్యునల్ కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిన పదేండ్ల పోరాటం ఫలించింది. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ రిఫరెన్సెస్‌ను వ్యతిరేకిస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసు వేసింది. ఈ కేసు విచారణ జరుగుతున్నది. అయితే ఏపీ కోరిన స్టేను మాత్రం మంజూరు చేయకపోవడం తెలంగాణకు ఒక ఊరట. ట్రిబ్యునల్ కూడా సెక్షన్ 3 కిందనే తొలుత విచారణ చేస్తామని ప్రకటించడం మరొక ఊరట. అదేవిధంగా సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్‌లో కొనసాగుతున్న విచారణ తుది దశకు చేరుకున్నది.
తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన Statement of Caseలో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఏపీ రాష్ర్టానికి కేటాయించిన 1005 టీఎంసీలలో (75 శాతం, 65 శాతం, 50 శాతం Dependability నీరు మొత్తం కలిపి) తెలంగాణ రాష్ర్టానికి 763 టీఎంసీల నీటిని కేటాయించాలని ట్రిబ్యునల్‌ను కోరింది.
ఇది అసలు వాస్తవమైతే 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ట్రిబ్యునల్ తీర్పు వచ్చేవరకు 299: 512 నిష్పత్తిలోనే కృష్ణాజలాల వినియోగం జరగాలని కేసీఆర్ అంగీకరించారని పచ్చి అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అడిషనల్ సెక్రెటరి దేబశ్రీ ముఖర్జీ అన్న మాటలు ఇవి. Ministry of Jal Shakti, Gol proposes that with regards to sharing of waters of River Krishna, until the Award of KWDT-ll is notified, award of KWDi-l shall be in force. The working arrangement as agreed by both the states shall continue… (పేరా 3.4 పేజీ 5).
కేసీఆర్ తన వంతు వచ్చినప్పుడు ఆయన చాలా స్పష్టంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఇట్లా నమోదైనాయి. Honble CM of Telangana commented on the agenda items and recalled that immediately after the formation of the State of Telangana, he had made a representation to the Ministry of water Resources on 14th July 2014 under Section-3 of ISRWD Act of 1956, asking for an equitable allocation of Krishna waters. He stated that Telangana is the youngest State and every State has a constitutional right to get a fair and equitable allocation of river waters. Telangana has requested to refer the matter to a Tribunal and Government of lndia should not have any reservation on this. Even after seven years of its formation, Telangana State is still waiting to know about its legitimate share of waters. After one year, they had approached the Supreme court. He stated that he has mentioned all these in his letter to Hon’ble Minister of Jal Shakti and had urged to include them in the agenda of the meeting… (పేరా 5.2, పేజీ 5)
ప్రాజెక్టులకు కృష్ణా బోర్డు పరిధిని నోటిఫై చేసే విషయంలో కేసీఆర్ తన అభిప్రాయాన్ని ఈ విధంగా వెల్లడించారు. He stated that the working arrangement between both the states is still continuing and until and unless water sharing is finalized by the Tribunal under section-3 of ISRWD Act of 1956, the question of notification of jurisdiction of Boards should not arise. He also stated that the tribunal matter is pending in supreme court and is sub-judice, hence on this account also the jurisdiction matter cannot be deliberated. (పేరా 5.3, పేజీ 5)
పైన పేర్కొన్న రెండు పేరాల్లో కేసీఆర్ 299: 512 నిష్పత్తిని ట్రిబ్యునల్ తీర్పు వెలువడేదాకా అంగీకరించినట్టు ఉందా? చివరలో సమావేశం తీసుకున్న నిర్ణయాలని పేరా 9.1లో 5 అంశాలుగా నమోదు చేశారు. వీటిలో ఎక్కడా కృష్ణాజలాల పంపిణీకి సంబంధించిన అంశమే చోటుచేసుకోలేదు. అడిషనల్ సెక్రెటరీ దేబశ్రీ ముఖర్జీ అన్న మాటలను కేసీఆర్‌కు ఆపాదించడం శ్రీరాం మేధో కుటిలత్వాని (Intellectual Dishonesty)కి నిదర్శనం కాదా? రాజకీయ నాయకులు సరే.. మరి ఈయన మేధావి కదా! ఈ రకమైన వక్రీకరణకు పాల్పడవచ్చునా?
కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిరంతర కృషి, పోరాట ఫలితమే సెక్షన్ 3 రిఫరెన్స్‌లు. ఇది విస్మరించరాని సత్యం. కేసీఆర్ ప్రభుత్వం ట్రిబ్యునల్ ముందు ఉంచిన డిమాండ్ 763 టీఎంసీలను సాధించడం ఎట్లా? అన్నదే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముందు, తెలంగాణ పౌర సమాజం ముందు ఉన్న అసలైన సవాలు.
ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రధాని మోదీకి, జలవనరుల మంత్రులకు వ్యక్తిగతంగా లేఖలు రాశారు. 2016లో జరిగిన మొదటి అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా కేసీఆర్ ఈ అంశంపై గట్టిగా వాదించారు. ఆనాటి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి ట్రిబ్యునల్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం లేఖ రాసి ఏడాది గడిచినా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో న్యాయం కోసం తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో కేసు ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వంతో ఈ అంశంపై నిరంతరం సంప్రదింపులు జరిపింది. లేఖలు రాసింది.
(వ్యాసకర్త: విశ్రాంత సూపరింటెండింగ్ ఇంజినీర్)
-శ్రీధర్‌రావు దేశ్‌పాండే ,94910 60585