కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఉద్యోగులపై కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తున్నది. అధికారంలోకి రావడానికి అసెంబ్లీ ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చింది. కానీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నేటివరకూ నెరవేర్చలేదు. ఆరు నెలల్లో ఉద్యోగులకు పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు, హెల్త్ కార్డుల మంజూరు, డీఏల విడుదల వంటి అనేక హామీలు మ్యానిఫెస్టోలో పెట్టింది. అధికారంలోకి రాగానే ఉన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలు తెచ్చి ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నది.
ప్రజలు, ఉద్యోగుల మధ్య వైరుధ్యం సృష్టించడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది. ఇందులో భాగంగానే ‘మీకు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే ఏ సంక్షేమ పథకాలు ఆపాలో చెప్పండి’ అని ముఖ్యమంత్రి ప్రజలపై ఎదురు దాడి చేశారు. దేశంలోనే 5 విడతల కరువుభత్యం బకాయి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డుల్లో నమోదైంది.
పీఆర్సీ ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వంగా గుర్తింపు పొందింది. రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. 2024 మార్చి నుంచి రిటైరైన ఉద్యోగులకు రావలసిన పెన్షన్ బకాయిలు, వారు దాచుకున్న సొమ్ము కూడా ఇవ్వకపోవడంతో ఇప్పటికే 80 మంది అనారోగ్య, మానసిక సమస్యలతో మరణించారు. ఈ పరిణామాన్ని తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించిన ఉద్యోగులకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో దక్కిన అవమానాలే.
24,782 మంది ఉద్యోగులకు రావలసిన రూ.10 వేల కోట్లు ఎప్పడు ఇస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొన్నది. ఇందుకోసం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని సీఎం హామీ ఇచ్చి, రెండేండ్లలో రూ.2 వేల కోట్లు కూడా విడుదల చేయలేదు.
కనీస వేతనం పొందని ఆశాలు, అంగన్వాడీలు, ఇతర శాఖల ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినా నెలనెలా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి నెలకొన్నది. అందరికీ ఒకటో తారీఖున వేతనాలు ఇస్తున్నామని గొప్పలు చెప్తున్న ప్రభుత్వ పెద్దలు 5 లక్షల మంది కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడు నెలల వరకు వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారు.
ఉద్యోగుల హెల్త్ కార్డుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాల నుంచి 1.5 శాతం కోత పెట్టి అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీని ప్రకారం.. ఏటా ఉద్యోగులు ఇచ్చే మొత్తం దాదాపు రూ.600 కోట్లు. ప్రభుత్వం కూడా రూ.600 కోట్లు విడుదల చేయాలి. ఉద్యోగుల జీతాల నుంచి ఠంచనుగా డబ్బు జమ అవుతుంది. కానీ ప్రభుత్వం రెగ్యులర్‌గా విడుదల చేస్తుందనే నమ్మకం లేదు.
తాము దాచుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్న ప్రభుత్వం రూ.600 కోట్లు విడుదల చేస్తామని అనడం ఉద్యోగులకు నమ్మశక్యంగా లేదు. అందుకే ఒకేదఫాలో రూ.600 కోట్లు విడుదల చేసి, హెల్త్‌కార్డులు జారీ చేసి, వైద్యం కోసం కార్యాచరణ సిద్ధం చేయాలి. ప్రభుత్వ నిధులు ఖర్చయిన వెంటనే ఉద్యోగుల జీతాల నుంచి కోత పెట్టి, మిగిలిన నిధులు సేకరించాలి, విధివిధానాలు ఎప్పటికీ వస్తాయో తెలియదు.
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో రెండుసార్లు పీఆర్సీ అమలు చేసింది. రాష్ట్ర సాధనలో 42 రోజుల సకల జనుల సమ్మె పాత్రను గుర్తించి 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. కరోనా సమయంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రెండవ పీఆర్సీ కింద 30 శాతం ఫిట్మెంట్ ప్రకటించి అమలు చేసింది. మూడవ పీఆర్సీ సకాలంలో వేసి 5 శాతం మధ్యంతర భృతి ఇచ్చింది. కానీ రేవంత్ ప్రభుత్వం రెండేండ్లు దాటినా ఒక్క రూపాయి కూడా పెంచలేదు.
ఈనెల 16న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత రెండు బడ్జెట్లలో ఉద్యోగులకు ఇచ్చిన హామీల అమలు కోసం ఎలాంటి కేటాయింపులు జరగలేదు. తాజా బడ్జెట్లో రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బకాయిల కోసం రూ.15 వేల కోట్లు, పీఆర్సీ అమలు కోసం రూ.15 వేల కోట్లు, పెండింగ్‌లో ఉన్న 5 డీఏల కోసం, రాబోయే 2 డీఏల కోసం రూ.20 వేల కోట్లు కేటాయించాలి. మొత్తం కలిపి రూ.50 వేల కోట్లు కేటాయించాలి. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు బడ్జెట్లో పద్దులు ఉండాలి. లేకుంటే ప్రజాప్రతిఘటన తప్పదు.
( వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
-దేవీప్రసాద్