కొరివితో తలగోక్కోవటం అంటే ఇదే. ఇప్పటికి అయినవి సాలినట్టు లేదు. విద్యుత్తు కొనుగోలులో ఏదో అయిందని గగ్గోలు పెట్టిన్రు. రిటైర్ అయిన ఓ జడ్జిని తీసుకొచ్చి విచారించుమన్నరు. మొదట్లో వాళ్లను వీళ్లను పిలిచి మాట్లాడిన్రు. రికార్డులు చేసుకున్నరు. పెద్దాయనను పిలవడానికి ముందే ఆయన మీడియా గొట్టాల ముందు కూసుని.. బ్రహ్మాండం బద్దలైందన్నట్టుగా పెద్ద అవినీతి జరిగిందన్నట్టుగా లెక్చర్ ఇచ్చిన్రు. పాపం ముఖ్యమంత్రి మీద ప్రేమతో తొందరపడి కోయిల ముందే కూసిందన్నట్టుగా చేయడంతో సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసి ఆ జడ్జిని తీసి పక్కన పెట్టేసింది. ఆయనకు జీతం బాగనే ముట్టింది లెండి! అప్పుడు రేవంత్ మీడియా ఒకటే గగ్గోలు.. సమర్థించుకోవడానికి నానా అవస్థలు.. సీన్ కట్ చేస్తే ఆ కేసు ఏమైపోయిందో ఎవరికీ తెల్వది.
కొన్నాళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని గగ్గోలు.. కూలేశ్వరం అన్నరు.. పర్యటనలు చేసిన్రు.. విచారణ కమిటీ వేసిన్రు. పీసీ ఘోష్ అనేటాయనను తెచ్చి విచారణ చేయమన్నరు. ఆయనకు కాయితాలియ్యలేదు. అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పలేదు. మీకవన్నీ ఎందుకు? మేం చెప్పింది రాసిచ్చి పోరాదన్నట్టుగా వ్యవహరించిన్రు. అప్పుడూ పెద్ద హంగామా చేసి సారును విచారణకు పిలిచిన్రు. పాపం ఘోష్ గోస అంతా ఇంతా కాదు. చివరకు పెద్దాయనను విచారణకు పిలిచిన్రు.. మమ అనిపించిన్రు. ఆ నివేదికను పెట్టుకొని అసెంబ్లీలో చేసిన హడావుడి కూడా అంతా ఇంతా కాదు. చివరకు ఆ నివేదిక కాస్తా చెత్త బుట్టలో పడేసిన్రు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వేలో కూడా కాళేశ్వరం కిందనే నీళ్లు పారినట్టు తేలిపాయె.
ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రేవంత్‌కు, ఆయన గురువుకు ఒకటే లక్ష్యం. తమను ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసీఆర్‌ను ఎట్లాగైనా ఇబ్బంది పెట్టడం. తమ బండారం బయటపడటంతో గురువు అమరావతికి పారిపోవడం.. శిష్యుడు జైలుకు పోవడంతో అహం దెబ్బతిన్నది. దీంతో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి తెరమీదకు తెచ్చిన్రు.
రెండేండ్ల నుంచి ఒకటే విచారణ.. ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ అన్నట్టుగా కొనసాగుతూనే ఉన్నది. ఏవైనా ఎన్నికల నోటిఫికే షన్లు రాగానే, వెంటనే విచారణ బెంచీలు శుభ్రమై వాటిమీద అధికారులు కూర్చొని ఒకళ్లిద్దరిని పిలిచి మాట్లాడి పంపిస్తున్నరు. ఆ తర్వాత మళ్లీ.. దుప్పటి కప్పుతరు. బాస్ ఎప్పుడు చెప్తే అప్పుడు మళ్లీ దులుపుతరు. గమ్మతేందంటే ఫోన్ ట్యాపిం గ్ కేసును హైకోర్టు కొట్టేసింది… సుప్రీం కోర్టూ కొట్టేసింది. కానీ పోలీసు విచారణ మాత్రం జరుగుతూనే ఉంటది. అదేమని అడిగితే.. అబ్బెబ్బే.. అది వేరే వాళ్లు పెట్టిన కేసు.. ఇది వేరేవాళ్లు పెట్టిన కేసు అంటరు.
ఒక రోజు హరీశ్‌రావు.. ఇంకోరోజు కేటీఆర్.. మరో రోజు సంతోష్‌కుమార్.. ఇప్పుడు కేసీఆర్.. లోపల ఏం జరుగుతదో హరీశ్‌రావు స్పష్టంగనే చెప్పిన్రు. గంట అడగాలి.. గంట ఫోన్లో మాట్లాడాలి. మళ్లీ గంట అడగాలి.. ఇంకో గంట ఫోన్లో మాట్లాడాలి.. లోపలంతా డొల్లే. బయటకు మాత్రం పెద్ద ఎత్తున లీకులు రావటం.. థంబ్ నెయిల్స్ పెట్టి ఏదో జరుగుతున్నట్టుగా మీడియాలో వార్తల పరంపర కొనసాగుతూనే ఉంటుంది.
ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక విచిత్రమైన కేసు. ఇందులో ఎలాంటి పసా లేదని సాక్షాత్తూ సుప్రీంకోర్టే చెప్పింది. అయినా కేసు విచారణ కొనసాగించడం అంటే.. రేవంత్ ఉద్దేశం ఏమిటో అర్థమవుతూనే ఉన్నది. ఇది ప్రభుత్వం చేస్తున్న విచారణ కాదు. ఇది కేవలం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన సొంత కక్ష తీర్చుకోవడం కోసం చేయిస్తున్న విచారణ. ఇందులో బీఆర్ఎస్ సీనియర్ నాయకులను ఇరికించడానికి ఒక దారి అయినా దొరుకకపోతుందా అని రెండేండ్లుగా పట్టుబట్టి వెతికిస్తున్నారు. ఇందుకోసం ఏకంగా సెక్రటేరియట్ కాకుండా, కమాండ్ కంట్రోల్ సెంటర్‌నే తన క్యాంప్ ఆఫీస్‌గా చేసుకున్నారు. అక్కడే ఉండి.. భూతద్దం పెట్టి మరీ వెతికిస్తున్నారు. ఒక్క సురాగ్ దొరికినా ఒక్క రోజైనా బీఆర్ఎస్ నాయకులను జైల్లో పెట్టాలన్నదే రేవంత్ టార్గెట్.
రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగానికి మరే పనీ లేదు. శాంతిభద్రతలను గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత లేకుండా చేశారు. హైదరాబాద్‌లో పట్టపగలు హత్యలు జరుగుతున్నా అడిగే నాథులు లేరు. రాష్ట్రంలో ఏ నేరం జరిగినా దానిపై విచారణ ఆనుపానులు కూడా లేవు. పోలీసులందరూ చేయాల్సిన పని కేవలం బీఆర్ఎస్ నేతలకు వ్యతిరేకంగా కేసులు పెట్టించడం.
ఇప్పుడు బీఆర్ఎస్ అధినేతకు నోటీసులిచ్చారు. గతంలో విద్యుత్తు కొనుగోళ్ల కేసు.. తర్వాత కాళేశ్వరం కేసు. ఇప్పుడు ట్యాపింగ్ కేసులో విచారణకు నోటీసులిచ్చారు. ఆ రెండు కేసుల్లో ఏం తేలిందో.. ఈ కేసులోనూ అదే తేలుతుంది. దీనివల్ల రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ను ఇబ్బంది పెడుతున్నానని అనుకుంటున్నారేమో కానీ, అంతకుమించి తనమీద, కాంగ్రెస్ మీద తీవ్రమైన వ్యతిరేకతను మోపుల కొద్దీ మూటలు కడుతున్నారు.
రెండున్నరేండ్ల నుంచి ఒకటే తంతు. ఒక పక్క మూడు రంగుల జెండా పాట.. మరోవైపు బీఆర్ఎస్పై నిందల ఆట.. రేవంత్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకుమించి చేసిందేమీ లేదు. ముందు వెనుక ఆలోచించేది లేదు.. తాను చేస్తున్న ఆరోపణల్లో పస ఉన్నదీ లేనిదీ అవసరం లేదు. తాను చెప్తున్నది అబద్ధమని తెలిసి కూడా మరింత గట్టిగా అరిస్తే నిజమైపోతుందేమోనన్న భ్రమ. తన మాటలను ప్రజలు నమ్మేస్తారేమనన్న చిత్త భ్రమ.
రేవంత్ కేవలం బీఆర్ఎస్ నాయకత్వంపైనే కక్ష కట్టారా అంటే అదీ లేదు కదా.. తన సొంత మంత్రుల మీద నిఘా పెట్టడం, కేసులు పెట్టడం.. తప్పుడు వార్తలు రాయించడం కూడా తెలంగాణ సమాజం చూస్తూనే ఉన్నది. ఈ పరిస్థితి కాంగ్రెస్ నాయకత్వానికి కూడా అర్థమైనట్టుంది. భస్మాసురుడిని తెచ్చిపెట్టుకున్నామని గ్రహించినట్టుంది. కానీ, ఇప్పుడు పరిస్థితిపూర్తిగా చేయి దాటిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చేసినా ఆ పార్టీని తెలంగాణ సమాజం భూస్థాపితం చేయడం మాత్రం తథ్యం. ఇప్పటికే ఈ దిశగా ప్రజలంతా కంకణం కట్టుకున్నరని ఢిల్లీ పెద్దలకకూ అవగాహన కలిగినట్టే ఉన్నది. ఇక కాళేశ్వర గంగ కాంగ్రెస్ పార్టీని ముంచెత్తడం ఖాయం.
-కోవెల సంతోష్ కుమార్