‘విద్య అనేది సింహపు పాల వంటిది. దాన్ని తాగినవాడు గర్జించకుండా ఉండలేడు’ అన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్లో విద్యారంగ అంశాలను గొప్పగా చెప్పారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపులను పరిశీలిస్తే నోటితో నవ్వి, నొసలుతో వెక్కిరించిన చందంగా ఉన్నది.
విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో స్వల్ప నిధులు కేటాయించింది. కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం విద్యార్థులను, నిరుద్యోగులను కేంద్రంగా చేసుకొని నాడు అలవికాని హామీలిచ్చింది. అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు అమలు చేయడంతో పాటు విద్యార్థులకు ప్రత్యేక హామీలు కూడా ఇచ్చింది.
విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చింది. కానీ, బడ్జెట్లో నేడు రూ.5 లక్షల భరోసా కార్డు ఊసే లేదు. మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి, నేడు నియోజకవర్గానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని చెప్పింది. అంతేకాదు, మొదటి విడతలో కొన్ని నియోజకవర్గాలకు మాత్రమే ఇస్తామని పరిమితం చేసింది. ప్రతి మండలానికి గురుకులం ఎస్సీ, ఎస్టీ రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మండలంలో నవోదయ విద్యాలయాలతో సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో ఒక కొత్త డిగ్రీ కళాశాల ఇస్తామన్నారు. ర్యాంక్‌తో సంబంధం లేకుండా రూ.3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న బీసీ కుటుంబాలకు మొత్తం ఫీజు రీ యింబర్స్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.
ఉన్నత చదువులు చదువుకునే విద్యార్థులందరికీ రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. కానీ, వాటికి తగ్గట్టుగా నిధుల కేటాయింపు మాత్రం జరుపలేదు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయిన విద్యార్థి అమరవీరులకు రూ.25,000 పింఛన్ ఇస్తామన్న హామీని కూడా మర్చిపోయింది. 18 ఏండ్లు పైబడి చదువుకునే విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు అందజేస్తామని మాట తప్పింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులు 10వ తరగతి పాసయితే రూ.10,000, ఇంటర్ పాసయితే రూ.15,000, గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తే రూ.25,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తిచేస్తే రూ.5 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చి నిన్నటి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం దారుణం. యూనివర్సిటీల్లో చదువుకునే విద్యార్థులకు రూ.10 వేల ఫెలోషిప్ ఇస్తామన్నారు. విదేశీ యూనివర్సిటీల్లో చదువుకునే ప్రతి ఎస్సీ, ఎస్టీ, విద్యార్థికి ఆర్థిక సహాయం అందజేస్తామన్నరు. కానీ నిధుల కేటాయింపు మాత్రం శూన్యం.
రాష్ట్ర బడ్జెట్ రూ.304,965 కోట్లతో ప్రవేశపెట్టి విద్యారంగానికి కేవలం రూ.23,108 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ కలల ప్రాజెక్టుగా చెప్పుకొంటున్న ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్’కు రూ.11,600 కోట్లు, వీరనారి చాకలి ఐలమ్మ మహిళ విశ్వవిద్యాయానికి రూ.550 కోట్లు మాత్రమే కేటాయించారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చి నేడు 7.57 శాతమే కేటాయించారు. ఈ అరకొర నిధులు ఉద్యోగుల జీతభత్యాలకు కూడా సరిపోవు. దీంతో వీరు మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రతి మండల కేంద్రానికో హైస్కూల్, జూనియర్ కాలేజీ, ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ, ప్రతి జిల్లా హెడ్‌క్వార్టర్‌లో పీజీ కాలేజీ నిర్మించడం ఎలా సాధ్యమవుతుందో రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాలి. రాష్ట్రంలో ఉన్న ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీలు ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ మహాత్మా గాంధీ, జేఎన్టీయూ తదితర యూనివర్సిటీలు నిధుల కొరతతో తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నాయి. కనీసం మౌలిక వసతులు లేవు. యూనివర్సిటీ విద్యార్థులు కూడా నిధుల లేమితో నాణ్యమైన భోజనం, వసతిని కోల్పోతున్నారు. కనీస వసతులైన మూత్రశాలలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అలాంటి వర్సిటీలకు నిధులు కేటాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రస్తావన కూడా చేయకపోవడం శోచనీయం. మెరుగైన రీతిలో ఫీజు రీ యింబర్స్‌మెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తన 16 నెలల పరిపాలన కాలంలో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దాదాపు రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ పెండింగ్‌లో ఉన్నాయి. ఇవి విడుదల కాక అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పాలవుతున్నారు. ఆర్థిక భారంతో చదువులకు దూరమవుతున్నారు. ఈ నిధులను విడుదల చేయడానికి ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేయాల్సిన ప్రభుత్వం అసలు వాటి ప్రస్తావనే చేయకపోవడం మోసపూరిత విధానం. ఈ నిధులతో విద్యారంగాన్ని ఏ విధంగా బాగు చేస్తారో స్పష్టం చేయాల్సిన బాధ్యత రేవంత్ సర్కార్‌పై ఉన్నది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చెప్పిన గొప్ప మాటలతో విద్యారంగ అంశాలను ప్రస్తావించినా ఆచరణలో మాత్రం వాటికనుగుణంగా లేవు. కాబట్టి, ప్రభుత్వ మాటలను ఎవరూ విశ్వసించరు. విద్యా రంగాన్ని కాపాడుకోవడానికి విద్యావేత్తలు, మేధావులు, విద్యార్థి సంఘాల నాయకులు, ప్రగతిశీల విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించి రేవంత్ సర్కార్ మెడలు వంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తద్వారా విద్యారంగాన్ని కాపాడుకుందాం.