ఎట్లొచ్చింది తెలంగాణ? ఎన్ని గుండెలు రగిలితే వచ్చింది తెలంగాణ? ఎన్ని గొంతులు పెగిలితే వచ్చింది తెలంగాణ? ఎందరు ఆత్మార్పణ చేసుకుంటే వచ్చింది తెలంగాణ? ఒకరా.. ఇద్దరా వందలాదిగా బిడ్డలు బలిపీఠం ఎక్కితే సాకారమయ్యింది తెలంగాణ. ఒక శ్రీకాంతాచారి తనువు మండేగోళమైతే వచ్చింది తెలంగాణ. ఒక యాదగిరిరెడ్డి ఉరికి వేలాడితే వచ్చింది తెలంగాణ. ఒక కేసీఆర్ చావునోట్లో తలపెట్టి ఆత్మార్పణకు సిద్ధమైతే తుదిఘట్టానికి చేరుకుంది తెలంగాణ.
ప్రజలందరి ఆకాంక్షకు సంకేతాలు ఈ త్యాగాలు. ఇది ఎన్నటికీ ఒడువని ముచ్చటే. మరోవైపు ఉద్యమకారులూ ఉన్నారు. కొందరు లాఠీదెబ్బలు తిన్నారు. మరికొందరు రైళ్లు ఆపి జైళ్లకు వెళ్లారు. ఇంకొందరు ఉద్యోగాలు కోల్పోయారు. కొందరు కళారూపాలను ఆయుధాలుగా మలుచుకుని గళమెత్తారు. ఇలా ఎవరి స్థాయిలో వారు పోరాటాలు చేశారు. అమరులను స్మరించినట్టుగానే వీరిని గుర్తించి గౌరవించడమూ ముఖ్యమే.
ఆనాడు స్వాతంత్య్రోద్యమంలో ప్రజలందరూ పాల్గొన్నారు. కానీ అందులో ఒకడుగు ముందుకు వేసిన వారిని స్వాతంత్య్ర సమరయోధులని పిలుస్తాం. వారికి తామ్రపత్రాలు ఇచ్చుకున్నాం. పింఛన్లు సమర్పించుకున్నాం. రజాకార్లపై ప్రజలందరూ పోరాడి ఉండవచ్చు. అందులో సాహసించిన వారికి, తెగింపుతో కొట్లాడిన వారికి ప్రత్యేక గౌరవం ఇచ్చుకున్నాం. ప్రజలందరూ తెలంగాణ కోరుకున్నారు.
కానీ ముందు నిలిచి పోరాటాలకు సిద్ధపడిన వారు తెలంగాణ ఉద్యమకారులు. అయితే గత ఎన్నికల సమయంలో అన్నివర్గాలను అడ్డగోలు హామీలతో ఊరించినట్టుగానే ఉద్యమకారులకూ కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించింది. అవసరం తీరగానే ఇప్పుడు కాంగ్రెస్ మార్క్ మొండిచెయ్యి చూపిస్తున్నది. లెక్కకు మిక్కిలిగా ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడానికి రాష్ట్ర సర్కార్ చేస్తున్న వాదాలు, వేస్తున్న వేషాలు హాస్యాస్పదంగా ఉన్నాయని చెప్పకతప్పదు.
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అభయహస్తం పేరిట విడుదల చేసిన మ్యానిఫెస్టోలో ఉద్యమకారులను హామీల వర్షంతో ఊరించింది కాంగ్రెస్. అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలకు ‘గుర్తింపు’ ఇస్తామన్నారు. ఆ గుర్తింపు ఏమిటో ఇంకా తేలలేదు. రూ.25 వేల గౌరవ పింఛన్ ఇస్తామన్నారు. ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేస్తామని అన్నారు. విద్యార్థులు, యువజనులను ఉద్దేశించి 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ, రూ.4 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని ఊరించారు.
ఈ హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటికి కూడా నెరవేరలేదు. ఇంక అదనంగా ఇచ్చిన హామీల్లో 250 గజాల స్థలం కూడా ఉన్నది. ఇవేవీ ఇచ్చేవా, చచ్చేవా అన్నట్టుగానే అప్పుడు ఇబ్బడిముబ్బడిగా హామీలు గుప్పించారు. నమ్మితే నట్టేట ముంచుతా అనే కాంగ్రెస్ తత్వం ప్రకారం మాట తప్పి మడమ తిప్పుతున్నది. ‘ఓడ ఎక్కేంత వరకు ఓడ మల్లయ్య, ఒడ్డుకు చేరిన తర్వాత బోడి మల్లయ్య’ అనేది కాంగ్రెస్ ఎప్పటి నుంచో అమలుచేస్తున్న ఎత్తుగడ. పాపం ఆ సంగతి తెలియని ఉద్యమకారులు బూటకపు హామీలను నమ్మడమే కాకుండా కాంగ్రెస్ తరఫున ప్రచారానికీ సిద్ధమయ్యారు.
ముఖ్యంగా నిరుద్యోగులను ప్రభావితం చేసేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. ఇప్పుడు అనుభవమయ్యింది. తత్వం బోధపడింది. ఇప్పుడు మాయదారి కాంగ్రెస్ మోసకారి హామీలపై నిలదీసేందుకు సిద్ధమయ్యారు. పోరుబాటకు పొలికేక వేస్తున్నారు. కాంగ్రెస్ మరోసారి ఉద్యమకారులను బురిడీ కొట్టించేందుకు నక్కజిత్తులతో అతితెలివిని ప్రదర్శిస్తున్నది. ప్రజలందరూ తెలంగాణ కోసం కొట్లాడిండ్రు.. మూడున్నర కోట్ల మందికి పింఛన్ ఇస్తమా? అని గడుసుగా ప్రశ్నించడం ఉద్యమాన్ని, ఉద్యమకారులను ఎగతాళి చేయడమే అవుతుంది.
ఉద్యమకారులకు స్థలాలు ఇచ్చుడు అయ్యే పనేనా? అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్న కాంగ్రెస్ పెద్దలకు ఈ విషయం హామీ ఇచ్చిన రోజున తెలియదా? రెండున్నరేండ్లలో తాము ఎవరిని ఉద్యమకారులుగా గుర్తిస్తున్నదో తేల్చని సర్కార్ ఇప్పుడు ఉన్నపళంగా మేల్కొని హామీలు నెరవేరుస్తుందని నమ్మడం కష్టమే. అందుకే పోరుబాట పట్టి పాలకుల మెడలు వంచేందుకు ఉద్యమకారులు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర సాధన పోరులో భుజం భుజం కలిపిన వారికి పోరాటం కొత్త కాదు గదా?