దేశంలోని మిగతా రాష్ర్టాలు భౌగోళికంగా ఏర్పడితే, తెలంగాణ మాత్రం భావోద్వేగాల పునాదుల మీద ఏర్పడింది. ఇక్కడ కదిలిస్తే అమరవీరుల తల్లుల కన్నీళ్లు కన్పిస్తాయి. నీళ్లు, నిధుల కోసం నాయకులు
కొట్లాడితే కొలువులే కొలమానంగా తొలి నుంచి తుది వరకు ఉద్యమంలో కొట్లాడింది విద్యార్థులే. తెలంగాణ వస్తే కోరుకున్న కొలువు వస్తదని, గొప్పగా బతుకుతామని తమ ప్రాణాలను పణంగా పెట్టారు.
ఆ త్యాగాల పునాదులపైనే తెలంగాణ పురుడుపోసుకున్నది.
తమది ప్రజా ప్రభుత్వమని, నిరుద్యోగుల బాధలు, సమస్యలు వినడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలని, జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి ఆశలు రేకెత్తించారు. ఇంకెన్నో హామీలివ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇక కొలువుల పండుగే అనుకున్నాం. కానీ, అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను నిలువునా మోసం చేసింది. ఏడాది తిరిగేలోగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఇప్పటికి ఇచ్చింది 12 వేల ఉద్యోగాలు మాత్రమే. అంటే 5 శాతం మాత్రమే భర్తీ చేసి 95 శాతం ఉద్యోగాల భర్తీని మర్చిపోయింది. ఇచ్చింది 12 వేల ఉద్యోగాలే అయినా 55 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటు.
ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనిపించడం లేదు. కనీసం ఆ వైపుగా కూడా అడుగులు పడటం లేదు. దీంతో నిరుద్యోగుల్లో రోజురోజుకు నమ్మకం సన్నగిల్లుతున్నది. పోటాపోటీగా జాబ్ క్యాలెండర్ కృతజ్ఞత సభలను పెట్టారు కానీ, దాని అమలు విషయాన్ని మర్చిపోయారు. నిరుద్యోగులంటే నిరక్షరాస్యులు కాదు.. వారిని ఎప్పటికీ మోసం చేయలేరు. రికార్డుస్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని, జాబ్ క్యాలెండర్ అని, అప్పులని, వర్గీకరణ అంటూ కావాలనే కాలయాపన చేస్తున్నారు. ఉద్యోగాల భర్తీ విషయంలో ఏపీలో అడ్డురాని ఎస్సీ వర్గీకరణ తెలంగాణలో ఎందుకు వస్తున్నది.
ప్రభుత్వ అప్పులకు, ఉద్యోగాలకు ముడిపెట్టడం ఎంతమాత్రమూ సబబు కాదు. కాంగ్రెస్ వస్తే కొలువులు వస్తాయని నిరుద్యోగులు ఎంతగానో కష్టపడ్డారు. కాబట్టి మ్యానిఫెస్టోలో పెట్టినట్టుగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి. రిటైర్మెంట్ వయసును ప్రభుత్వం పెంచబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టు అవుతుంది. ఏండ్లకేండ్లు కుటుంబాలకు దూరంగా, అర్ధాకలితో, రూ. 5 భోజనం చేస్తూ, అగ్గిపెట్టెలాంటి గదుల్లో ఉంటూ, అప్పులు చేసి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఇది కోలుకోలేని దెబ్బ అవుతుంది. ఆర్థిక ఇబ్బందుల నెపంతో తాత్కాలిక ఉపశమనం కోసం నిరుద్యోగుల కలలను సమాధి చేయడం తగదు. ఉద్యోగాల భర్తీని, జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే త్వరలో జరిగే కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఊరూరా తిరిగి ప్రచారం చేస్తాం. కాంగ్రెస్ చేసిన మోసాలను ప్రజలకు వివరిస్తాం. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో బతకాల్సిన ఉద్యోగులను రిటైర్మెంట్ వయసు పెంచి బలవంతంగా వారిని ఉద్యోగంలో కొనసాగించాల్సిన అవసరం ఏమొచ్చింది. రిటైర్మెంట్ వయసు పెంచాలని వారేమీ ధర్నాలు, నిరసనలు చేయలేదు కదా. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచితే దాదాపు 50 వేల ఉద్యోగాలను నిరుద్యోగులు కోల్పోతారు.
స్థానికేతరులు అయిన ఆంధ్రావారికి, కొన్ని వర్గాల ప్రజల మెప్పు కోసం ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా జీవో 29ను తీసుకొచ్చింది. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ప్రాధాన్యం ఇవ్వకుండా మెరిట్‌కే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. దీపేందర్ యాదవ్, కిషోర్ చౌదరి, సౌరవ్ యాదవ్, ఇందిరా సహానీ కేసుల్లో అన్ని దశల్లోనూ (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ) రిజర్వేషన్లు పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ కోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తున్నది. ఇక, జీవో 46 ఇంకో లొల్లి. అధికారంలోకి వచ్చాక జీవో 46ని రద్దు చేస్తామని కాంగ్రెస్ హామీనిచ్చింది. ఇంతవరకు ఆ పని చేయకపోగా, దీనిపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తున్న బాధితులకు సాయం చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. ఇది ప్రభుత్వ ద్వంద్వనీతికి నిదర్శనం.
ఎప్పటికప్పుడు ఖాళీ అయ్యే ప్రతి ఉద్యోగమూ ముందు రోజే భర్తీ అయ్యేలా ప్రభుత్వం కృషి చేయాలి. ప్రభుత్వ ఉద్యోగాలు పరిమితంగా ఉంటాయి కాబట్టి ప్రైవేటు ఉద్యోగాలపైనా ప్రభుత్వం దృష్టిసారించాలి. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించాలి. తెలంగాణ ఏర్పడిందే నియామకాల కోసం కాబట్టి ప్రైవేటు ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకు దక్కేలా ప్రభుత్వం చట్టం తీసుకురావాలి.
పరిశ్రమలకు అవసరమైన సాంకేతిక నైపుణ్యంపై ప్రభుత్వమే శిక్షణ ఇవ్వాలి. ప్రతి మండలంలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. పరిశ్రమలు కోరుకుంటున్నట్టు, పారిశ్రామిక అవసరాలు తీర్చేలా విద్యా వ్యవస్థని సమూలంగా మార్చాలి. వ్యాపారాలు చేయాలనుకునే తెలంగాణ బిడ్డలకు ఉదారంగా రుణాలు ఇవ్వాలి. అప్పుడే కొలువుల తెలంగాణ అవతరిస్తుంది.
– శ్రవణ్ కుమార్, నిరుద్యోగి