‘తలాపునా పారుతుంది గోదారీ.. నీ చేను నీ చెలుక ఎడారి’ అంటూ తెలంగాణ ఉద్యమంలో పాటలు కైగట్టి పాడుకున్నాం. నీళ్ల విషయంలో తెలంగాణ పడుతున్న గోసను చూసి దేశమే కన్నీళ్లు పెట్టుకున్నది. నీళ్ల కోసమే రణం చేసిన మన తెలంగాణ 2014 కంటే ముందు ఎడారి ప్రాంతమే. ఉద్యమ నేతగా కేసీఆర్ నీళ్ల కోసం తెలంగాణ జనం పడుతున్న అరిగోసను చూసి ఎక్కెక్కి ఏడ్చిన సందర్భాలున్నాయి. అట్లాంటి సందర్భం నుంచి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నీళ్ల కోసం అహర్నిశలు కృషిచేశారు. గోదావరి నీళ్లను ఎత్తిపోయడమే తెలంగాణకు ఉన్న ఏకైక మార్గమని దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకాన్ని రూ.94 వేల కోట్ల వ్యయంతో, 90 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలనే మొక్కవోని దీక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారు. యావత్ ప్రపంచాన్నే తెలంగాణ దిక్కు తిప్పి ఔరా అనిపించేలా చేశారు. ఇంజినీరింగ్ అద్భుతాన్ని సృష్టించిన కేసీఆర్ ప్రభుత్వం దాని ఫలాలను సంపూర్ణంగా రైతులకు అందించించడంలో ఏ మేరకు సఫలీకృతమైందంటే ‘కాళేశ్వరం ప్రాజెక్టుకు ముందు తెలంగాణ, కాళేశ్వరం ప్రాజెక్టు తర్వాత తెలంగాణ’ అనేవిధంగా వ్యవసాయ రంగంలో తెలంగాణను దేశంలోనే శిఖరస్థాయికి చేర్చింది.
తమ్మిడిహట్టి అసాధ్యమనే మేడిగడ్డకు రూపకల్పన: తమ్మిడిహట్టి వద్ద గోదావరిలో వరద లేనందున, ఉన్న పైరాష్ర్టాలు వినియోగించుకుంటున్న నీటి లభ్యత భవిష్యత్తులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని నాటి కేంద్ర జల వనరుల సంఘం రాష్ర్టానికి సూచించింది. నాటి కేసీఆర్ ప్రభుత్వం గోదావరిలో ఉన్న నీటి లభ్యతను దృష్టిలో పెట్టుకొని 240 టీఎంసీల నీరు లభించే మేడిగడ్డ వద్ద నాడు ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించింది. మళ్లీ మహారాష్ట్ర ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 152 మీటర్ల ఎత్తులో ససేమిరా అన్నది. ఇది చరిత్ర. దీన్ని కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ స్వలాభం కోసం వాడుకొని ప్రజలను, మేధావులను సైతం తప్పుదోవ పట్టించి ప్రయోజనం పొందింది.
తెలంగాణ సమాజం ఆదినుంచి ఎదుర్కొంటున్న నీళ్లు, కరెంటు సమస్యలను అధిగమించడంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన కృషిపై కక్షగట్టి విచారణ పేరుతో న్యాయ కమిషన్లను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సందు దొరికితే కేసీఆర్‌ను బద్నాం చేయాలనే ప్రయత్నం చేస్తున్నది. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టుపై మేలో జస్టిస్ పీసీ ఘోష్ అధ్యక్షతన కమిషన్ ఏర్పాటుచేసింది. విచారణలో భాగంగా కమిషన్ కుంగిన పిల్లర్లను రిపేర్ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఒక్కసారి కంగుతిన్న కాంగ్రెస్ అంతర్మథనంలో పడిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్ కుట్రలను తట్టుకుని తెలంగాణ ప్రజల కోసం మళ్లీ నిలబడి ప్రస్తుతం ఒళ్లంతా పులకరించేలా 10 లక్షల క్యూసెక్కులో వరద పరవళ్లు తొక్కుతూ ప్రవహించడం చూస్తుంటే అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ పునాదులకు బీటలు పారక తప్పదు. తాగు, సాగునీళ్లకు దశాబ్దాలుగా గోస పడుతున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ఆయుష్షు అందిస్తూ ప్రాణం పెట్టి కట్టుకున్న మహోత్తర మానవ నిర్మాణమే కాళేశ్వరం ప్రాజెక్టు. బీటలు వారిన బీడు భూములకు, దాహార్తిని తీర్చిన గొంతులకు, తుమ్మలు మొలిచిన చెరువులకు, చేపలు పట్టిన ముదిరాజులకు, వ్యవసాయం చేసే రైతన్నలకు, అడుగంటిన బోరు బావులకు ఎరుక కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్ర. ఓట్ల కోసం, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని నాటి నుంచి నేటివరకు ఢిల్లీ పెద్దలకు, ఆంధ్రా పెత్తందార్లకు తాకట్టు పెట్టిన నేటి కాంగ్రెస్ పాలకులకు ఏం ఎరుక కాళేశ్వరం ప్రాజెక్టు విలువ. కాళేశ్వర ముక్తేశ్వరుని సాక్షిగా నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టు ఎల్లవేళలా తెలంగాణకు వరప్రదాయినిగానే నిలుస్తుంది.
– పిన్నింటి విజయ్‌కుమార్ 90520 39109