ఆడలేక మద్దెల ఓడు. ఇది పాత సామెత. ఆడలేక బీ టీమ్. ఇది కొత్త నాటకం. ఏ టీమ్‌తో అయితే మనకు ఆడాలంటే భయమేస్తదో ఆ టీమ్‌ను బీ టీమ్ అనేస్తే అదో ఆనందం. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలు ఈ మద్దెల ఓడు డ్రామా కలిసి ఆడుతున్నాయి. ఈ రెండు పార్టీలు బీఆర్ఎస్ను మరో పార్టీకి బీ టీమ్ అనడం వెనుక కేవలం ఆడలేని తనమే ఉన్నది. ఆడితే ఓడిపోతామనే భయం ఉన్నది.
ఎవరు ఎవరికి ఏ టీం? ఎవరు ఎవరికి బీ టీం? ఇది ఇటీవల కాలంలో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ చేస్తున్న చెత్త సూత్రీకరణలకు నిదర్శనంగా నిలుస్తుంది. నాలుగు కోట్ల మంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న బీఆర్ఎస్కు ఏ, బీ, సీ, డీ టీములక్కర్లేదు. రెండుసార్లు ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలియజేసి బీఆర్ఎస్కే పట్టం గట్టారు. గడిచిన తొమ్మిదేండ్లుగా అనూహ్యమైన ప్రగతి దేశానికే దిక్సూచిగా మారింది. మూడోసారి కూడా ముచ్చటగా బీఆర్ఎస్కు ప్రజలు పట్టాభిషేకం చేస్తారు. రాజకీయంగా ప్రతిపక్షాల్లో ఉన్నవారు గట్టి విమర్శలు చేయవచ్చు. కానీ, చెత్త విమర్శలే చేయకూడదు. చేసే విమర్శలు శాస్త్రీయంగా ఉండాలి. అశాస్త్రీయాలతోటి, అబద్ధాలతోటి, అభూత కల్పనలతోటి చేసే విమర్శలను ప్రజలు స్వీకరించరని గుర్తించనంతకాలం ఆ పార్టీల స్థానాలు అంతకంటే పెరుగవు. ఒక రాజకీయ పార్టీ ఒక విమర్శ చేస్తున్నదంటే ఆ విమర్శ నిజమైనదే అయితే ప్రజలందరూ తప్పక ఆలోచిస్తారు. ప్రతిరోజు అబద్ధాలనే ఊదరగొడుతూ విమర్శలు చేసుకుంటూ పోతే వాటిని చూసి జనం నవ్వుకుంటారు.
కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించిన తర్వాత కూడా రాష్ట్ర పునర్నిర్మాణంలో అలుపెరుగని కృషితో దేశానికే తెలంగాణను నమూనాగా నిలిపారు. కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టి పదేండ్లు గడిచిపోయాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది చెత్త విమర్శలతో కొందరు అడ్డదిడ్డంగా చెత్త భాషలో, చెత్తచెత్తగా మాట్టాడుతున్నారు. 75 ఏండ్ల స్వతంత్ర భారతాన్ని తాకట్టు భారతంగా, పరాధీన భారతంగా మార్చేసిన యూపీఏలు, ఎన్డీయేలు దేశాన్ని ఏం చేశారో ఆలోచనాపరులందరికీ తెలుసు. కాళేశ్వర జలాలతో ప్రవహిస్తున్న గంగమ్మ సాక్షిగా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరినుంచి మా నడిగూడెం చివరి గ్రామం దాకా నీళ్లందుతున్న తీరును ఎవరు కాదనగలరు? ఈ ప్రవహించే జలాలే ఎవరిది గెలుపో తేల్చిచెప్తాయి. దేశంలో గుణాత్మకమైన మార్పు రావాలని ఆశిస్తూ ముందుకుసాగుతున్న బీఆర్ఎస్ అందుకు నమూనాగా తెలంగాణ అభివృద్ధిని నిలబెట్టి చూపింది. శతాబ్దంలో జరగని అభివృద్ధి దశాబ్దంలో జరిగిందన్నది సత్యం. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత గత తొమ్మిదేండ్లుగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలపై విమర్శలు చేయడం తప్ప ప్రభుత్వ పథకాల్లో ఎక్కడ తప్పు జరుగుతుందా అని రంధ్రాన్వేషణ చేయడం తప్ప ఈ ప్రతిపక్షాలు కొత్తగా చేసిందేమీ లేదు. గత పదేండ్లుగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్నమైన పథకాలపై దుమ్మెత్తిపోయడమే వీళ్లు చేసిన పని. చివరికి ఈ విమర్శలు చేస్తున్నవాళ్లు కూడా ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందుతున్నవాళ్లే. అది రైతుబంధు కావచ్చు, కాళేశ్వరం జలాలు కావచ్చు.
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన పెత్తందారీ ఆధిపత్యవర్గాలు తిరిగి తమ పట్టును సాధించుకునేందుకు గత తొమ్మిదేండ్లుగా తెగ తంటాలు పడుతున్నాయి. కానీ ప్రజలు మాత్రం రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతున్న పునర్నిర్మాణానికే ఓటు వేశారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంతో ముందుకుసాగుతున్న కేసీఆర్‌నే తమ పాలకునిగా గుర్తించారు.
దేశాన్ని ఇప్పటిదాకా ఏలిన ఏలికలు ఒకరు మందిరాల్లో మంటలు రేపుతూ, మరొకరు మతాల మంటలు రేపుతూ, ఒకరు గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి గద్దెనెక్కటం మాత్రమే చేశారు. ఒకరు దేశంలోని పెట్టుబడిదారులకు దేశాన్ని రాసిస్తే, మరొకరు దేశాన్ని అంబానీ, ఆదానీలకు రాసిచ్చారు. ఒకరికి అన్ని రాష్ర్టాల్లో బలం ఉండదు. అన్ని పార్టీలను చీల్చటం, ఒక గుంపునకు వంతపాడి ప్రభుత్వాలను కూల్చటం చేస్తున్నారు. తమను ఒప్పుకోని రాష్ట్ర ప్రభుత్వాలకు మొండిచేతులు చూపిస్తున్నారు. స్వతంత్రంగా నిలబడ్డ రాష్ర్టాలపై గవర్నర్లతో దాడులు చేయిస్తున్నారు. ఈ రాజకీయాలను చెలాయిస్తున్న ఈ రెండు గుంపులు తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వంతో ముందుకుసాగుతున్న బీఆర్ఎస్పై చేసే విమర్శలను ప్రజలు అర్థం చేసుకుంటారు. ఎన్నికలనగానే అధికార పీఠాలపై గద్దెనెక్కటానికి చేయగూడని చెత్త చర్చలనేకం వేదికల మీదికి తెస్తారని ప్రజలకు బాగా తెలుసు.
భారత పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యవస్థను 75 ఏండ్లుగా దిగజారుస్తూనే ఉన్నారు. ఎన్నికల్లో గెలవటం కోసమే రాజకీయాలను ఎట్లంటే అట్ల తమకు అనుకూలంగా మలుచుకునే దశకు తీసుకొచ్చారు. రాజకీయాలంటే ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి మాయమచ్చీంద్రలు చేసి అబ్రకదబ్రల మ్యాజిక్ వ్యవస్థగా మార్చేశారు. ఎన్నికలు దగ్గరకొస్తున్నాయంటే ఎవరెవరు ఏమేమి మాట్లాడుతున్నారో అర్థం కాని గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నారు. మన దేశం ఇంతగా వెనుకబడటానికి కారకులైనవారే అభివృద్ధి ప్రగతి రథచక్రాల గురించి మాట్లాడటం విడ్డూరం.
తెలంగాణ రాష్ట్రం రాకముందు తన ఊరు ఎట్లుండె? తమ వ్యవసాయం ఎట్లుండె? చెరువులు, సాగు, తాగునీళ్లు, జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయో? గత పదేండ్లలో ఏం ప్రగతి సాధించారో చెప్పుకోవటానికి బీఆర్ఎస్కు విస్తృతి ఉన్నది. ఏ నియోజకవర్గంలోని ఎమ్మెల్యేనడిగినా తమ పరిధిలో గ్రామాలన్నింటికి ప్రజోపయోగమైన పనులు ఎన్ని చేశారో చెప్పటానికి లెక్కలున్నాయి. తెలంగాణలోని ప్రతి గడప దాకా ఏదో ఒక ప్రభుత్వ పథకం ఏ విధంగా ఎట్లా వెళ్లిందో చెప్పగలరు. గ్రామాల్లో జరిగిన పరిణామక్రమాన్ని వివరించగలరు. ప్రజలు ఎవరు ఏది చెప్పినా వినుకుంటూ ఉండేవాళ్లేం కాదు. తమ నియోజకవర్గానికి, తమ ఊర్లకు ఏ కాలంలో ప్రజాప్రతినిధులు ఏ విధంగా ప్రజలకు సేవలందించారో, ఏ ప్రభుత్వం దార్శనికంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకున్నదో వారికి స్పష్టంగా తెలుసు.
ఇలాంటి పాలన మరో నాలుగు కాలాలపాటు ఉండాలని ప్రజలు దీవిస్తున్నారు. ఆసరా పథకం దగ్గర్నుంచి ఆదుకునే పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారు ముఖ్యమంత్రి కేసీఆర్. పాడిపంటల దగ్గరి నుంచి పరిశ్రమల వరకు, ఐటీ రంగం నుంచి చేనేత రంగం వరకు వేగవంతమైన అపూర్వ అభివృద్ధి జరిగింది.
దేశంలో ఎన్నో జీవ నదులున్నాయి. వాటిని బీళ్లకు మళ్లిం చి ఇంటింటికీ మంచినీళ్లనందించేందుకు జట్టు కడదాం రమ్మంటున్నది బీఆర్ఎస్. ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు మంచి చదువు, మంచి ఆరోగ్యం అందించటానికి టీములు ఎన్నయి నా కడదాం రమ్మంటున్నది. పట్టెడన్నం కోసం ఎవ్వరు డొక్కచేత పట్టుకోవద్దని ప్రతినబూనే టీములు కడదాం రమ్మంటున్నది. మనిషిని మనిషి గౌరవించే వ్యవస్థ నిర్మాణం కోసం సామూహిక టీమ్‌లు కడదాం రమ్మంటున్నది. గంగా జమునా తెహజీబ్ టీమ్ కడదాం రమ్మని, తెలంగాణ ప్రజలందరినీ ఒక జట్టు చేసి అభివృద్ధి టీం కడదాం రమ్మని పిలుస్తున్నది. తెలంగాణ దేశానికి ధాన్యాగారంగా మారింది. ఇప్పుడు వ్యవసాయాధారిత పరిశ్రమలను నెలకొల్పేందుకు జట్లు కట్టి సంపదలను సృష్టిద్దాం. ఆ సంపదలను సమంగా పంచిపెట్టడానికి టీమ్‌లు కడదాం రమ్మంటున్నది. నిజానికి బీఆర్ఎస్ నిరుపేదల ఏ టీమ్. పీడితుల ఏ టీమ్. బాధితుల ఏ టీమ్. చేయూతలో ఏ టీమ్. ఆదుకోవడంలోనూ ఏ టీమ్. ఈ విషయం ప్రజలకు స్పష్టంగా తెలుసు. తప్పుడు ఆరోపణలు చేసే పార్టీలను జడ్ టీమ్‌గా మిగల్చడం కూడా ప్రజలకు తెలుసు.
– త్రినేత్రుడు